నన్ను నేనే క్షమించుకుంటా!
అమెరికా అధ్యక్షునిగా గద్దె దిగక తప్పదని గ్రహించిన ట్రంప్ దీపం ఉండగానే ఇల్లు సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు...
‘స్వీయ క్షమాభిక్ష’పై ట్రంప్ యోచన
నూతన ప్రభుత్వం విచారణ జరపకుండా ఎత్తుగడ
బైడెన్ ప్రమాణానికి హాజరుకాబోనని ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా గద్దె దిగక తప్పదని గ్రహించిన ట్రంప్ దీపం ఉండగానే ఇల్లు సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షునికి ఉండే విశేష అధికారాలను స్వీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. తన తప్పిదాలపై నూతన ప్రభుత్వం దర్యాప్తు చేయకుండా ఎత్తువేస్తున్నారు. ‘‘స్వీయ క్షమాభిక్ష’’ ద్వారా తప్పులను ప్రక్షాళన చేసుకొని విముక్తి కావాలని ట్రంప్ భావిస్తున్నట్టు అమెరికా మీడియా పేర్కొంది. పదవి నుంచి దిగిపోయేముందు అమెరికా అధ్యక్షులు తప్పుచేసిన తమ స్నేహితులు, పార్టీ నాయకులను కాపాడుకోవడానికి క్షమాభిక్ష పెడుతుంటారు. ప్రస్తుత పరిపాలనతో ఏదోఒక రూపంలో ప్రమేయం ఉన్న తన కుమార్తె ఇవాంక, అల్లుడు జరేడ్ కుష్నర్, కుమారులు ఎరిక్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానిలకు క్షమాభిక్ష ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అధ్యక్షుని హోదాలో తాను చేసిన తప్పిదాలపైనా విచారణ జరపకుండా తనకుతానుగా క్షమించుకోవాలని కూడా భావిస్తున్నారు.
అసలు సాధ్యమేనా?
అధ్యక్షుడే తనకు తానుగా క్షమాభిక్ష ఇచ్చుకోవాలని అనుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటి నుంచే ‘స్వీయ క్షమాభిక్ష’పై ట్రంప్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే వచ్చే పరిణామాలపై న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. 2018 జూన్‌లోనే దీనిపై ట్రంప్ ట్వీట్ చేశారు. ‘‘నేను చాలా మంది న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపాను. స్వీయ క్షమాభిక్ష ఇచ్చుకునేందుకు నాకు అధికారాలు ఉన్నాయి.’’ అని దాంట్లో పేర్కొన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదని పలువురు అంటున్నారు.
ఓ మార్గం లేకపోలేదు...
ట్రంప్‌ను క్షమించడానికి ఓ మార్గం లేకపోలేదని మరికొందరు చెబుతున్నారు. గతంలో న్యాయశాఖ పంపించిన ఓ మెమోను ఆధారంగా చూపుతున్నారు. దాని ప్రకారం ‘‘ట్రంప్ అధ్యక్షునిగా దిగిపోయి ఉపాధ్యక్షునికి బాధ్యతలు అప్పగించాలి. అప్పుడు అధ్యక్షుని హోదాలో ట్రంప్‌నకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు’’ అని అంటున్నారు. అయితే ఈ మెమోకు చట్టబద్ధత లేకపోవడంతో దీన్ని అమలు చేయడం కష్టమే.
అధికారాన్ని అప్పగిస్తా.. కానీ..: ట్రంప్
జో బైడెన్‌కు అధికారాన్ని బదలాయిస్తానని ట్రంప్ ప్రకటించారు. క్యాపిటల్ భవనంపై తన అనుచరుల దాడిని ఖండించారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని ఇచ్చారు. ‘‘అందరు అమెరికన్ల మాదిరిగానే నేనూ ఆ అల్లర్లపై ఆందోళన చెందాను. నేషనల్ గార్డులు, ఫెడరల్ అధికారులను పిలిపించి భవనానికి భద్రత కల్పించాను. కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ధ్రువీకరించింది. జనవరి 20న అది బాధ్యతలు చేపడుతుంది. అందుకే ఇప్పుడు నా దృష్టంతా సవ్యంగా, ఎలాంటి గొడవలు, అవాంతరాలు లేకుండా అధికారాన్ని బదిలీ చేయడంపైనే ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోనని తెలిపారు.
ఉపాధ్యక్షుడు అధికారాలు ఉపయోగించుకోవాలి
ట్రంప్‌ను పదవి నుంచి తప్పించేందుకు 25వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకోవాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను డెమొక్రాటిక్ పార్టీ కోరింది. ‘‘అధ్యక్షుడు ప్రమాదకరమైన, దేశ ద్రోహపూరితమైన చర్యలకు పాల్పడినందున ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంద’’ని స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనేట్‌లో డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు చుక్ షూమెర్ పేర్కొన్నారు. ట్రంప్‌ను తొలగిస్తూ ఉపాధ్యక్షుడు, మంత్రివర్గమూ నిర్ణయం తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చట్టసభలే ఆ పని చేస్తాయని తెలిపారు.
క్షమాభిక్ష పొందిన అధ్యక్షులు ఉన్నారా?
గతంలో అధ్యక్షునిగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఒక్కరే తాను చేసిన తప్పిదాలకు క్షమాభిక్ష పొందారు. వాటర్‌గేట్ కుంభకోణం కారణంగా ఆయన పదవి నుంచి దిగడంతో ఉపాధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడయ్యారు. నిక్సన్ చేసిన తప్పులన్నింటినీ క్షమించారు. అనంతరం వచ్చిన అధ్యక్ష ఎన్నికల్లో ఫోర్డ్ పోటీ చేయగా, ఓటర్లు ఆయనను తిరస్కరించారు.
ఏమిటీ 25వ సవరణ?
* అమెరికా అధ్యక్షుడి పదవి, నిర్వహణ, రాజీనామా, మరణం... వారసుడి ఎంపిక తదితరాలకు సంబంధించిందే ఈ 25వ రాజ్యాంగ సవరణ.
* అమెరికా అధ్యక్షుడు చనిపోయినా, రాజీనామా చేసినా, పదవిని నిర్వర్తించే పరిస్థితిలో లేకున్నా... ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.
* ఈ సవరణలోని నాలుగో భాగం ఇందులో కీలకమైంది. దీన్నే ఇప్పుడు ప్రయోగించాలని డెమొక్రాట్లు కోరుతున్నారు. ఈ నాలుగో భాగం ప్రకారం- పదవిలో ఉన్న అధ్యక్షుడు తన అసమర్థతను స్వయంగా ప్రకటించుకోలేని పరిస్థితుల్లో... ఉపాధ్యక్షుడు, కేబినెట్ కలసి ఈ నిర్ణయం తీసుకుంటారు. వెంటనే ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చు. ఈ అధికారాన్ని ఇంతవరకు ఎవరూ ఉపయోగించలేదు.
అయిదుకు చేరిన మృతుల సంఖ్య
క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి సంఘటనలో మృతుల సంఖ్య అయిదుకు చేరింది. అల్లర్లలో గాయపడ్డ ఓ పోలీసు అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిలో మొత్తం 50మందికిపైగా పోలీసులు గాయపడ్డారు.
పోలీసు చీఫ్ రాజీనామా ప్రకటన
చట్టసభల భవనంపై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ ఈ నెలలోనే రాజీనామా చేస్తానని క్యాపిటల్ పోలీసు చీఫ్ స్టీవెన్ సండ్ ప్రకటించారు. పోలీసు చీఫ్ రాజీనామా చేయాలని స్పీకర్ నాన్సీ పెలోసీతో పాటు, పలువురు డిమాండు చేశారు. సిక్ లీవులను వినియోగించుకున్న అనంతరం తప్పుకొంటానని సండ్ తెలిపారు. పోలీసులు జాత్యహంకార ధోరణితో వ్యవహరించారని, శ్వేత జాతీయులైన ట్రంప్ అభిమానులు గంటల తరబడి క్యాపిటల్ భవనంలో తిరిగినా ఊరుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు దుర్ఘటనకు బాధ్యత తీసుకుంటూ విద్యాశాఖ మంత్రి బెస్టీ దేవోస్, రవాణా మంత్రి ఎలైన్ ఛావోలు తమ పదవులకు రాజీనామా చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!