CM Revanth Reddy: కీరవాణితో సీఎం రేవంత్‌ భేటీ.. ‘జయ జయహే తెలంగాణ’ ట్యూన్లపై చర్చ

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’కు స్వరకల్పన చేస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

Published : 27 May 2024 03:08 IST

స్టూడియోలో సీఎం రేవంత్‌రెడ్డి, కీరవాణి, సీపీఆర్‌ఓ అయోధ్యరెడ్డి, గీత రచయిత అందెశ్రీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’కు స్వరకల్పన చేస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ గీతాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. సుమారు 6 నిమిషాల నిడివి కలిగి ఇప్పటికే ప్రాచుర్యం పొందిన గీతాన్ని అలాగే ఉంచి స్వరకల్పన చేస్తున్నారు. దీంతోపాటు అధికారిక కార్యక్రమాల్లో ఆలాపనకు వీలుగా 60 నుంచి 90 సెకన్లకు ఈ గీతాన్ని కుదించనున్నారు. ప్రధాన గీతంలోని ప్రాధాన్యం తగ్గకుండా నిడివిని తగ్గించే బాధ్యతను అందెశ్రీకే అప్పగించారు. ఈ రెండింటికీ స్వరకల్పన చేసే బాధ్యతను కీరవాణి చేపట్టారు. దీని పురోగతిపై చర్చించడానికి హైదరాబాద్‌ మణికొండలోని కీరవాణి మ్యూజికల్‌ స్టూడియోకు ఆదివారం ముఖ్యమంత్రి వచ్చారు. ఈ సందర్భంగా తాను స్వరపర్చిన కొన్ని ట్యూన్లను కీరవాణి వినిపించగా.. రేవంత్‌రెడ్డి కొన్ని సవరణలు సూచించారు. ఆవిర్భావ దినోత్సవం నాటికి రెండు రకాల గీతాల ట్యూన్లను సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత అందెశ్రీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఆర్‌ఓ అయోధ్యరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు