Vande Bharat Express: ఈ నెలలోనే వందే భారత్‌!

అత్యాధునిక హంగులు..విమాన తరహా ప్రయాణ అనుభూతిని కలిగించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దక్షిణ మధ్య రైల్వేకు మంజూరయ్యింది.

Updated : 04 Dec 2022 11:10 IST

తొలుత సికింద్రాబాద్‌ విజయవాడ మధ్య..
బెర్తుల బోగీలొచ్చాక విశాఖకు

ఈనాడు, హైదరాబాద్‌: అత్యాధునిక హంగులు..విమాన తరహా ప్రయాణ అనుభూతిని కలిగించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దక్షిణ మధ్య రైల్వేకు మంజూరయ్యింది. ఈ మేరకు ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌కి శుక్రవారం అధికారికంగా సమాచారం అందింది. దేశంలో ఇప్పటివరకు అయిదు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలు ఎక్కాయి... కాగా ఇది ఆరోది. ఈ రైలు గరిష్ఠ వేగ సామర్థ్యం గంటకు 180 కిలోమీటర్లు. బయల్దేరిన రెండు నిమిషాల్లోనే 160 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య కాజీపేట మార్గంలో ట్రాక్‌ గరిష్ఠ వేగ సామర్థ్యం గంటకు 130 కిమీ. సికింద్రాబాద్‌-గుంటూరు వయా నల్గొండ మార్గంలో గరిష్ఠ వేగం 110 కి.మీ.   వందేభారత్‌ కోసం ప్రస్తుత ట్రాక్‌ సామర్థ్యాన్ని 180 కి.మీ. గరిష్ఠ వేగానికి పెంచాల్సి ఉంటుంది. డిసెంబరులోనే ఈ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. అన్నీ ఏసీ బోగీలుండే ఈ రైల్లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఖరీదైన ‘అనుభూతి’ కోచ్‌ టికెట్ల కంటే ఎక్కువ ఛార్జీ ఉంటుంది.

రైల్వేమంత్రితో చర్చించిన కిషన్‌రెడ్డి

రాష్ట్రానికి, ద.మ.రైల్వే జోన్‌కి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంజూరులో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చూపిన చొరవ ఫలించింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి, విశాఖపట్నంకు వందే భారత్‌ రైళ్లు కావాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కొద్దివారాల క్రితం స్వయంగా కలిసి కోరారు. మూడురోజుల క్రితం కూడా రైల్వేమంత్రిని మరోసారి కలిసి చర్చించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తున్న పలు రైళ్ల పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఇవ్వడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులపైనా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ద.మ.రైల్వేకి తొలి వందేభారత్‌ మంజూరయ్యింది. ప్రస్తుతం వందేభారత్‌లో సీట్లు మాత్రమే ఉన్నందువల్ల తొలుత విజయవాడ వరకు నడిపిస్తామని.. బెర్తులతో కూడిన వందేభారత్‌ రైళ్లు వచ్చాక విశాఖపట్నం వరకు పొడిగిస్తామని అశ్వినివైష్ణవ్‌ కిషన్‌రెడ్డికి తెలిపారు.

ప్రధానమంత్రి చేతులమీదుగా ప్రారంభం?

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని సమయం కావాలని కిషన్‌రెడ్డి కోరినట్లు సమాచారం. ట్రాక్‌ అప్‌గ్రేడ్‌, సిగ్నలింగ్‌కు సంబంధించిన పనులు, ఇతర రైళ్ల టైంటేబుల్‌ సర్దుబాటు పూర్తవగానే రైలు ప్రారంభం తేదీపై స్పష్టత వస్తుంది. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ కొత్త భవనాలకు ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించేందుకు కూడా భాజపా నాయకులు ప్రయత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కార్యక్రమాలకు ప్రధాని వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని