సంక్షిప్త వార్తలు(8)

ఉత్తర, తూర్పు భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated : 01 Dec 2022 06:11 IST

రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర, తూర్పు భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం మధ్యాహ్నం పొడివాతావరణం ఉంటుంది. ఉత్తర గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 నుంచి 4 డిగ్రీలు పడిపోతున్నందున చలి ఎక్కువగా ఉంటోంది. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర శివారు చుట్టుపక్కల ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. నగరంలో కాలుష్యం, భవనాల వల్ల చలి కాస్త తక్కువగా ఉంటోంది.


నేటి వరకూ ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువారం రాత్రి 7 గంటల వరకూ అభ్యర్థులు ప్రాధాన్యక్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని ఆరోగ్య వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


3న వైద్యుల బదిలీలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యుల ప్రత్యేక బదిలీల ప్రక్రియను ఈనెల 3న కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌన్సెలింగ్‌ ద్వారా వీటిని నిర్వహించనున్నారు. ప్రత్యేక అర్హత కలిగిన వైద్యులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన అనంతరం బదిలీలను చేపట్టాలని నిర్ణయిస్తూ ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. అభ్యర్థులందరూ ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.


బియ్యం గడువు మరో నెల పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: గడిచిన ఏడాది వానాకాలం, యాసంగి వ్యవసాయ సీజన్లకు సంబంధించి బియ్యం ఇవ్వాల్సిన గడువును మరో నెల పొడిగిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 2021-22 వానాకాల సీజను బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన గడువు నవంబరు 30తో ముగిసింది. మరో నెల పొడిగించాల్సిందిగా నవంబరు 19న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో కేంద్రం సానుకూలంగా స్పందించి నెల రోజుల గడువు పొడిగించింది. గత యాసంగికి సంబంధించి పొడిగించిన గడువు కూడా బుధవారంతో ముగియనుండటంతో మరో నెల పొడిగించాలంటూ నవంబరు 17న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. గడువును డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ కేంద్రం వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.


ఉపకార వేతనాల రద్దు సరికాదు: యూటీఎఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 1-8వ తరగతి చదివే పేద విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను ఈ విద్యా సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని టీఎస్‌యూటీఎఫ్‌ ఖండించింది. విద్యాహక్కు చట్టం కింద నిర్బంధ ఉచిత విద్య అందిస్తున్నామన్న సాకుతో ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు ఉపకరించే కొద్దిపాటి సహాయాన్ని కూడా నిలిపివేయాలని నిర్ణయించడం దారుణమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆవేదన వ్యక్తం చేశారు.


ఆప్తాల్మిక్‌ అధికారుల నియామకాలకు మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘కంటి వెలుగు’లో భాగంగా ఆప్తాల్మిక్‌ అధికారుల నియామకాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుండడంతో..యుద్ధప్రాతిపదికన సిబ్బందిని నియమించడంపై దృష్టిపెట్టింది. కంటి వెలుగు విజయవంతం కావడానికి మొత్తం 1,491 బృందాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 1500 మంది ఆప్తాల్మిక్‌ అధికారులను నియమించాల్సి ఉండడంతో సంబంధిత మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. నియామక బాధ్యతలను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలకు అప్పగించింది. ఇంటర్వ్యూ విధానంలో నియామకాలు జరుగుతాయి. గురువారం(1వ తేదీ) నాడు జిల్లాల్లో నియామక ప్రకటనలు ఇస్తారు. 5న నేరుగా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 7న అర్హుల జాబితా ప్రకటిస్తారు. అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే 8వ తేదీలోపు స్వీకరిస్తారు. తుది అర్హుల జాబితాను ఈనెల 10న వెల్లడిస్తారు. ఒక్కొక్కరికి నెలకు రూ.30వేల వేతనాన్ని చెల్లిస్తారు.


7 వరకూ ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా సీట్లకు దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్యవర్సిటీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 1న ఉదయం 8 గంటల నుంచి 7న సాయంత్రం 6 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హుల జాబితాను విడుదల చేస్తారు.


పుంజుకోని యాసంగి సాగు

5.76 లక్షల ఎకరాల్లోనే పంటలు
వ్యవసాయ శాఖ తాజా నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత యాసంగి సీజన్‌ ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటినా రాష్ట్రంలో పంటల సాగు ఇంకా పుంజుకోలేదు. సాధారణంకన్నా 75 వేల ఎకరాలు తక్కువగా సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి ఇచ్చిన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ సీజన్‌లో అన్నిరకాల పంటలు కలిపి 47.85 లక్షల ఎకరాల్లో వేయాలి. బుధవారం నాటికి 6.50 లక్షల ఎకరాల్లో సాగు అవ్వాల్సి ఉండగా.. 5.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో అత్యధికంగా 33.53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 5,028 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ప్రధాన పంటలేవీ సాధారణ స్థాయిలో సాగుకాలేదు. పంటల సాగుకు డిసెంబరు నెలాఖరు దాకా సమయం ఉందని, ఆ లోపు సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత వానాకాలం పంటల కోతలు ఇంకా పూర్తికాలేదని, అవి పూర్తయితే యాసంగి సాగు పుంజుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. గత జూన్‌ నుంచి బుధవారం నాటికి సాధారణ వర్షపాతం 840 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 1217 మి.మీ.లు కురిసింది. భూగర్భ జలమట్టాలు పెరిగినందున వరి.. సాధారణంకన్నా అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు మొక్కజొన్న 96,030, సెనగ 2.65 లక్షలు, వేరుసెనగ 1.31 లక్షల ఎకరాల్లో వేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని