Deepa Das Munshi: నాంపల్లి కోర్టుకు హాజరైన దీపాదాస్‌ మున్షీ

భాజపా నేత ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌ ప్రభాకర్‌పై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ క్రిమినల్‌ పరువునష్టం దావావేశారు.

Published : 08 Jun 2024 05:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా నేత ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌ ప్రభాకర్‌పై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ క్రిమినల్‌ పరువునష్టం దావావేశారు. శుక్రవారం ఆమె నాంపల్లి కోర్టుకు హాజరై స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రభాకర్‌ మాట్లాడారని, ఆయన నుంచి రూ.10 కోట్లు ఇప్పించాలని కోర్టును కోరారు. సుమారు 40 నిమిషాల పాటు స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. తదుపరి విచారణను ఈనెల 24కి కోర్టు వాయిదా వేసింది. ‘కాంగ్రెస్‌ నేతలకు పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ బెంజికార్లు బహుమతిగా తీసుకున్నారని భాజపా నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ అంటేనే అవినీతి, అక్రమాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు’ అని దీపాదాస్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పేరును ప్రస్తావిస్తూ ప్రభాకర్‌ ఆరోపణలు చేశారంటూ ఆధారాలు, వీడియోక్లిప్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. తదుపరి విచారణలో మరిన్ని ఆధారాలు సమర్పిస్తామని ఆమె తరఫు వాదించిన సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ కోర్టుకు తెలిపారు. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్యకర్తలు కోర్టుకు వచ్చారు.

రాధాకిషన్‌రావుకు బెయిల్‌... 

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. ఆయన తల్లి దశదినకర్మ, తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాంపల్లి కోర్టు ఈ నెల 10 నుంచి 14 వరకు ఎస్కార్ట్‌  బెయిల్‌ ఇచ్చింది. రాధాకిషన్‌రావు తల్లి పొట్లపల్లి సరోజినిదేవి (98) మరణించారు. ఇదే కేసులో నిందితులైన తిరుపతన్న, భుజంగరావు తమకు బెయిల్‌ మంజూరు చేయాలని శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. కస్టడీ గడువు పూర్తై జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉండి రెండు నెలలు అయ్యిందని..బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు విచారణ దశలో ఉందని, బెయిల్‌ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టుకు విన్నవించారు. న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు