డ్రైవర్‌ రహిత కార్లు ఇప్పుడే కాదు

కృత్రిమమేధతో నడిచే... డ్రైవర్‌ లేని స్వయం చోదిత వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరుగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి.

Updated : 05 Dec 2022 03:10 IST

పూర్తిస్థాయిలో సాకారానికి ఇంకా అనేక సవాళ్లు
‘ఈనాడు’తో ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ ఏఐ ప్రొఫెసర్‌ కె.సుబ్బారావు

కృత్రిమమేధతో నడిచే... డ్రైవర్‌ లేని స్వయం చోదిత వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరుగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. దిగ్గజ కంపెనీల హామీలే ఇందుకు కారణం. అయితే ఇది సులువేమీ కాదంటున్నారు... కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో అంతర్జాతీయ నిపుణులు ఆచార్య కె.సుబ్బారావు. అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయం చోదక వాహనాలు, కృత్రిమమేధపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కృత్రిమ మేధను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఏఐ నిపుణుడిగా దీనిపై మీ విశ్లేషణేంటి?

ఏకాగ్రతలో లోపాల వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ‘ప్రిడిక్టివ్‌ ఏఐ నమూనాలు’ కచ్చితంగా ఉపయోగపడతాయి. అనేక ఆధునిక వాహనాల్లో ఇప్పటికే పాక్షికంగా డ్రైవర్‌కు తోడ్పాటు అందించే వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటివి బ్లైండ్‌ స్పాట్‌ వంటివాటిని గుర్తించేలా చోదకులను అప్రమత్తం చేస్తాయి. హమ్‌సేఫర్‌ వంటి యాప్‌లు అమెరికా తదితర  దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. ప్రధానంగా ఆటోమోటివ్‌ బీమా కంపెనీలు వీటిని ఉపయోగిస్తున్నాయి. డ్రైవర్‌ను పర్యవేక్షించడం, తదనుగుణంగా అప్రమత్తం చేయడం చాలా ప్రయోజనకరమే. అయితే చోదకుడి వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించడం, దాని ఆధారంగా డ్రైవర్లకు రేటింగ్‌ ఇవ్వడం వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి.

రోడ్డుపై భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఇతర ఏఐ పరిజ్ఞానాలేంటి?

డ్రైవింగ్‌ తోడ్పాటు వ్యవస్థలను ఆరు విభాగాలుగా చూస్తాం. ఇందులో ‘సున్నా’ అంటే ఎలాంటి ఆటోమేషన్‌ లేదన్నమాట! లెవల్‌ 5 అంటే స్వయంచోదక వాహనం. అయితే ప్రజల దృష్టి ఎక్కువగా లెవల్‌ 4, 5 ఆటోమేషన్‌పై ఉంటోంది. టెస్లా వంటి కంపెనీలు ఇచ్చిన భారీ హామీలే ఇందుకు కారణం. కానీ ఇవేవీ పూర్తిగా ఆచరణలోకి రాలేదు.  కొన్నేళ్లుగా లెవల్‌ 1-3 స్థాయిలో చాలా పురోగతి చోటుచేసుకుంది. ఏఐ సాయంతో డ్రైవర్లకు తోడ్పాటు అందించడం, నిర్దిష్ట సమయాల్లో అప్రమత్తం చేయడం వంటివి వీటి కింద జరుగుతున్నాయి. ప్రమాదం, వాహనం టైర్లు జారిపోయే (స్కిడ్‌) ముప్పులను గుర్తించినప్పుడు అవి స్వయం ప్రతిపత్తి మోడ్‌ (అటానమస్‌)లోకి వెళుతున్నాయి.

విద్యుత్‌ వాహనాలే (ఈవీ) భవిష్యత్‌ రవాణా సాధనాలు. వీటిలో భద్రతను పెంచడానికి ఏఐ తోడ్పడుతుందా?

నిజానికి డ్రైవర్‌ భద్రత, డ్రైవింగ్‌ తోడ్పాటు వంటి అంశాలకు వాహన ఇంజిన్‌తో చాలా వరకూ సంబంధం ఉండదు. ఇంధన సమర్థత, పర్యావరణానికి మేలు దృష్ట్యానే ఈవీలను తెస్తున్నారు. డ్రైవింగ్‌ తోడ్పాటు సాంకేతికతలను చాలావరకూ ఈవీలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం యాదృచ్ఛికమే.  ఈవీలు అందుబాటులోకి వచ్చిన అనేక దేశాల్లో వాహన ధర అంశంపై వినియోగదారులకు పట్టింపు లేకపోవడమే ఇందుకు కారణం. సైద్ధాంతికంగా చూస్తే ఏఐ సాంకేతికతలన్నింటినీ ప్రామాణిక ఇంజిన్లకూ అమర్చవచ్చు.

డ్రైవర్‌ రహిత వాహనాల ఉత్పత్తి, వినియోగానికి అమెరికా నియంత్రణ సంస్థలు అనుమతించాయి. కృత్రిమ మేధలో ఇటీవల అనేక ఆధునిక పోకడలు వచ్చినా.. డ్రైవర్‌రహిత వాహనాలు తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకోలేదు. నిజమైన స్వయంచోదక వాహనాలు రోడ్లపైకి ఎప్పుడు వచ్చే వీలుంది?

టెస్లా, గూగుల్‌ వేమో వంటి కంపెనీలు ఎంతగా ఊరిస్తున్నప్పటికీ  లెవల్‌-4, 5 స్థాయి స్వయం చోదక వాహనాలు రావడానికి చాలా సమయం పడుతుంది. ఎన్నో ఏళ్లుగా రూపకల్పనలో ఉన్నప్పటికీ గూగుల్‌ వేమో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనే స్వయం చోదక ట్యాక్సీలను తెచ్చింది. ఇక్కడ సమస్యేంటంటే.. ప్రామాణికీకరించిన అమెరికా వంటి దేశాల్లోని రోడ్లపైనే ఆకస్మికంగా అనేక ఘటనలు జరగొచ్చు. రోడ్డు క్రమశిక్షణ పెద్దగా పాటించని భారత్‌ వంటి చోట్ల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. అమెరికా లాంటి దేశాల్లోనే ఏఐ వ్యవస్థలకు సురక్షితమైన శిక్షణ ఇవ్వడం కష్టం. ఒకవేళ స్వయం చోదక వాహనాలు వచ్చినా అవి మొదట.. పాదచారులు, ఇతర అవరోధాలు  ఎక్కువగా ఉండే నగరంలోని రోడ్లపై కాకుండా  సిటీ వెలుపల హైవేలపై సాగే సుదీర్ఘ ప్రయాణాల కోసం అందుబాటులోకి రావొచ్చు.

స్వయంచోదక వాహనాలు రోడ్లపై ఉన్న లేన్‌ మార్కర్లను గమనంలోకి తీసుకోవడం ద్వారా అదే లేన్‌లో ప్రయాణిస్తాయని చెబుతున్నారు. భారత్‌లో ఈ మార్కర్లే కాదు.. కొన్నిసార్లు రోడ్లు కూడా ఉండవు కదా..!

లేన్‌ మార్కింగ్‌లు పెద్ద సమస్యేమీ కాదు. ‘డార్పా’ సంస్థ.. స్వయంచోదక వాహనాల కోసం అమెరికాలోని నెవాడా ఎడారిలో పోటీ నిర్వహించింది. అక్కడ ప్రామాణిక మార్కింగ్‌లతో కూడిన రోడ్లేమీ లేవు. ఏఐ తోడ్పాటు ఉన్న వాహనాలు తమ ముందు, పక్కన, వెనుక ఉన్న వాహనాలు ఎంత దూరంలో ఉన్నాయన్నది పరిశీలిస్తూనే ఉంటాయి. సమస్యేమిటంటే.. రోడ్లపైన జరిగే అనూహ్య ఘటనలే. స్వేచ్ఛగా సంచరించే పశువులు, ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా ఇష్టారీతిన రోడ్డును దాటే పాదచారులతో పెద్ద సవాళ్లు పొంచి ఉంటాయి.

భారతీయ వాహనాల్లోని   ఏఐ వ్యవస్థలపై మీ విశ్లేషణేంటి?

లెవల్‌-1, 2 డ్రైవర్‌ తోడ్పాటు సామర్థ్యాలు క్రమంగా భారతీయ వాహనాల్లోకీ వస్తాయి. ఇది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. అయినా వినియోగదారులు కోరుకుంటే తయారీదారులు ఆ సౌకర్యాలను కల్పిస్తారు.

రోడ్డు ప్రమాదం జరగబోతోందని డ్రైవర్‌ను హెచ్చరించడానికి వాహనాల డిజైన్‌లో ఎలాంటి అంశాలను జోడించాలి?

రోడ్డు స్థితిగతులను, ఇతర వాహనాలకు, పాదచారులకు, అవరోధాలకు మన వాహనం ఎంత సమీపంగా ఉంది వంటి అంశాలను పర్యవేక్షించే ఏఐ సాధనాలు వస్తున్నాయి. అలాగే వాహన స్థితికి సంబంధించిన అంశాల (స్కిడ్డింగ్‌ వంటివి)పై నిరంతరం కన్నేసి ఉంచే పరిజ్ఞానాలను జోడిస్తున్నారు.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని