TS Exams: 8 నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు

ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి నియామకాల్లో కీలకమైన రెండో దశ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం తేదీలను ప్రకటించింది.

Published : 28 Nov 2022 05:14 IST

ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాల్లో రెండో అంకానికి రంగం సిద్ధం
11 వేదికల్లో నిర్వహణ..
పోలీస్‌ నియామక మండలి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి నియామకాల్లో కీలకమైన రెండో దశ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం తేదీలను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక రాతపరీక్షలో అర్హులైన 2,37,862 మంది అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి తొలి వారం వరకూ శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌- పీఈటీ)లు, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ)లు నిర్వహించనుంది. ఇందుకోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేటలో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పరీక్షలకు అర్హత సాధించి, పార్ట్‌-2కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అడ్మిట్‌కార్డులు లేదా ఇంటిమేషన్‌ లెటర్లను ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 29న ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల 3న రాత్రి 12 గంటల వరకు మండలి వెబ్‌సైట్‌ www.tslprb.inలో ఇందుకోసం ఆప్షన్‌ అందుబాటులో ఉండనుంది. ఈ విషయంలో సమస్యలుంటే అభ్యర్థులు 93937 11110 లేదా 93910 05006 నంబరులో సంప్రదించవచ్చని మండలి స్పష్టం చేసింది. support@tslprb.in ఈ-మెయిల్‌కూ ఫిర్యాదులు పంపవచ్చు. అడ్మిట్‌కార్డును అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలని నియామక మండలి సూచించింది. నియామక తుది ప్రక్రియ పూర్తయ్యేవరకు ఈ పత్రాన్ని భద్రపరచుకోవాలని స్పష్టం చేసింది.

సమయానికి రాకుంటే అభ్యర్థిత్వం రద్దు

అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో పేర్కొన్న సమయానికి ముందే వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. గైర్హాజరైన వారి అభ్యర్థిత్వం రద్దవుతుందని మండలి స్పష్టం చేసింది. మైదానాల్లో సామగ్రి భద్రపరచుకునే క్లాక్‌రూంలు అందుబాటులో ఉండవని, అభ్యర్థులు అనవసర లగేజీని వెంట తెచ్చుకోవద్దని సూచించింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు నగలు, హ్యాండ్‌బ్యాగ్‌లు తీసుకురావద్దని ప్రకటించింది. బయోమెట్రిక్‌ తీసుకోనుండటంతో చేతివేళ్లకు మెహిందీ, టాటూలను వేసుకురావద్దని సూచించింది. మైదానాల్లోకి సెల్‌ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని మండలి స్పష్టం చేసింది.

అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల్సినవి..

* అడ్మిట్‌కార్డు/ఇంటిమేషన్‌ లెటర్‌
* పార్ట్‌-2 దరఖాస్తు ప్రింటవుట్‌ కాపీ
* కమ్యూనిటీ సర్టిఫికెట్‌ కాపీ
* డిశ్ఛార్జి బుక్‌/ నిరభ్యంతరపత్రం/ పెన్షన్‌ పేమెంటల్‌ ఆర్డర్‌ కాపీ (మాజీ సైనికోద్యోగులు)
* ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్‌ (గిరిజన అభ్యర్థులు)

తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునఃపరిశీలన

* పోటీల్లో పాల్గొనే అభ్యర్థులపై డిజిటల్‌ నిఘా ఉండనుంది. మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే అభ్యర్థి చేతికి డిజిటల్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ పరిజ్ఞానంతో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ను అటాచ్‌ చేస్తారు. మైదానం నుంచి బయటికి వెళ్లేవరకు దాన్ని అలాగే ఉంచుకోవాలి. దాన్ని చింపేయాలని చూసినా.. ట్యాంపర్‌ చేయాలని ప్రయత్నించినా డిస్‌క్వాలిఫై చేస్తారు.

* అభ్యర్థులు తొలుత పరుగు పందెంలో పాల్గొనాలి. పురుషులు 1600 మీ, మహిళలు 800 మీ. పరుగును నిర్ణీత సమయంలో పూర్తిచేయాలి.

* ఇందులో అర్హత సాధించినవారి ఎత్తు కొలుస్తారు. ఈ పరీక్షలో ఒక సెంటీమీటర్‌ లేదా అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునఃపరిశీలనకు దరఖాస్తు చేయొచ్చు. ఇందుకోసం చీఫ్‌ సూపరింటెండెంట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అలాంటివారికి అదేరోజు చీఫ్‌ సూపరింటెండెంట్‌ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో తిరిగి ఎత్తు కొలిచి నిర్ణయం ప్రకటిస్తారు.

* ఎత్తులో అర్హత సాధించిన వారినే లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు