CM Revanth Reddy: ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోగా తెలంగాణలో రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

Published : 11 Jun 2024 05:47 IST

సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు 

సమావేశంలో సీఎం రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి 

ఈనాడు, హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోగా తెలంగాణలో రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయిలో రైతుల రుణాల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు. రుణమాఫీకి అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్దేశించారు. కటాఫ్‌ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై సోమవారం వ్యవసాయ, సహకారశాఖల అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి విధివిధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులకు సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ, కటాఫ్‌ తేదీ, కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రుణగ్రహీతల విషయంలో ఏం చేయాలి.. తదితర అంశాలపైనా ఈ సందర్భంగా సమాలోచనలు చేశారు. రైతు భరోసా, పంటల బీమా తదితర అంశాలపైనా చర్చించినట్లు తెలిసింది. 


తెలుగు రాష్ట్రాలకు నిధులు తేవాలి 

కేంద్ర మంత్రులకు సీఎం శుభాకాంక్షలు 

కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు అధికంగా నిధులు, పథకాలు, ప్రాజెక్టుల మంజూరుకు కృషి చేయాలని కేంద్రమంత్రులుగా నియమితులైన తెలంగాణ, ఏపీ ఎంపీలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రెండు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్,  కె.రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మలకు ఆయన ‘ఎక్స్‌’లో శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు కృషి చేయాలని ఆయన వారికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని