CM Revanth Reddy: ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసేయం..

ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలను.. విద్యార్థులు రావట్లేదన్న కారణంగా మూసివేయవద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Published : 11 Jun 2024 05:48 IST

బడుల పునర్నిర్మాణానికి రూ.2 వేల కోట్లు
మోదీ, చంద్రబాబు, నేను.. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాం 
ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల్లో 90 శాతం అక్కడ చదివిన వారే
ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని సుమన్‌ ఉమకు ప్రతిభా పురస్కార ధ్రువపత్రం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో రఘోత్తమ్‌రెడ్డి, డి.ప్రకాష్, బుర్రా వెంకటేశం, 
వీసీ సజ్జనార్, రవీందర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలను.. విద్యార్థులు రావట్లేదన్న కారణంగా మూసివేయవద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. ప్రతి గ్రామం, తండాకు విద్యను అందించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ‘ప్రభుత్వ పాఠశాలలను మూసివేయకుండా ఉండేందుకే మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నాం. 11 వేల పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చాం. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలు పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నాం. పాఠశాల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభించాం. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ‘ఆచార్య జయశంకర్‌ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మధ్యాహ్న భోజనం నుంచి ఏకరూప దుస్తుల వరకు ప్రతి బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను కూడా ఆ సంఘాలే చూస్తాయి. అందుకోసం గ్రీన్‌ ఛానల్‌ ద్వారా నిధులు విడుదల చేస్తున్నాం. మోదీ, చంద్రబాబు, నేను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులమే. 90 శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులూ సర్కారు బడుల్లో చదివినవారే. ‘వందేమాతరం’ ఫౌండేషన్‌ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పట్టుదలతో రాణించగలరని నిరూపించారు. 

ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులతో కలిసి విజయసూచిక చూపిస్తున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో వేం నరేందర్‌రెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి, డి.ప్రకాష్, బుర్రా వెంకటేశం, వీసీ సజ్జనార్, రవీందర్, శ్రీదేవసేన 

సెమీ రెసిడెన్షియల్‌ విధానంపై దృష్టి

ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్‌ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చిరుతిళ్లు అందించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. పూర్తి రెసిడెన్షియల్‌ విధానం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు. విద్యపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి. దీనివల్ల సమాజానికి లాభం చేకూరుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. అనంతరం వేర్వేరు జిల్లాల నుంచి హాజరైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, పతకాలు అందజేశారు. సబ్బండవర్గాలూ ప్రభుత్వ పాఠశాలలనే నమ్ముకున్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని వందేమాతరం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రవీందర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్‌ శ్రీదేవసేన, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ డి.ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులు ప్రారంభించాలి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నావా? అంటూ ఎగతాళిగా మాట్లాడేవారి ముందే గర్వంగా తలెత్తుకునేలా 10కి 10 జీపీఏ సాధించి చూపించాం. బడుల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే అద్భుతాలు సాధ్యం’ అని వరంగల్‌ జిల్లా కృష్ణ కాలనీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని  భువనకృతి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘ప్రైవేటు పాఠశాలల్లో ఐఐటీ, జేఈఈ ఫౌండేషన్‌ కోర్సులు ఐదో తరగతి నుంచే ఉన్నాయి. అలాంటి కోర్సులను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. మధ్యాహ్న భోజనం, రవాణా సౌకర్యాలు విస్తృత స్థాయిలో కల్పించాలి’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని