దివ్యాంగ ఎస్సీలకు దళిత బంధు, రెండు పడకల ఇళ్లలో 5 శాతం: కొప్పుల

దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లలో దివ్యాంగులైన ఎస్సీలకు 5 శాతం కేటాయింపుపై శాఖాపరంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు.

Published : 04 Dec 2022 04:55 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లలో దివ్యాంగులైన ఎస్సీలకు 5 శాతం కేటాయింపుపై శాఖాపరంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర దివ్యాంగులు, వయోధికుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందించిన ప్రణాళికలతో అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, వయోధికులు మంచి జీవితాన్ని గడపాలని, సంతోషంగా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలకు ప్రభుత్వం రూ.20 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 2016లో దివ్యాంగుల సంక్షేమ శాఖను విలీనం చేసిన తరువాత ఆత్మగౌరవం, గుర్తింపు కోల్పోయామని, శాఖను ప్రత్యేకంగానే ఉంచాలంటూ వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని, ఆ శాఖను మళ్లీ వేరు చేశామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఎంప్లాయిమెంట్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆ శాఖ డైరెక్టర్‌ శైలజ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. కారల్‌కామ్‌ సంస్థ అందజేసిన ‘చేయూత’ వాహనాలు,  ప్రత్యేక సంచిక, పీడబ్ల్యూడీ హెల్ప్‌లైన్‌ నంబరు 155326ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి, జీఎం ప్రభంజన్‌రావు, అడ్వయిజరీ బోర్డు సభ్యులు నారా నాగేశ్వరరావు, శ్రీనివాసులు, శ్రీశైలం, సుప్రియలతో పాటు తానా (యూఎస్‌ఏ) రవి సోమినేని, వయోధికుల సంఘం నాయకులు నాగేశ్వరరావు, ట్రాన్స్‌జెండర్‌ ప్రతినిధి సహస్ర పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న దివ్యాంగులు, వారికి చేయూతనిస్తున్న వారికి అవార్డులు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని