Crop Canals: కడగండ్ల కాలువలు

వానాకాలం ఏరువాకకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. సాగునీటి కాలువల్లో ప్రవాహానికి ముందే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేయాల్సిన నీటిపారుదలశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది.

Updated : 28 May 2024 04:43 IST

వానాకాలం సమీపిస్తున్నా మరమ్మతుల ఊసులేదు
ప్రతిపాదనల దశ దాటని పలు పనులు
నిధులున్నా ఏళ్లుగా పూర్తికాని మరికొన్ని నిర్మాణాలు
నీటిపారుదలశాఖ తీరుతో ప్రశ్నార్థకంగా పంటల సాగు

లైనింగ్, బెడ్‌ ఛిద్రమైన ఈ కాలువ ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెంవాగు ప్రాజెక్టు పరిధిలోది. కాలువ పొడవునా ఇదే పరిస్థితి. దీని కింద 7,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో మరమ్మతులకు రూ.80 లక్షలకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు.

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే యంత్రాంగం: వానాకాలం ఏరువాకకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. సాగునీటి కాలువల్లో ప్రవాహానికి ముందే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేయాల్సిన నీటిపారుదలశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ప్రాజెక్టులు, చెరువుల కింద ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కాలువల గండ్లు పూడ్చలేదు. మత్తళ్లకు మరమ్మతులు చేయలేదు. డిస్ట్రిబ్యూటరీల్లోని పొదలు అలాగే ఉన్నాయి. వర్షాలకు దెబ్బతిన్న లైనింగ్, కోతకు గురైన గట్లు, కట్టలను పటిష్ఠంచేసే పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం) పనులకు రూ.300 కోట్ల వరకు  కేటాయిస్తున్నా విడుదలలో జాప్యం జరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండో బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ నిధులు రూ.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి పనుల బిల్లులు రూ.80 కోట్లు బకాయి ఉన్నట్లు అంచనా. ఎన్నికల కోడ్‌లను ముందుగా అంచనా వేసి అత్యవసర పనులపై నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి 2నెలల క్రితం 120 పనులకు మినహాయింపు కోరుతూ ప్రతిపాదనలు పంపగా ఈసీ ఇటీవలే అనుమతించింది. కొద్ది రోజుల్లోనే వర్షాలు రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం...

నాగర్‌కర్నూల్‌ జిల్లా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల(ఎంజీకేఎల్‌ఐ) పథకం కింద ఎల్లూరు జలాశయం నుంచి సింగోటం జలాశయం అంకిరావుపల్లి గేటు వరకు కాలువ లైనింగ్‌ సగం నిర్మించి వదిలేశారు. ఇదే తీరులో జొన్నలబొగుడ జలాశయం నుంచి గుడిపల్లి జలాశయానికి వెళ్లే ప్రధాన కాలువకు రెండేళ్లుగా లైనింగ్‌ పనులు చేయడం లేదు. వర్షాలకు మట్టి కట్టలు కరిగి కాలువలో పూడిక పెరుగుతోంది.  

నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్‌ సమీపంలో సాగర్‌ కింద ఉన్న జాన్‌పహాడ్‌ మేజర్‌ కాలువ లైనింగ్‌ మరమ్మతులకు 2021లో రూ.52 కోట్లు మంజూరయ్యాయి. ఒప్పందం పూర్తయినా మూడేళ్లుగా పనులు ప్రారంభం కాలేదు. నేరేడుచర్ల మండలం ఆర్‌3 మేజర్‌ కాలువ కట్ట కూడా కోతకు గురైంది. 

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో ఉన్న హల్దీ ప్రాజెక్టు కాలువ కింద 2,900 ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏటా కనీసం 400 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. కాలువల్లో పూడిక పేరుకుపోయింది. మరమ్మతులకు రెండేళ్ల క్రితం రూ.20 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. నీరు పారేదారి లేక రైతులే ప్రాజెక్టులో మోటార్లు పెట్టి తోడుకుంటున్నారు. 

గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు కింద 34, 35 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, తూములు, వాటి లైనింగ్‌ శిథిలావస్థకు చేరాయి. వీటి కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు సక్రమంగా లేకపోవడంతో నెట్టెంపాడు ఎత్తిపోతల కింద యాసంగిలో 20 వేల నుంచి 30 వేల ఎకరాలకు నీరందని దుస్థితి నెలకొంది.

జనగామ జిల్లా లింగాల ఘణపూర్‌ మండలంలో నవాబుపేట జలాశయం కాలువ ద్వారా రెండు మండలాల్లోని వందల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. అయితే, చాలా ఏళ్లుగా గేట్లు ఏర్పాటు చేయడం లేదు. దీంతో నీళ్లు వదిలితే లింగాలఘణపూర్‌ మండలానికి బదులుగా పాలకుర్తి వైపు వెళ్తున్నాయి. 

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో జూరాల ప్రాజెక్టు కింద మోట్లంపల్లి శివారులో ఉన్న ఆరో డిస్ట్రిబ్యూటరీ ఇది. ఏటా మరమ్మతులకు ప్రతిపాదనలు పంపడమే తప్ప నిధులు రావడం లేదు. ఈ ఏడాది కూడా రూ.6 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. 

పొదలతో నిండి ఉన్న ఈ కాలువ వికారాబాద్‌ జిల్లా కోటిపల్లి జలాశయం పరిధిలోది. ఈ జలాశయం కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 1967 నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులు లేవు. కాలువలు, తూములు, డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతిన్నాయి. జలాశయ పునరాకృతి, మరమ్మతులకు 2023లో ప్రాజెక్టు ఇంజినీర్లు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపితే రూ.37.50 కోట్లు మంజూరయ్యాయి. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.110 కోట్లతో మరోమారు ప్రతిపాదనలు పెట్టగా మంజూరీపై స్పష్టత లేదు.

  • సంగారెడ్డి జిల్లాలోని అందోలు మండలంలో డాకూరు, నాద్లాపూర్‌ గ్రామాల వద్ద సింగూరు కాలువపై 2020లో తూములు నిర్మించారు. వాటికి ఇప్పటికీ గేట్లు పెట్టలేదు. ప్రాజెక్టు నుంచి నీటిని వదిలితే వృథాగా వెళ్లిపోతున్నాయి. 6 వేల ఎకరాలకు అందాల్సిన సాగునీరు 3 వేల ఎకరాలకే పరిమితమవుతోంది. 
  • ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం లక్నవరం జలాశయం ప్రధాన కాలువకు గత వానాకాలంలో గండి పడగా ఇసుక బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. యాసంగిలో మళ్లీ కోతకు గురవగా ఆ ఇసుక బస్తాలపై కవర్లు కప్పి సరిపెట్టారు. 
  • వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్‌ ప్రాజెక్టు కుడి తూము షెట్టర్‌ పనిచేయడం లేదు. వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు వెళ్లిపోతోంది. మరమ్మతులకు గతేడాది రూ.10 లక్షలకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలోని చెరువులకు గోదావరి నీటిని తరలించేందుకు నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ ప్రధాన కాలువకు గజ్వేల్‌ మండలం కొలుగూరు వద్ద 2022 అక్టోబరులో గండి పడింది. 150 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా కాంక్రీట్‌ పోసి మరమ్మతులు చేసి వదిలేశారు. ఇక్కడ తూము పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 
  • మూడేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం జలాశయం మత్తడి ఉద్ధృతికి కట్ట దెబ్బతిని ఆప్రాన్‌ పగుళ్లు బారింది. దీంతో రూ.2 కోట్లతో మరమ్మతులు చేపట్టినా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ జలాశయం కింద 5100 ఎకరాల ఆయకట్టు ఉంది.   
  • జయశంకర్‌ జిల్లా మల్హర్‌ మండలం బొగ్గులవాగు ప్రాజెక్టు మత్తడి గతేడాది భారీ వర్షాలకు ధ్వంసమైంది. ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు