CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడాలి

పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడేలా విధానాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించారు.

Published : 22 May 2024 05:28 IST

చేనేత, మరమగ్గాల ఆధునికీకరణకు వడ్డీ లేని రుణాలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడేలా విధానాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఐఐసీ) ఉన్నతాధికారులతో సీఎం మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. టెక్స్‌టైల్స్‌కు సంబంధించి రాష్ట్రంలోని పవర్‌లూమ్, హ్యాండ్‌లూమ్‌ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఆరు పాలసీలు రూపొందించనున్నట్లు ఆయనకు అధికారులు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ, ఎక్స్‌పోర్ట్, న్యూ లైఫ్‌సైన్సెస్, రివైజ్డ్‌ ఈవీ, మెడికల్‌ టూరిజం, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని వివరించారు. ఎన్నికల కోడ్‌ ముగిసేలోగా పారిశ్రామిక విధానాలను పూర్తిస్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. చేనేత, మరమగ్గాల ఆధునికీకరణపై దృష్టి సారించాలని, ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. చేనేత, మరమగ్గాల ఆధునికీకరణకు ముందుకొచ్చే వారందరికీ వడ్డీ లేని రుణాలివ్వాలని, వారి ఉత్పత్తుల అమ్మకాలకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు విష్ణువర్ధన్‌రెడ్డి, అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని