CM KCR: ప్రధానే ప్రభుత్వాన్ని కూల్చేస్తానన్నారు
‘‘తెలంగాణలో ఏ ప్రాంతమైనా మనదే అని మంత్రులు, ఎమ్మెల్యేలతో నేను చెబుతాను. కానీ, ఒక రాష్ట్రం బాగుపడితే కేంద్రం దానికి అడ్డుపడుతుందా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా ఇది.
ఆ స్థాయి వ్యక్తి అనాల్సిన మాటేనా ఇది
తెరాసను అస్థిరపరచాలని చూసిన వారిని జైలులో వేశాం
దేశం బాగుకు తెలంగాణ నుంచే పునాదులు
మహబూబ్‌నగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు డిజిటల్ - మహబూబ్‌నగర్
‘‘తెలంగాణలో ఏ ప్రాంతమైనా మనదే అని మంత్రులు, ఎమ్మెల్యేలతో నేను చెబుతాను. కానీ, ఒక రాష్ట్రం బాగుపడితే కేంద్రం దానికి అడ్డుపడుతుందా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా ఇది. ‘కేసీఆర్! నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా’ అని ప్రధాని స్వయంగా అన్నారు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి. ఆ స్థాయి వ్యక్తి అనాల్సిన మాటలేనా? మీరు ఎలా గెలిచారో.. మేమూ అలానే గెలిచాం. మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచామా? ఏ కారణంతో కూలగొడతారు? బెంగాల్‌కు వెళ్లి మమతా బెనర్జీ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఓ ప్రధానమంత్రి అలా చెప్పవచ్చా?’’అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ శివారులో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, తెరాస జిల్లా కార్యాలయాన్ని సీఎం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘ఈ దేశం కోసమేనా మనం కలలు కన్నది. నాడు మహాత్ముడు, అనేక మంది సమరయోధులు స్వాతంత్య్రం తీసుకొచ్చింది దీని కోసమేనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? చిల్లర రాజకీయాలు కోసం ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ప్రజల మధ్య చీలిక తెచ్చి విద్వేషాలు, భావోద్వేగాలు తెస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు. హైదరాబాద్‌లో దొంగలు పడ్డారు. తెరాస ఎమ్మెల్యేలను చీల్చి, పుల్లలు పెట్టి.. ఇక్కడ అస్థిరపరచాలని చూస్తే దొరకబట్టి జైలులో వేశాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడుతుందని.. కానీ కేంద్రంలో ఆ పద్ధతి లేదని, సహకారం అంతకన్నా లేదని సీఎం ధ్వజమెత్తారు. తాను చెప్పే విషయాలు దినపత్రికలు, టీవీల్లో వస్తున్నాయని, మేధావులూ చెబుతున్నారని చెప్పారు.
కృష్ణాలో వాటా తేల్చాలంటే సమాధానం లేదు..
‘‘నాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు జిల్లాలో సభలు పెట్టి మేము అభివృద్ధి చేస్తామంటే.. మేము చేస్తామన్నారు. వాళ్లు చెప్పేవన్నీ ‘పైన పటారం లోన లొటారం’ మాదిరిగా ఉంటాయి. పాలమూరు కరవు జిల్లా.. నల్గొండ ఫ్లోరైడ్ జిల్లా.. రంగారెడ్డి ఎండిపోయిన జిల్లా. ఈ 3 జిల్లాలతో సంబంధం ఉన్న కృష్ణానదిలో మా వాటా తేల్చాలని 150 దరఖాస్తులు పెట్టాను. కేంద్రానికి దండం పెట్టినా.. కడుపులో తలపెట్టి అడిగినా.. ఇప్పటివరకు సమాధానమే లేదు. వాటా తేల్చడానికే ఎనిమిదేళ్లయితే నిధులు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి? నీళ్లెప్పుడు రావాలి? తెలంగాణ ఏర్పడిన రోజు మన బడ్జెట్ రూ.62 వేల కోట్లు. ఈ రోజు రూ.2.50లక్షల కోట్లు. జీఎస్‌డీపీ రూ.5.50లక్షల కోట్ల నుంచి రూ. 11.50లక్షల కోట్లకు పెరిగింది.
ఓట్లు అడగనని చెప్పాను..
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ అయిదేళ్లలో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పాను. 24 గంటల కరెంట్ రెండేళ్లలో ఇచ్చి తీరుతామని చెప్పాం. రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే తాను కూడా గులాబీ కండువా కప్పుకొంటానని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి సవాల్ చేశారు. కర్షకుల కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు పథకాలు తీసుకొచ్చాం. నా తెలంగాణ రైతు దేశంలోనే కాలర్ ఎగరేసి.. దర్జాగా.. అప్పులు లేకుండా ఉండాలి. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడైనా మన రాష్ట్రంలో ఉన్నట్లు మంచినీళ్ల పథకం ఉందా? ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా తాగడానికి నీళ్లు లేవు. 24 గంటల విద్యుత్తుండదు. దేశ రాజధాని దిల్లీలో కరెంట్ కోతలున్నాయి. మంచి నీళ్లు రావు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు రాములు, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల నష్టం
తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11.50 లక్షల కోట్లు కాదు.. రూ.14.50 లక్షల కోట్లుండేది. అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది.
సీఎం కేసీఆర్
భారాసకు పోదామా...!
నేను మీతో ఉంటాను. మీరు కూడా నాతో ఉండాలి. ఆశీర్వదించాలి. అందరం కలిసి అద్భుతమైన పనులు చేసుకోవాలి. వలసలు పోయినవారు వాపస్ వస్తున్నారు. రైతాంగం తేటపడుతోంది. మనం ఒక్కరం బాగుపడితే కాదు.. దేశం కూడా బాగుపడాలి. అందుకోసం తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిద్దామా? వద్దా? భారాసకు పోదామా? తెలంగాణలా దేశాన్ని బాగు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ఈ గడ్డ నుంచే పునాదులు వేసి మన పేరు బంగారు అక్షరాలతో లిఖిద్దాం.
ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రజలు ఎవరికి అధికారమిస్తే వారు పనిచేయాలి
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారమిస్తే వారు పనిచేయాలి. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. మళ్లీ ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలి. కానీ పనిచేసేవాళ్లను చేయనియ్యబోమన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. మన చుట్టూ ఏం జరుగుతోందో యువకులు, మేధావులు, పెద్దలు తెలుసుకోవాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఈ అంశంపై గ్రామాల్లో చర్చ పెట్టాలి.
సీఎం కేసీఆర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!