CoronaVirus: కరోనా పాపం చైనాదే

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ప్రయోగశాలలోనే పుట్టిందని పుణెకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ మొనాలీ రాహల్కర్‌, డాక్టర్‌ రాహుల్‌ బాహులికర్‌ అభిప్రాయపడ్డారు. తాము

Updated : 07 Jun 2021 07:14 IST

వుహాన్‌ ప్రయోగశాలలోనే దాని ఉద్భవం
ఓ వైరస్‌ జన్యుక్రమాన్ని మార్చిన శాస్త్రవేత్తలు
ఫలితంగానే సార్స్‌-కొవ్‌-2 అవతరణ
బలమైన ఆధారాలున్నాయన్న పుణె శాస్త్రవేత్తల ద్వయం

పుణె: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ప్రయోగశాలలోనే పుట్టిందని పుణెకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ మొనాలీ రాహల్కర్‌, డాక్టర్‌ రాహుల్‌ బాహులికర్‌ అభిప్రాయపడ్డారు. తాము చేసిన పరిశోధనల్లో లభించిన ఆధారాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయని చెప్పారు. గనిలో దొరికిన ఓ వైరస్‌ జన్యుక్రమంలో చైనా శాస్త్రవేత్తలు మార్పులు చేస్తున్న క్రమంలో కరోనా ఉద్భవించి ఉంటుందని పేర్కొన్నారు. భార్యాభర్తలైన మొనాలీ, రాహుల్‌ తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో వైరస్‌ పుట్టుకపై తమ పరిశోధనలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. వివరాలు వారి మాటల్లోనే..
కొవిడ్‌ కారక వైరస్‌ ‘సార్స్‌-కొవ్‌-2’ పుట్టుక మూలాన్ని తెలుసుకునేందుకు 2020 ఏప్రిల్‌లో మేం పరిశోధనలు ప్రారంభించాం. ఇందులో భాగంగా సార్స్‌-కొవ్‌-2కు దగ్గరి బంధువుగా పరిగణించే ‘ఆర్‌ఏటీజీ13’ వైరస్‌, చైనాలో 2012లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు మా దృష్టిని ఆకర్షించాయి. సంబంధిత పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాం. దక్షిణ చైనాలోని మొజియాంగ్‌లో వాడుకలో లేని ఓ రాగి గని ఉండేది. అందులో పేరుకుపోయిన గబ్బిలాల విసర్జితాలను తొలగించే బాధ్యతలను 2012లో ఆరుగురికి అప్పగించారు. ఆ విసర్జితాలను తాకినా, వాటిపై నడిచినా వాటి రేణువులు కొన్ని వాతావరణంలో కలుస్తాయి. అవి అలర్జీకి కారణమవుతాయి.
అన్నీ కొవిడ్‌ లక్షణాలే..
గనిలో విసర్జితాలను తొలగించిన ఆరుగురూ కొన్నాళ్లకే తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం కొవిడ్‌ బాధితుల్లో ఉన్నట్లే.. జ్వరం, దగ్గు, రక్తం గడ్డ కట్టడం వంటి లక్షణాలు వారిలో కనిపించాయి. అలసట, న్యుమోనియానూ వారిలో వైద్యులు గుర్తించారు. వారి రేడియోలాజికల్‌ రిపోర్టులు, సీటీ స్కాన్లు కూడా ఇప్పుడు కొవిడ్‌ బాధితులవి ఉన్నట్లే ఉన్నాయి. తర్వాత ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లూ బయటపడ్డాయి. నాడు బాధితులకు అందించిన ఔషధాలు- ప్రస్తుతం కొవిడ్‌ చికిత్సలో వినియోగిస్తున్న తరహావే. యాంటీవైరల్‌ యాంటీబయోటిక్‌ మందులను కూడా ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో బాధితుల్లో ముగ్గురు మృతిచెందారు. గనిలో పనిచేసిన ఆరుగురికీ ‘ఆర్‌ఏటీజీ13’ సోకినట్లు నిర్ధారణ అయింది.


కొంపముంచిన ప్రయోగాలు

మొజియాంగ్‌ గని నుంచి ‘ఆర్‌ఏటీజీ13’ను వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ శాస్త్రవేత్తలు సేకరించారు. ప్రయోగాల్లో భాగంగా వారు వైరస్‌ జన్యుక్రమంలో మార్పులు చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఆ మార్పుల వల్లే కరోనా అవతరించి ఉండొచ్చు. మనుషులకు నేరుగా, వెంటనే సోకేలా దాని నిర్మాణం ఉంది. ప్రయోగశాలలోనే వైరస్‌ రూపుదిద్దుకొని ఉండొచ్చని ఆ గుణాలు సూచిస్తున్నాయి. సముద్రపు ఆహారాన్ని విక్రయించే మార్కెట్‌ నుంచి సార్స్‌-కొవ్‌-2 పాకిందని చైనాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. కానీ దాన్ని నిర్ధారించే ఆధారాలేవీ లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని