నేత కార్మికులకు చేతి నిండా పని

తెలంగాణలో చేనేత, నేత కార్మికులకు ఇక చేతి నిండా పనే. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖలు 2023 సంవత్సరానికి దుస్తులు, దుప్పట్లు, చీరల కోసం రూ.603 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాయి.

Published : 01 Dec 2022 05:04 IST

వచ్చే ఏడాదికి రూ.600 కోట్లకు పైగా ఆర్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో చేనేత, నేత కార్మికులకు ఇక చేతి నిండా పనే. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖలు 2023 సంవత్సరానికి దుస్తులు, దుప్పట్లు, చీరల కోసం రూ.603 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైతం తెలంగాణ నుంచి దుప్పట్లు, బెడ్‌షీట్ల కొనుగోలుకు ముందుకొచ్చింది. ఆర్డర్లకు అనుగుణంగా రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) డిసెంబరు 1 నుంచి వస్త్రాల తయారీని ప్రారంభించనుంది.  వచ్చే ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1.09 కోట్ల చీరల తయారీకి ఆర్డర్‌ ఇచ్చింది. 25 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల(యూనిఫామ్‌) తయారీ; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, కేసీఆర్‌ కిట్ల కోసం 6 లక్షల చీరలు, క్రిస్మస్‌ పండుగ సందర్భంగా 2.85 లక్షల మంది పేద క్రైస్తవులకు ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు, దుస్తులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు 1.50 లక్షల చీరల తయారీ ఆర్డర్లు ప్రస్తుతం టెస్కో చేతిలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం సైతం అక్కడి విద్యార్థుల కోసం 2.50 లక్షల బెడ్‌షీట్లు, 55 వేల దుప్పట్ల కొనుగోలుకు ముందుకొచ్చింది. ఆర్డర్ల మేరకు వస్త్రాల తయారీ ప్రణాళికను టెస్కో రూపొందించింది. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలతో పాటు నేత కార్మికుల ద్వారా వీటిని తయారు చేయించనుంది. అవసరమైన నూలు, పాలిస్టర్‌, రంగులు, రసాయనాలు, ఇతర సామగ్రిని కార్మికులకు ఈ సంస్థ అందజేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని