CR Foundation: మలిసంధ్యలో మరో ప్రపంచం

వారంతా వయసులో ఉండగా... మరో ప్రపంచం కోసం కలలుగన్నారు... ప్రజల కష్టాలనే తమ కష్టాలుగా స్వీకరించారు...  జనస్వామ్యం సాకారానికి ఉద్యమాలు చేశారు... విజయాలు సాధించారు... అనుభవాలను ప్రోది చేసుకున్నారు... కాలం కరిగిపోయి, వయసు పైబడింది!

Updated : 05 Jun 2024 12:39 IST

వయోధికుల గౌరవానికి వేదికగా ‘సీఆర్‌ ఫౌండేషన్‌’
ఈ ఏడాది రజతోత్సవాలు
ఈనాడు - హైదరాబాద్‌

వారంతా వయసులో ఉండగా... మరో ప్రపంచం కోసం కలలుగన్నారు...
ప్రజల కష్టాలనే తమ కష్టాలుగా స్వీకరించారు... 
జనస్వామ్యం సాకారానికి ఉద్యమాలు చేశారు...
విజయాలు సాధించారు... అనుభవాలను ప్రోది చేసుకున్నారు...
కాలం కరిగిపోయి, వయసు పైబడింది!
ఇప్పుడూ మరో ప్రపంచం కోసమే శ్రమిస్తున్నారు...
తమలాంటి వయోధికుల జీవితాలకు మార్గదర్శనం
చేసే బాటలో పయనిస్తున్నారు...! 
వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది... సీఆర్‌ ఫౌండేషన్‌!

అసలేమిటీ ఫౌండేషన్‌..దాన్ని ఎవరి ఆశయాల కోసం..ఎవరు స్థాపించారు. దాని కార్యకలాపాలు ఏమిటి? దాని ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమంలో చేరిన వారు ఆనందమయ జీవనం గడపడానికి దోహదం చేసే పరిస్థితులు అక్కడేం ఉన్నాయి. ఇలా ప్రతి అంశమూ ఆసక్తికరమే.. ఆదర్శప్రాయమే. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆశ్రమం ఈ ఏడాది రజతోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో...

కొన్ని వృద్ధాశ్రమాలకు వెళితే అక్కడి పరిస్థితులు మనల్ని నిరాశా, నిస్పృహలకు గురిచేస్తాయి. వైరాగ్యాన్ని కలిగిస్తాయి. కానీ, హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌ ఆశ్రమం అందుకు పూర్తి భిన్నం. తాము వదిలేసి వచ్చిన సమాజం కోసం ఇంకేదో చేయాలని తపిస్తున్న వారు అక్కడ కనిపిస్తారు. ఎనిమిది పదుల వయసును భారంగా కాకుండా అనుభవాల సారంగా స్వీకరించిన వారు తారసపడతారు. శరీరం సహకరించకున్నా... భావితరాలకు మార్గదర్శనం చేయడానికి ఒక్కో అక్షరాన్ని కూడదీసుకుని పుస్తకాలు రాస్తున్న ఆదర్శమూర్తులు మనకు చెప్పకనే పాఠాలు చెబుతారు. వారి మదినిండా ఉన్న అనుభవాలు, జ్ఞాపకాలు.... అక్కడి 80 వేల గ్రంథాల విజ్ఞాన భాండాగారంతో పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది రజతోత్సవాలు జరుపుకోనున్న ఆశ్రమంలో ప్రస్తుతం 140 మంది ఉండగా... వారిలో 82 మంది మహిళలే. 23 జంటలున్నాయి. ఆశ్రమంలో సగం మంది 80 ఏళ్లు దాటినవారే. 

సీఆర్‌ ఫౌండేషన్‌ వృద్ధాశ్రమం 


చండ్ర మదిలో ఆలోచనలకు జీవం 

క్యారమ్స్‌ ఆడుతున్న ఆశ్రమవాసులు 

కమ్యూనిస్టు అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు తన చివరి రోజుల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన అభిమానులు కమిటీ వేసుకొని మరీ ఆయనకు సేవలందించారు. అయితే, తనలా దేశం కోసం పోరాడిన ఎందరో చరమాంకంలో ఇబ్బందులు పడుతూ గౌరవంగా బతకలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందేవారు. ఆ ఆలోచనలతోనే 1994 ఏప్రిల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. తమను నడిపించిన ఆదర్శమూర్తి ఆశయం నెరవేర్చడానికి కమ్యూనిస్టు నాయకులు అదే ఏడాది సీఆర్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేశారు. ఫౌండేషన్‌ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొండాపూర్‌లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. 1999 అక్టోబరు 2న ఐదుగురు వృద్ధులతో ఆశ్రమ భవనాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కవులు, జర్నలిస్టులు, కళాకారుల్లాంటి వారిని ఆశ్రమంలో చేర్చుకున్నారు. తొలుత ఫౌండేషన్‌ నుంచే నిర్వహణ ఖర్చులు భరించారు. సభ్యుల సంఖ్య పెరగడంతో వారినుంచీ రుసుం తీసుకోవడం ప్రారంభించారు. ఆశ్రమంలోని సభ్యులు ప్రస్తుతం ప్రతినెలా రూ.9 వేలు చెల్లిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేనివారికి ఉచితంగానే వసతి కల్పిస్తున్నారు. గతంలో శని, ఆదివారాలొస్తే వృద్ధుల కుటుంబ సభ్యులొచ్చి ఇళ్లకు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులే వచ్చి ఇక్కడ ఉండిపోతున్నారు. వారికోసం గెస్ట్‌హౌస్‌ కూడా నిర్మించారు. మలిసంధ్యలో వృద్ధులకు గౌరవప్రద జీవితం కల్పిస్తున్న ఆశ్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో ‘వయో శ్రేష్ఠ సమ్మాన్‌’ పురస్కారాన్ని ప్రకటించింది.


అందుబాటులో వైద్యం..

ఆశ్రమంలోనే జనరల్‌ ఫిజీషియన్‌తోపాటు ఇద్దరు నర్సులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. గుంటూరు మెడికల్‌ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించి ఇరాన్‌లో కొంతకాలం పనిచేసి వచ్చిన వైద్యుడు డా.మండవ గోపీనాథ్‌ వైద్య సేవలందిస్తున్నారు. ఎల్‌.వి.ప్రసాద్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా క్లినిక్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు 5 పడకలతో ఐసీయూ ఉంది. అంతకుమించి చికిత్స అవసరమైతే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తారు. కుటుంబ సభ్యులు లేనివారిని నిమ్స్‌లో చేర్పించి ఆశ్రమ నిర్వాహకులే పర్యవేక్షిస్తారు. ఓపెన్‌ జిమ్, వాకింగ్‌ ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చారు. మూడు అంతస్తుల్లోనూ ప్రత్యేక భోజనశాలలు ఉన్నాయి. 110 గదులతోపాటు 3 డార్మెటరీల్లో వసతి సదుపాయం ఉంది. వృద్ధుల సంక్షేమంపై ఆఫీస్‌ బేరర్లు సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, డా.కె.నారాయణ, అజీజ్‌పాషా, జల్లి విల్సన్, పల్లా వెంకట్‌రెడ్డి, చెన్నమనేని వెంకటేశ్వరరావు, పి.జె.చంద్రశేఖర్‌రావు, మానం ఆంజనేయులు, వి.చెన్నకేశవరావు, పిడికిటి సంధ్యాకుమారి తరచూ సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారు. ‘సీఆర్‌ ప్రోత్సాహంతో జర్మనీలో మెడిసిన్‌ చేశాను. ఆశ్రమంలో ఉన్నవారంతా ఏదో రూపంలో సమాజానికి సేవ చేసినవారే. అందుకే 2003 నుంచి అలాంటివారికి సేవలందిస్తున్నా..’ అని హెల్త్‌సెంటర్‌ డైరెక్టర్‌ డా.రజని తెలిపారు. 


రుచి.. శుచి.. ఆరోగ్యం... 

అంతా వృద్ధులే కావడంతో రుచి.. శుచి.. ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఉదయం 6 గంటలకు టీ/కాఫీ/పాలు.. 8.30 గంటలకు అల్పాహారంతోపాటు ప్రతిరోజూ గుడ్డు, దోర అరటిపండు.. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం.. 3 గంటలకు స్నాక్స్‌తోపాటు టీ.. రాత్రి 7 గంటలకు డిన్నర్‌ ఇస్తున్నారు.


సాంస్కృతిక సౌరభాలకు వేదిక 

ఆశ్రమంలో దాదాపు అందరూ సాంస్కృతిక, ఉద్యమ నేపథ్యం ఉన్నవారే కావడంతో నిత్యం పుస్తకాలపై చర్చలు జరుగుతుంటాయి. ఆశ్రమం ఆవరణలోని ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో వారానికి 1-2 సార్లు పాత సినిమాలు ప్రదర్శిస్తుంటారు. తరచూ సాంస్కృతిక ప్రదర్శనలు నడుస్తుంటాయి. పండగల వేళ.. అంతా కలిసి వేడుక చేసుకుంటారు. కొవిడ్‌ సమయంలోనూ ఆశ్రమాన్ని తెరిచే ఉంచారు. 


ముదిమిలోనూ పుస్తక రచనలు 

డా.రంగనాయకి, ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌

ఆయనకు 95.. ఆమెకు 88.. ఆ వయసులోనూ ఆ దంపతులు పుస్తకరచనలో తలమునకలై ఉన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గొప్పత]నం గురించి విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు తెలియజెప్పే యజ్ఞంలో నిమగ్నమయ్యారు. సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులను ఏళ్ల తరబడి ఔపోసన పట్టి.. వాటిని సరళమైన ఆంగ్లంలోకి అనువదించే క్రతువును భుజానికెత్తుకున్నారు. వినికిడి సమస్య ఉన్న ఆయనకు పుస్తక రచనలో ఊతకర్రగా నిలుస్తున్నారామె. అనురాగానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ దంపతులే ప్రొఫెసర్‌ వేణుగోపాల్, డా.రంగనాయకి. ఆయన గతంలో ఎస్‌వీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తే.. ఆమె విద్యాశాఖలో హిందీపండిట్‌గా సేవలందించారు. ఉద్యోగ విరమణ అనంతరం 1991లో అమెరికాలో ఉన్న కుమార్తె వద్ద కొన్నేళ్లున్నారు. 12 ఏళ్లపాటు ఉపనిషత్తుల గురించి అధ్యయనం చేశారు. పుస్తకరచన నిమిత్తం 2000లో హైదరాబాద్‌ వచ్చారు. అప్పటి నుంచి 24 ఏళ్లుగా హోంనే ఇల్లుగా మలుచుకున్నారు. 12 పుస్తకాలు రచించారు. ‘మాకొచ్చే పింఛను డబ్బులతో హాయిగా కాలక్షేపం చేయొచ్చు. కానీ మన దేశ సంస్కృతి గురించి విదేశాల్లోని భారతీయులు తెలుసుకోవాలనే తపన మమ్మల్ని నిలవనీయలేదు. అందుకే మావంతు కర్తవ్యంగా పుస్తకాలు రచిస్తున్నాం’ అని సమాజంపై బాధ్యతను చాటుకున్నారా దంపతులు.         


కుటుంబ సభ్యులు దగ్గర లేరన్న బాధలేదు 

‘మాది బీబీనగర్‌ సమీపంలోని బ్రాహ్మణపల్లి. 1951 నుంచి 55 వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నా. మల్లు స్వరాజ్యం వద్ద శిక్షణ తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్లి ఆయుధం పట్టా. పోరాటంలోనే పరిచయమైన ఎస్‌వీకే ప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నా. తర్వాత ఆయన వరంగల్‌ జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. సోదరుడు కొమ్మిడి నర్సింహారెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేశారు.16 ఏళ్ల కిత్రం ఆశ్రమానికి వచ్చాను. పిల్లలను మిస్సవుతున్నానన్న బాధ లేదు. కమ్యూనిస్టు నేతలు ఇక్కడికి వచ్చి కలిసిపోతుంటారు’ అని 87 ఏళ్ల తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్‌వీకే సుగుణ తెలిపారు. 


కమ్యూనిటీ లివింగ్‌ అనేది మా నినాదం

నిరాదరణ అనే పదానికి చోటులేకుండా చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రైడ్‌ లివింగ్‌.. కమ్యూనిటీ లివింగ్‌ అనే నినాదంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఫౌండేషన్‌ ఏర్పాటు సమయంలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సహకారం మరువలేనిది. తొలుత చిన్నగా ప్రారంభించాలనుకున్నాం. కానీ కమ్యూనిస్టు దిగ్గజం పేరిట ఏర్పాటయ్యే ఫౌండేషన్‌ గొప్పగా ఉండాలని రామోజీరావు ఆర్థిక తోడ్పాటు అందించారు.

హోం డైరెక్టర్‌ చెన్నకేశవరావు 


80 వేల పుస్తకాలు డిజిటలైజ్‌ చేయబోతున్నాం 

కొండాపూర్‌ ఆశ్రమంలో ప్రస్తుతం ఆసుపత్రి, గ్రంథాలయం, మహిళా శిక్షణ కేంద్రం నిర్వహణలో ఉన్నాయి. ఆసుపత్రికి రోటరీ క్లబ్‌ నిర్వాహకులు రూ.కోటి విలువైన సామగ్రిని అందించారు. ఆశ్రమ లైబ్రరీలోని 80 వేల పుస్తకాల్ని డిజిటలైజ్‌ చేయబోతున్నాం. ప్రస్తుతం ఇక్కడ 140 మంది ఉన్నారు. మరో 300 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారందరికీ అవకాశం కల్పించలేకపోతున్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం సీఆర్‌డీఏలో కేటాయించిన స్థలంలో మరో ఆశ్రమం నిర్మించాలనే యోచన ఉంది.

డా.కె.నారాయణ, ఫౌండేషన్‌ అధ్యక్షుడు, సీపీఐ సీనియర్‌ నేత 


ఇక్కడికొచ్చాక మెరుగైన ఆరోగ్యం 

నాకు ఇద్దరు అమ్మాయిలు. వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆశ్రమంలో ఉంటున్నా. ఇక్కడంతా దాదాపు ఒకే వయసు వాళ్లుండటంతో సులభంగా రోజులు గడిచిపోతుంటాయి. ఇక్కడ చేరిన తర్వాతే చాలామంది ఆరోగ్యం మెరుగవు  తోంది.

అరుణ, సభ్యురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని