CM Revanth Reddy: డ్రగ్స్‌ కేసుల్లో సెలెబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు

మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

Updated : 26 May 2024 07:18 IST

అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయండి
కోడ్‌ ముగిశాక ఆకస్మిక తనిఖీలు చేస్తా
నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదు
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ భవనంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో కలిసి పోలీస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, వాతావరణ తదితర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి. ఈవిషయంలో ప్రస్తుతం జరుగుతున్న పనితీరుకన్నా మరింత క్రియాశీలంగా వ్యవహరించాలి. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టండి. సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలి. డ్రగ్స్‌ సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయండి. సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించండి. ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది. మాదకద్రవ్యాలు అనే పదం వింటేనే వణికిపోయేలా చర్యలుండాలి. ఈ క్రమంలో ప్రతిభ కనబరిచే వారిని ప్రోత్సహించండి. తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించండి. తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి’’ అని సీఎం రేవంత్‌ సూచించారు.

ఒకే గొడుగు కిందకు విపత్తు నిర్వహణ

‘‘హైదరాబాద్‌ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలి. ఇందుకు సంబంధించి జూన్‌ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయండి. అవుటర్‌ రింగ్‌రోడ్‌ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలి. 365 రోజులు పనిచేసేలా ఈ వ్యవస్థ ఉండాలి. ఒక్కో ప్రభుత్వ విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించాలి. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. తీసిన పూడికను..  క్వారీ ఏరియాలకు తరలించాలి. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదు. ఓపెన్‌ సెల్లార్‌ గుంతల వద్ద ముందుజాగ్రత్తగా బారికేడింగ్‌ ఉండేలా చర్యలు తీసుకోండి. అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలి. హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించండి. కంటోన్మెంట్‌ ప్రాంతంలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు. పనిచేసే వారిని ప్రోత్సహించి ఉన్నత స్థానాలు కల్పిస్తాం’’ అని సీఎం తెలిపారు.

పోలీస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, వాతావరణ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం

తొలిసారి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు...

సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించారు. ఆయన సీఎం అయ్యాక వివిధ సందర్భాల్లో పర్యటించాలనుకున్నా వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు శనివారం ఈ కేంద్రానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ.. ఆయనకు స్వాగతం పలికారు. కేంద్రంలోని పలు విభాగాలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు