JEE Advanced: ఎంత కష్టమో జేఈఈ అడ్వాన్స్‌డ్‌!

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడమే కాదు.. ఒక్కో సబ్జెక్టులో 120 మార్కులకు 20 దక్కించుకోవడమూ గగనంగా మారింది.

Updated : 05 Dec 2022 08:13 IST

ఒక్కో సబ్జెక్టులో 120కి 20 మార్కులు పొందటమే గగనం

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడమే కాదు.. ఒక్కో సబ్జెక్టులో 120 మార్కులకు 20 దక్కించుకోవడమూ గగనంగా మారింది. ఆ మాత్రం పొందేవారు కూడా మొత్తం విద్యార్థుల్లో అతి స్వల్పంగా ఉంటున్నారు. గణితంలో వారు కేవలం 1200 మందే ఉన్నట్లు స్పష్టమైంది. తాజాగా ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జోసా కౌన్సెలింగ్‌పై సమగ్ర నివేదికను విడుదల చేసింది. గత ఆగస్టు 28న పరీక్ష జరపగా.. జోసా కౌన్సెలింగ్‌ అక్టోబరు 17కి ముగిసింది. పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు, వారి సంఖ్య తదితర వివరాలను అందులో పొందుపరిచింది.

రసాయనశాస్త్రంలో 120 మార్కులకు 20 దాటినవారు 2వేలు, భౌతికశాస్త్రంలో 4వేల మందే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసినవారు 1.55 లక్షల మంది ఉన్నారు. దీన్ని బట్టి అడ్వాన్స్‌డ్‌- 2022లో గణితం సబ్జెక్టు బాగా కఠినంగా ఉన్నట్లు స్పష్టమవుతుందని నానో అకాడమి డైరెక్టర్‌ కృష్ణ చైతన్య తెలిపారు. అంతేకాక రసాయనశాస్త్రం కంటే భౌతికశాస్త్రం సులభమని తేలుతుందన్నారు. వాస్తవానికి పరీక్ష జరిగిన ఆగస్టు 28న రసాయనశాస్త్రం సులభంగా ఉందని నిపుణులు చెప్పినా.. తాజా నివేదికను బట్టి భౌతికశాస్త్రమే సులువుగా ఉన్నట్లు తేటతెల్లమైంది. గత ఏడాది జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు 63 (306 మార్కులకు పరీక్ష) కాగా... ఈసారి అది 55కి తగ్గింది. అంటే 55 మార్కులు వచ్చిన వారు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఏటా ప్రశ్నపత్రాల స్థాయి కఠినంగా మారుతోందా? విద్యార్థుల సబ్జెక్టు స్థాయి తగ్గుతోందా? అన్నదానిపై ఐఐటీ ఆచార్యులు అధ్యయనం చేయాలని నిపుణులు కోరుతున్నారు.

మరికొన్ని ముఖ్యాంశాలు...

* ఈసారి మొత్తం 3,310 మంది బాలికలకు సీట్లు దక్కాయి. అత్యధికంగా తిరుపతి ఐఐటీలో 20.7 శాతం మంది సీట్లు పొందగా అతి తక్కువగా ఐఐటీ ఖరగ్‌పుర్‌లో 17.7 శాతం మందికే ప్రవేశాలు లభించాయి.

* విదేశీ విద్యార్థులు 145 మంది అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైనా 66 మందే ప్రవేశాలు పొందారు.

* తొలి 50 ర్యాంకర్లలో 46 మంది బాంబేలో చేరగా.. దిల్లీ, మద్రాస్‌లలో ఒక్కొక్కరు ప్రవేశం పొందారు. ఇద్దరు ఏ ఐఐటీలోనూ చేరలేదు.  

* తొలి వెయ్యి ర్యాంకర్లలో బాంబే-246, దిల్లీ- 210, మద్రాస్‌-110, కాన్పుర్‌-107, ఖరగ్‌పుర్‌-93, గువాహటి-66, రూర్కీ-60, హైదరాబాద్‌- 40, వారణాసి-31,ఇందోర్‌-7, రోపర్‌లో ఒకరు వంతున చేరారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు