జనం నెత్తిన కాలుష్యం!

: ప్రమాదకర రసాయనాలను కర్మాగారాల్లోనే శుద్ధి చేయాల్సిన కొన్ని కంపెనీలు వాటిని బయటకు వదిలేస్తున్నాయి. శుద్ధి ఖర్చు తగ్గించుకునేందుకు వ్యర్థాల్ని వందల కిలోమీటర్ల దూరం ట్యాంకర్లలో తరలించి.. నీటి వనరుల చెంత, బహిరంగ

Published : 28 Sep 2022 04:02 IST

రసాయన వ్యర్థాల అక్రమ డంపింగ్‌

ఒత్తిళ్ల కారణంగా పీసీబీ నామమాత్రపు చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రమాదకర రసాయనాలను కర్మాగారాల్లోనే శుద్ధి చేయాల్సిన కొన్ని కంపెనీలు వాటిని బయటకు వదిలేస్తున్నాయి. శుద్ధి ఖర్చు తగ్గించుకునేందుకు వ్యర్థాల్ని వందల కిలోమీటర్ల దూరం ట్యాంకర్లలో తరలించి.. నీటి వనరుల చెంత, బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి, పంటలకు, పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లోని కొన్ని పరిశ్రమలు ఈ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నిఘా పెట్టాల్సిన కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నామమాత్రపు చర్యలకే పరిమితమైంది.

చేయాల్సింది ఇదీ..

కర్మాగారాల ఆవరణలోనే వ్యర్థాల నిర్వహణకు జీరో లిక్విడ్‌ డిశ్ఛార్జి (జడ్‌ఎల్‌డీ) ఏర్పాట్లు ఉండాలి. అవి లేని కంపెనీలు దగ్గరలో కామన్‌ ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (సీఈపీటీ)కు తరలించాలి. ఉదయం ఆరు నుంచి సాయంత్రంలోపే ఇది జరగాలి. ఏ నిబంధన పాటించకున్నా, సూర్యాస్తమయం అయ్యాక ట్యాంకర్‌ బయట కనిపించినా కంపెనీని మూసివేయడానికి పీసీబీకి అధికారం ఉంది. కానీ ఒత్తిళ్ల కారణంగా ఇవేవీ అమలు కావడంలేదు.

జాతీయ రహదారిపైనే వ్యర్థాలు

విజయవాడ వైపు పంతంగి టోల్‌గేట్‌ దాటాక, మల్కాపూర్‌, అంకిరెడ్డిగూడెం, ధర్మగూడెంలో జాతీయరహదారి పక్కనే వ్యర్థాల్ని పారబోస్తున్నారు.  హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వరకు మూసీ నదిలోనూ ఇలాగే డంప్‌ చేస్తున్నారు.

పోలీసుల సహకారం కోరతాం

గడ్డపోతారం స్పార్‌ కంపెనీ వ్యర్థాల ట్యాంకరును సూర్యాపేట సమీపంలో పట్టుకున్నాం. వాటిని పారబోయలేదు కనుక మూసివేత ఆదేశాలివ్వకుండా బ్యాంకు గ్యారంటీని జప్తు చేశాం. కొత్తూరులో బెంగాల్‌ కోల్డ్‌స్టోరేజి, సంగారెడ్డి జిల్లాలో శ్రీశ్రీ సాల్వెంట్స్‌, రంగారెడ్డిలో మన్నె ఇంజినీర్స్‌ కంపెనీలకు మూసివేత ఉత్తర్వులిచ్చాం. జాతీయ రహదారిపై నిఘాను మరింత పెంచి సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరతాం.

- రఘు, చీఫ్‌ ఇంజినీర్‌, పీసీబీ


ఇవిగో ఉదంతాలు

సూర్యాపేటలోని మూసీ కాలువలో పది రోజుల కిందట ఓ ట్యాంకర్‌ రసాయన వ్యర్థాలు డంప్‌ చేస్తుంటే పోలీసులు పట్టుకుని అయిదుగురిని అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడ నుంచి వ్యర్థాల్ని తెచ్చినట్లు తేలింది. దాదాపు 175 కి.మీ. దూరం ట్యాంకర్‌ జాతీయ రహదారిపై ప్రయాణించినా పీసీబీ దృష్టికి రాకపోవడం గమనార్హం. వ్యర్థాల్ని ఏ పరిశ్రమ నుంచి తెచ్చారో తెలిశాక చర్యలుంటాయని నల్గొండ జిల్లా పీసీబీ రీజనల్‌ అధికారి సురేష్‌బాబు చెప్పారు.

* గడ్డపోతారంలో మరో కంపెనీ నుంచి వెళ్లిన రసాయన వ్యర్థాల ట్యాంకర్‌ను సూర్యాపేట సమీపంలో పట్టుకున్నారు. ఈ ట్యాంకర్‌లోని వ్యర్థాల నమూనా.. సంబంధిత కంపెనీలో నమూనాతో సరిపోలినా పీసీబీ ‘మూసివేత ఉత్తర్వులు’ ఇవ్వలేదు.

* యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలోని ధోతిగూడెంలో ఉన్న పరిశ్రమల కాలుష్యం వల్ల.. వంద ఎకరాల్లో వ్యవసాయం కుంటుపడింది. 30 మంది బాధిత రైతులకు ఆయా కంపెనీలు ఏటా ఎకరాకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తున్నాయి. ధోతిగూడెంలో ఎనిమిది నెలల్లో మూడు రసాయన వ్యర్థాల ట్యాంకర్లను పట్టుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని