Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసులో 36 మంది

దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది.

Updated : 01 Dec 2022 08:30 IST

ఆ జాబితాలో కల్వకుంట్ల కవిత, శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్‌, సృజన్‌రెడ్డిల పేర్లు
సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ లీడర్లకు రూ.100 కోట్ల ముడుపులు
ఈ స్కామ్‌లోని వారి చేతుల్లో 170 ఫోన్ల ధ్వంసం
కోర్టుకు సమర్పించిన అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న ఈడీ
ఈనాడు - దిల్లీ

దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. బుధవారం ఇక్కడి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్‌ రిపోర్టు సమర్పించింది. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్‌, సృజన్‌రెడ్డిలు ఉన్నారు.
ఈ కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది గత ఏడాది కాలంలో 170 ఫోన్లను ధ్వంసం చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందిన అయిదుగురు 33 ఫోన్లను ధ్వంసం/మార్పు చేసినట్లు తెలిపింది. కల్వకుంట్ల కవిత 10, శరత్‌రెడ్డి 9, గోరంట్ల బుచ్చిబాబు  6, బోయినపల్లి అభిషేక్‌ 5, సృజన్‌రెడ్డి 3 ఫోన్లను ధ్వంసం/మార్పు చేసినట్లు పేర్కొంది. వారు ఏయే నంబర్ల ఫోన్లు వాడారు? వాటి ఐఎంఈఐ నంబర్లు ఏంటి? ఏయే తేదీల్లో వాటిని ధ్వంసం/మార్చారన్న వివరాలను ఈడీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సవివరంగా పేర్కొంది. ‘‘వేల కోట్ల రూపాయలతో ముడిపడిన ఈ కేసుకు సంబంధించి విలువైన సాక్ష్యాధారాలు, ముడుపులకు సంబంధించిన వివరాలున్న డిజిటల్‌ డేటాను ధ్వంసం చేశారు.

ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం అటు మొబైల్‌ ఫోన్లలో కానీ, ల్యాప్‌టాప్‌ల్లో కానీ నిక్షిప్తమై ఉంది. అయితే కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించడంతో ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములైన/అనుమానితులుగా ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు. ఈడీ అందులో 17 ఫోన్లను రికవరీ చేసింది. అన్నీ దొరికి ఉంటే ఈ కుంభకోణంలో చేతులుమారిన ముడుపులు మరిన్ని వెలుగులోకి వచ్చేవి. దొరికిన ఫోన్లలోనూ డేటాను డిలీట్‌ చేయడమో, ఫార్మాట్‌ చేయడమో జరిగింది. ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఈడీ ఎన్నో పరికరాలను విశ్లేషించి నేరనిరూపణకు సంబంధించిన సమాచారాన్ని వెలికితీసింది. అనుమానితుల్లో చాలామంది కుంభకోణం జరిగిన సమయంలో వాడిన ఫోన్లను మాత్రమే 2022 మే-ఆగస్టుల మధ్య మార్చారు. ఈ ఫోన్లలో మద్యం విధానం ఖరారు నుంచి అమలువరకు సమాచారం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే అందులోని సమాచారాన్ని తీసుకోలేని విధంగా ధ్వంసం చేశారు. ఇందులో ప్రధాన అనుమానితులు, మద్యం వ్యాపారులు, సీనియర్‌ ప్రభుత్వ అధికారులు, దిల్లీ ఎక్సైజ్‌ మంత్రి ఉన్నారు. మరికొందరు పలుసార్లు తమ ఫోన్లను మార్చారు.  అమిత్‌ అరోడా 11 ఫోన్లను వాడటం/మార్చడం/ధ్వంసం చేయడాన్ని బట్టి సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నించినట్లు కనిపించింది’’ అని ఈడీ పేర్కొంది. ఈ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా 2021 అక్టోబరు 14 నుంచి 2022 సెప్టెంబరు మధ్యకాలంలో మొత్తం నాలుగు ఫోన్‌ నంబర్లను ఉయోగించినట్లు, 14 ఫోన్లు ధ్వంసం/మార్పు  చేసినట్లు  కాల్‌ డేటా రికార్డ్‌ ప్రకారం ఈడీ గుర్తించింది. వీరితోపాటు కైలాస్‌ గహ్లోత్‌, సన్నీ మార్వా, కుల్విందర్‌ మార్వా, విజయ్‌నాయర్‌, బృందాపాల్‌సింగ్‌, అమన్‌ధల్‌, సమీర్‌ మహేంద్రు, నితిన్‌ కపూర్‌, గీతిక మహేంద్రు, విభూతి శర్మ, వినోద్‌ చౌహాన్‌, అమిత్‌ అరోడా, సాహిల్‌ అరోడా, దీప్‌ మల్హోత్రా, రాజీందర్‌ చద్దా, అపర్ణ సూద్‌, దీపా చద్దా, రిషి బాలి, దినేష్‌ అరోడా, దీపేందర్‌ షెహ్రావత్‌, అరుణ్‌ పిళ్లై, అర్జున్‌పాండే, వైడంట్‌ చద్దా, బైభవ్‌కుమార్‌ (దిల్లీ సీఎం పీఏ), కర్మజిత్‌ లాంబా, ఉమేష్‌ పరాశర్‌, హరిందర్‌పాల్‌సింగ్‌, హర్జిత్‌ సింగ్‌, గౌతం ఎం, రోహిత్‌ చందరణ్‌ ఉన్నట్లు ఈడీ ఇందులో పేర్కొంది.


అక్రమార్జనకు ఆయుధం..దిల్లీ మద్యం విధానం: ఈడీ

దిల్లీ: ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి అక్రమార్జనకు పాల్పడేందుకు దిల్లీ మద్యం విధానాన్ని కొందరు నేతలు ఒక ఆయుధంలా వాడుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆరోపించింది. వేల కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా చూడడానికి నిందితులు తమ ఫోన్లను ధ్వంసం చేశారని బుధవారం స్థానిక న్యాయస్థానానికి తెలిపింది. ‘‘ఉద్దేశపూర్వక లొసుగులతో విధానాన్ని రూపొందించారు. అక్రమ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు. విధానాన్ని లోతుగా పరిశీలిస్తే విధానకర్తల దురుద్దేశాలేమిటనేది తెలుస్తుంది. నిజాయితీతో కూడిన వ్యాపార విధానాన్ని ప్రోత్సహించడమే ఈ విధానం ఉద్దేశమని గొప్పగా చెబుతున్నా నిజానికి దొడ్డిదారి సిండికేట్లను ఇది ప్రోత్సహించింది. ఆప్‌ నేతల నేరపూరిత కుట్రవల్ల అనైతిక కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించింది. ఆప్‌ నేతల ప్రయోజనాల కోసం దిల్లీ ప్రభుత్వం రూ.581 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. లైసెన్సు ఫీజులు సహా అన్నింటి రూపేణా రూ.2,873 కోట్ల రెవెన్యూను ప్రభుత్వం నష్టపోయింది’’ అని ఈడీ పేర్కొంది. వ్యాపారవేత్త అమిత్‌ అరోడా రిమాండును కోరుతూ ఈ విషయాలు తెలిపింది. దరిమిలా డిసెంబరు 7 వరకు అరోడాను ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఈఐని మూడుసార్లు మార్చిన దిల్లీ రవాణా మంత్రి కైలాస్‌ గహ్లోత్‌ తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా చేసిన కాల్స్‌ వివరాలను ఈడీ సమర్పించింది.


సౌత్‌గ్రూప్‌ నుంచి ముడుపుల పంపిణీ ఇలా...

మద్యం కేసులో ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌..శరత్‌రెడ్డి, కె.కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల నియంత్రణలో ఉన్నట్లు ఈడీ ఈ నివేదికలో పేర్కొంది. ఈ కుంభకోణంలో పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు చేపట్టినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.  ‘‘హోల్‌ సేలర్స్‌కు ఇచ్చిన 12% ప్రాఫిట్‌ మార్జిన్‌లో అర్ధభాగాన్ని ఆప్‌ లీడర్లకు ముడుపుగా అప్పగించడానికి కేటాయించారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం విజయ్‌ నాయర్‌ ఆప్‌ నాయకుల  తరఫున కనీసం రూ.100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్‌ నుంచి అమిత్‌ అరోడాతోపాటు వివిధ వ్యక్తుల ద్వారా అందుకున్నారు. ఆ విషయాన్ని ప్రస్తుతం అరెస్ట్‌ అయిన అమిత్‌ అరోడా తన స్టేట్‌మెంట్ల ద్వారా వెల్లడించారు’’ అని ఈడీ ఈ నివేదికలో పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని