CM Revanth Reddy: ధ్యానాన్ని పనిలా కాదు.. పనిని ధ్యానంతో చేయాలి

‘దేశంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతున్నాయి... ఉద్వేగాలు, స్పర్థలు పెంచేలా వాతావరణం కలుషితమవుతోంది... ఈ సమయంలో బుద్ధుడి సందేశాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 24 May 2024 04:23 IST

తథాగతుడి సందేశం దేశానికి అత్యవసరం 

బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్‌లోని ‘మహాబోధి బుద్ధవిహార’లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు బౌద్ధ సన్యాసులు తథాగతుడి విగ్రహాన్ని బహూకరించారు.

ఈనాడు, హైదరాబాద్‌: ‘దేశంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతున్నాయి... ఉద్వేగాలు, స్పర్థలు పెంచేలా వాతావరణం కలుషితమవుతోంది... ఈ సమయంలో బుద్ధుడి సందేశాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణలో బౌద్ధ భిక్షువులకు తగిన గౌరవం ఉంటుందన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌లోని ‘మహాబోధి బుద్ధవిహార’లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఆహ్వానితులతో నిర్వహించే కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచాలని, బుద్ధవిహారలో ఓ పాఠశాలను ఏర్పాటు చేసి బోధనలు చేస్తే బాగుంటుందని సూచించారు.

ధ్యాన మందిర నిర్మాణం...

అన్ని మతాలు కలిపితేనే బౌద్ధమతమని, ధ్యానాన్ని ఒక పనిగా కాకుండా ప్రతి పనినీ ధ్యానంతో చేయాలని బుద్ధుడు బోధించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘రాజ్యం, అధికారం ఉండి కూడా వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో బుద్ధుడు ఈ మార్గాన్ని అనుసరించారు. రెండు వేల ఏళ్లుగా ఆయన సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శంగా ఉందంటే ఆ సంకల్పం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు బుద్ధ విహార కోసం సహకారం అందించారు. ఆ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ధ్యాన మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి ఆర్థిక సహకారం అందిస్తాం. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రతిపాదనలు పంపితే పరిశీలించి నిధులు మంజూరు చేస్తాం’’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా బుద్ధ విహారలోని బౌద్ధ భిక్షువులు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి సంయుత్త నికాయ వాల్యూమ్‌-4, అష్టాంగమార్గం  పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, అదనపు డీజీపీ శివధర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, భూపతిరెడ్డి, సంజీవరెడ్డి, కాంగ్రెస్‌ నేత శ్రీగణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని