CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీతో కలిసి కృషి: రేవంత్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా తన వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 23 May 2024 08:33 IST

మనవడి పుట్టెంట్రుకలు సమర్పించి.. శ్రీవారి సేవలో పాల్గొన్న సీఎం

శ్రీవారి ఆలయం ఎదుట మనవడితో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, కుమార్తె నైమిషా, అల్లుడు సత్యనారాయణరెడ్డి, కుటుంబసభ్యులు

తిరుమల, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా తన వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం 8.37 గంటలకు వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా తితిదే ఈవో తీర్థప్రసాదాలను అందజేశారు. అధికారులు తీర్థప్రసాదాలు అందించి.. శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. అంతకుముందు తన మనవడి పుట్టెంట్రుకల చెల్లింపు మొక్కును కుటుంబసభ్యులతో కలిసి పూర్తి చేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎంను త్వరలో కలిసి రెండు రాష్ట్రాల్లోని సమస్యల పరిష్కారంపై చర్చిస్తానని అన్నారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం, కల్యాణ మండపం నిర్మిస్తామని.. దీనికి ఏపీలో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో వాతావరణం అనుకూలించి సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. రైతులను ఆదుకుని దేశ సంపద పెంచాలన్నది తమ ఆలోచన అని తెలిపారు. రాజకీయాలపై విలేకరులు ప్రస్తావించగా.. తిరుమలలో వాటి ప్రస్తావన వద్దని వారించారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూలైన్‌లో వెళుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, గీత దంపతులు..
కుమార్తె నైమిషా, అల్లుడు సత్యనారాయణరెడ్డి, కుటుంబసభ్యులు

ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. బుధవారం సాయంత్రం తన నివాసం నుంచి జూమ్‌ ద్వారా నేతలతో ఆయన మాట్లాడారు. పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, లోక్‌సభ నియోజకవర్గాల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలి. ఈ నెల 27న పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాలి. ప్రతి ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్‌ బూత్‌లను సందర్శించాలి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వారికి, ప్రభుత్వానికి మధ్య తీన్మార్‌ మల్లన్న వారధిలా పనిచేస్తారు. ఇది తీన్మార్‌ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదు.. కాంగ్రెస్‌ ఎన్నిక అని అందరూ గుర్తుంచుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు