Global Rice Summit 2024: వరి సాగులో వృద్ధి.. ధాన్యం ఎగుమతులకు ఊతం

ప్రపంచవ్యాప్తంగా వరి సాగులో వృద్ధి, మెరుగైన యాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు, ఎగుమతులకు అవసరమైన నాణ్యత ప్రమాణాలు, విత్తనోత్పత్తి, ఆధునిక రైస్‌మిల్లింగ్‌ విధానాలు తత్సంబంధ అంశాలపై చర్చించే లక్ష్యంతో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు-2024 శుక్రవారం ప్రారంభం కానుంది.

Updated : 07 Jun 2024 06:28 IST

హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు నేడు ప్రారంభం
తొలిరోజు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు,హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా వరి సాగులో వృద్ధి, మెరుగైన యాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు, ఎగుమతులకు అవసరమైన నాణ్యత ప్రమాణాలు, విత్తనోత్పత్తి, ఆధునిక రైస్‌మిల్లింగ్‌ విధానాలు తత్సంబంధ అంశాలపై చర్చించే లక్ష్యంతో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు-2024 శుక్రవారం ప్రారంభం కానుంది. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే సదస్సుకు 150 మంది ఎగుమతిదారులు, దిగుమతిదారులు, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఫిలిప్పీన్స్‌) శాస్త్రవేత్తలు, దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, తెలంగాణలోని అభ్యుదయ రైతులు, రైస్‌ మిల్లర్లు, వరి విత్తన కంపెనీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జరిగే ప్రారంభ కార్యక్రమంలో అంతర్జాతీయ నిత్యావసరాల సంస్థ (ఐసీఐ) అధ్యక్షుడు జెరిమీజివింగర్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రపంచ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య, సంఘాల అధ్యక్షులు ప్రేమ్‌గార్గ్, బీవీ కృష్ణారావు పాల్గొంటారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

చర్చాగోష్ఠులు, సంప్రదింపులు

‘‘సదస్సులో ధాన్యం ఎగుమతులు, దిగుమతుల సమాచారం, ఏఏ దేశాలలో ఏఏ రకాలకు గిరాకీ ఉంది, వాటి నాణ్యత ప్రమాణాలు ఎలా ఉండాలి, బియ్యం మిల్లింగ్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎగుమతులకు అనుకూలమైన వరి రకాల సాగులో యాజమాన్య పద్ధతులు, విత్తనోత్పత్తిలో నవీన పంథా తదితర అంశాలపై చర్చాగోష్ఠులు, సంప్రదింపులు జరుగుతాయి. విదేశీ, దేశీయ పరిశ్రమల ప్రతినిధులు వారివారి ఉత్పత్తులను, ఎగుమతులకు అనుగుణమైన ధాన్యం రకాలను ప్రదర్శిస్తారు. 

తెలంగాణలో సాగయ్యే పలు ధాన్యం రకాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో.. వాటి ఎగుమతులపై కంపెనీల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయి. సదస్సు సందర్భంగా వరిసాగులో తెలంగాణ సాధించిన ప్రగతి, అన్నదాతలకు ప్రభుత్వ సహకారం, ఎగుమతులకు ప్రోత్సాహం ఇతర అంశాల గురించి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు వివరిస్తారు’’ అని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి.


రైతులకు విస్తృత ప్రయోజనాలు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ ప్రభుత్వం, ఐసీఐ సంయుక్తంగా హైదరాబాద్‌లో శుక్ర, శనివారాల్లో నిర్వహించే ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు వల్ల రాష్ట్రంలోని వరి రైతులకు విస్తృత ప్రయోజనాలుంటాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సదస్సు సందర్భంగా గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘వరి సాగుకు అవసరమైన అన్ని వనరులు, సాంకేతికత అందుబాటులోకి వచ్చినా, రైతులకు వాటిల్లే నష్టాలు పెద్ద సవాలుగానే మిగిలిపోయాయి. తెలంగాణ లాంటి ధాన్యం మిగులు రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశాలు అపారంగా ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వెనకబడి ఉన్నాం. ప్రస్తుత సదస్సు రైతులకు, దేశీయ ధాన్యం ఎగుమతిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎగుమతులకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటే రాష్ట్ర రైతాంగం పండించే ధాన్యానికి సరైన ధర లభించడంతో పాటు పెద్ద మొత్తంలో ఉన్న నిల్వలను విక్రయించుకునే వీలు కలుగుతుంది’ అని తుమ్మల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు