Telangana: త్వరలో ‘నార్కోటిక్స్‌’ ఠాణాలు..!

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కారు మరింత పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది.

Published : 08 Jun 2024 06:32 IST

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్‌ కేంద్రాలుగా ఏర్పాటు
ఫ్‌ఐఆర్‌ల నమోదు, దర్యాప్తు అక్కణ్నుంచే
నెలాఖరు నుంచి కార్యకలాపాల ప్రారంభానికి సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కారు మరింత పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది. త్వరలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(టీన్యాబ్‌) పోలీస్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుతోపాటు వాటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు టీన్యాబ్‌ ఉన్నతాధికారులు కసరత్తు వేగవంతం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్‌ కేంద్రాలుగా ఠాణాలు పనిచేయబోతున్నాయి. ఈ ఠాణాల్లో మాదకద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన కేసులను నమోదు చేయబోతున్నారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు నుంచి మొదలుకుని, అభియోగపత్రాల దాఖలు వరకు ఆయా ఠాణాల అధికారులే పర్యవేక్షించనున్నారు.

దర్యాప్తులో ఎదురవుతున్న ఇబ్బందులతో..

ప్రస్తుతం మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పక్షంలో వారిని ఆయా ప్రాంతాల్లోని శాంతిభద్రతల ఠాణాలకు అప్పగిస్తున్నారు. ఈ కారణంగా కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల ఠాణాల్లో రోజువారీ కార్యకలాపాల కారణంగా తదుపరి దర్యాప్తును సమర్థంగా, వేగవంతంగా సాగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై మాదకద్రవ్యాలకు సంబంధించిన కీలక కేసుల్ని నార్కోటిక్స్‌ ఠాణాల ద్వారానే పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నార్కోటిక్స్‌ ఠాణాలను ప్రస్తుతానికి హైదరాబాద్‌ నాంపల్లిలోని పాత కలెక్టరేట్‌ కార్యాలయం భవన సముదాయంలో ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరు నుంచే వీటి కేంద్రంగా కేసుల నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు.

క్షేత్రస్థాయి కార్యకలాపాలకు పరిధి విధింపు

నాలుగు పోలీస్‌స్టేషన్లతోపాటు ప్రాంతీయ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెల్‌ల కార్యకలాపాలకు పరిధి విధించారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ పోలీస్‌స్టేషన్‌ హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కార్యకలాపాలు సాగించనుంది. సైబరాబాద్‌ ఠాణా సైబరాబాద్‌ కమిషనరేట్‌తోపాటు సంగారెడ్డి జిల్లా, రాచకొండ ఠాణా రాచకొండ కమిషనరేట్లతోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలు, వరంగల్‌ ఠాణా వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతోపాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కేసుల్ని పర్యవేక్షించనుంది.

 రైళ్లలో మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకునే లక్ష్యంతో వరంగల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం రైల్వే ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు (రైల్వేస్‌ రీజినల్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెంటర్లు) అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటు కానుంది. వాటి పరిధిలో పలు జిల్లాల కేసులను పర్యవేక్షించేలా పరిధులు నిర్ణయించారు.


ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు

ప్రస్తుతమున్న వనరులతో ఠాణాల్లో కార్యకలాపాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీఎస్పీ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌వో)గా ఉండనున్న వీటిని బి లేదా సి గ్రేడ్‌ ఠాణాలుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఒక్కో ఠాణాకు డీఎస్పీతోపాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలను నియమించారు. హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని టీన్యాబ్‌ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలే సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఠాణాలకు బి లేదా సి గ్రేడ్‌ హోదా కల్పించాలని టీన్యాబ్‌ ఉన్నతాధికారులు విన్నవించారు. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తంచేయడంతో ఒక్కో ఠాణాకు 50-70 మంది కానిస్టేబుళ్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే నార్కోటిక్స్‌ ఠాణాల్లో కానిస్టేబుళ్లను నియమించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని