రెండోరోజూ ఐటీ వేట

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఆదాయపన్నుశాఖ (ఐటీ) చేపట్టిన సోదాలు రెండోరోజైన బుధవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఒకదశలో ఉద్రిక్తతకు దారితీశాయి. మంత్రి తనయుడు అస్వస్థతకు గురికావడం, పెద్దఎత్తున అభిమానులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి చేయిదాటుతోందన్న ఆందోళన వ్యక్తమైంది.

Updated : 24 Nov 2022 07:36 IST

ముమ్మరంగా కొనసాగిన సోదాలు
మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత
ఆసుపత్రికి వెళ్లేందుకు అధికారులతో మంత్రి వాగ్వాదం
ఇప్పటివరకూ రూ. 8 కోట్ల స్వాధీనం!
మంత్రి మనవరాలిని ఎస్‌బీఐకి తీసుకెళ్లిన అధికారులు
అక్కడ 12 లాకర్ల గుర్తింపు.. ఎనిమిదింటిని తెరిపించిన వైనం
మా వాళ్లను రాత్రంతా కొట్టారు: మల్లారెడ్డి

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం - హైదరాబాద్‌: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఆదాయపన్నుశాఖ (ఐటీ) చేపట్టిన సోదాలు రెండోరోజైన బుధవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఒకదశలో ఉద్రిక్తతకు దారితీశాయి. మంత్రి తనయుడు అస్వస్థతకు గురికావడం, పెద్దఎత్తున అభిమానులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి చేయిదాటుతోందన్న ఆందోళన వ్యక్తమైంది. మంగళవారం రాత్రి 11.30 గంటల వరకు సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డులు, హార్డ్‌డిస్కులు, నగదు తదితరాలను బోయినపల్లిలోని మల్లారెడ్డి ఇంట్లో ఉన్న ఒక గదిలో పెట్టి తాళం వేశారు. దానికి సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని కాపలాగా పెట్టి మళ్లీ బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తనిఖీలు మొదలుపెట్టారు. రెండు రోజుల సోదాల్లో మొత్తం రూ. 8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మహేందర్‌రెడ్డికి అస్వస్థత

మంత్రి తనయుడు మహేందర్‌రెడ్డి బుధవారం స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనను ఉదయాన్నే సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మంత్రి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కుమారుడి అస్వస్థత గురించి తెలియగానే మల్లారెడ్డి ఆసుపత్రికి బయలుదేరారు. వెళ్లవద్దంటూ అధికారులు నిలువరించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి.. వారితో వాగ్వివాదానికి దిగారు. బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి సూరారంలోని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే వివేకానంద, పెద్దఎత్తున కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఆసుపత్రిలోకి వెళ్లి మహేందర్‌రెడ్డిని పరామర్శించారు. మల్లారెడ్డి తోడల్లుడి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి చేతికి గాయంతో మంగళవారం రాత్రి ఇదే ఆసుపత్రిలో చేరారు. విచారణ కోసం ఐటీ అధికారులు ఆయనను దూలపల్లిలోని అశోక అలమైసన్‌లో ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. కుమారుడి వద్ద ఉన్న మల్లారెడ్డికి ఈ విషయం తెలియడంతో మళ్లీ ప్రవీణ్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కూడా ఆసుపత్రికి తరలించారు. అప్పుడు కూడా అధికారులతో వాగ్వివాదం జరిగింది. సోదాల సందర్భంగా పోలీసులు తోసివేయడంతోనే ప్రవీణ్‌రెడ్డి చేతికి గాయమైందని మల్లారెడ్డి ఆరోపించారు. అప్పటికే పెద్దసంఖ్యలో చేరుకున్న మంత్రి అనుచరులు, కార్యకర్తలతో ఆసుపత్రి ఆవరణ నిండిపోయింది. వారందర్నీ పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు.

ఇది భాజపా కక్షపూరిత చర్య: మల్లారెడ్డి

అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని, తమపై కక్ష కట్టి రెండు రోజులుగా 50 చోట్ల, 200 మంది అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని, మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డిలను రాత్రంతా తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. తెరాసను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్రం.. తప్పుడు మార్గాల్లో తమను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు. తాను నిబంధనల ప్రకారమే ఆసుపత్రులు, వైద్య ఇంజినీరింగ్‌ కళాశాలలు నడుపుతున్నానని.. ఎటువంటి అక్రమ వసూళ్లకు పాల్పడటం లేదని, నిజాయతీగా సంపాదిస్తున్నానని అన్నారు. తాము అధికారులకు సహకరిస్తామని.. కానీ పోలీసులతో దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘నేను ఎన్నో ఏళ్లపాటు కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చాను. నేను హవాలా చేయలేదు. పాల వ్యాపారంతో మొదలుపెట్టి.. విద్యాసంస్థలను స్థాపించాను. భాజపా దాడులకు భయపడేది లేదు’ అని మల్లారెడ్డి అన్నారు.

నిలకడగా మహేందర్‌రెడ్డి ఆరోగ్యం

మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి, ఆసుపత్రి వైద్యులు మహేందర్‌రెడ్డిని పరిశీలించారు. ఈసీజీలో స్వల్ప మార్పులు కనిపించాయని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వరుసగా ఈసీజీ తీస్తామని, ఏవైనా మార్పులు కనిపిస్తే ఇంకా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. మరోవైపు కార్యకర్తల సందడి పెరగడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించి అందరినీ అక్కడి నుంచి పంపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఐటీ అధికారులు.. మళ్లీ ప్రవీణ్‌రెడ్డిని ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు.

స్థలాలు, వ్యాపార పత్రాల పరిశీలన

మంత్రితోపాటు ఆయన సోదరుడు గోపాల్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి నివాసాలతోపాటు న్యూబోయిన్‌పల్లి సీతారాంపురంలోని సీఎంఆర్‌ మోడల్‌ హైస్కూల్‌లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. తొలుత పాఠశాల సిబ్బంది నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమీపంలోని మల్లారెడ్డి వ్యాపార భాగస్వామి నర్సింహయాదవ్‌ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మంత్రి నివాసంలో పనిమనిషి రమ(40)కు మూర్ఛ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. దీంతో అధికారులు ఆమెను మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మంత్రికి సంబంధించి పలు స్థలాల క్రయ, విక్రయాల పత్రాలు, విద్యా, వ్యాపారాలకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండడంతో ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.

మనవరాలిని బ్యాంకుకు.. కోడలిని ఇంటికి..

మంత్రి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డిని ఐటీ అధికారులు బుధవారం కోఠిలోని స్టేట్‌ బ్యాంకుకు తీసుకువెళ్లారు. అక్కడ మొత్తం 12 లాకర్లను గుర్తించి.. ఎనిమిదింటిని తెరిచి చూశారు. కొంపల్లిలో నివసిస్తున్న మంత్రి రెండో కోడలు ప్రీతిరెడ్డిని అధికారులు మల్లారెడ్డి నివాసానికి తీసుకువచ్చారు.


దిల్లీ నుంచి ఉన్నతాధికారి రాక

రెండు రోజులుగా జరుగుతున్న సోదాలను పర్యవేక్షించడానికి దిల్లీ నుంచి డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారి ఒకరు బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులపాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉండటంతో సిబ్బందికి సూచనలు చేసేందుకే ఆయన వచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి ఈ సోదాలను ఆదాయపన్నుశాఖ ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో అర్థం చేసుకోవచ్చు.


క్రాంతి బ్యాంకులో, ఛైర్మన్‌ ఇంట్లో..

బాలానగర్‌లోని క్రాంతి సహకార బ్యాంకు సంస్థల ఛైర్మన్‌ బి.రాజేశ్వరరావు గుప్తా నివాసంతోపాటు ఇదే ప్రాంతంలోని బ్యాంకులోనూ బుధవారం కూడా ఐటీ సోదాలు జరిగాయి. బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా లోపల గదుల్లో రికార్డులు పరిశీలించినట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో ఈయన భాగస్వామిగా ఉండడంతో బ్యాంకు లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని