అవిశ్వాసాల అలజడి

రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాల అలజడి మొదలైంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు సమాలోచనలు ప్రారంభించారు.

Published : 27 Jan 2023 05:13 IST

పురపాలికల్లో అసంతృప్తుల చర్యలు వేగవంతం
క్యాంపులకు కౌన్సిలర్ల శ్రీకారం
నిలువరిస్తున్న ఎమ్మెల్యేలు
నేటితో ముగియనున్న మూడేళ్ల కాలపరిమితి
సవరణ చట్టం ఆమోదం పొందకపోవడంతో సమస్యలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాల అలజడి మొదలైంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు సమాలోచనలు ప్రారంభించారు. తమ డిమాండ్లు సాధించుకోవడంపై వారు దృష్టిపెట్టారు. రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. 2020 జనవరి 27న కొలువుదీరిన పాలక వర్గాల మూడేళ్ల కాలపరిమితి శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టే ప్రక్రియపై కొందరు ఆరా తీస్తున్నారు. నోటీసు ఎలా ఇవ్వాలి? ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై పురపాలక అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే మూడేళ్ల క్రితం ఛైర్‌పర్సన్‌ పదవులపై ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ పలుచోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను సంప్రదిస్తున్నారు. జగిత్యాలలో విభేదాల నేపథ్యంలో ఛైర్‌పర్సన్‌ రాజీనామా చేయగా, జనగామలో భారాస కౌన్సిలర్లు 11 మంది ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఆర్మూర్‌లో కౌన్సిలర్ల అసంతృప్తి సద్దుమణిగేలా చేశారు. హుజూరాబాద్‌ సహా పలు చోట్ల నేతల మధ్య అంతరం కొనసాగుతోంది. ఒకపక్క అవిశ్వాసంపై చర్చలు జరుగుతుండగా..మరో వైపు అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఇతర పార్టీల కౌన్సిలర్లపై దృష్టి సారించడంతో ఆయా పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఛైర్‌పర్సన్‌ ఆశావహులు సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు ఇతర పార్టీలవారినీ సంప్రదిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే క్యాంపుల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనగామ పురపాలికకు చెందిన 11 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఎనిమిది మంది క్యాంపునకు చేరినట్లు తెలిసింది.

నాలుగేళ్ల చట్టం ఆమోదం పొందకపోవడంతో చిక్కులు

రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. 2023 ఎన్నికల సంవత్సరం కావడం, అవిశ్వాసాల గొడవలు లేకుండా ఉండేలా ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల్లోనే పురపాలక చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాసం పెట్టేలా చట్ట సవరణ చేస్తూ ఉభయ సభలు బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపాయి. పురపాలక బిల్లు సహా ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర పడకపోవడంతో చట్టం అమల్లోకి రాలేదు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు ఇస్తే చట్ట ప్రకారం తాము నడచుకోవాల్సిందే తప్ప ప్రత్యామ్నాయం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్డీఓకు మాత్రమే అవిశ్వాసం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

హామీ అమలుకు పట్టు

2020 జనవరిలో కొన్ని పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్‌ స్థానాల కోసం పలువురు పోటీపడ్డారు. ఆ సందర్భంగా అంతర్గత సమస్యలకు తావులేకుండా చూసేందుకు మూడేళ్ల తర్వాత ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయాలని ఆశావహులైన కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్లు సమాచారం. మిగిలిన రెండేళ్ల కాలానికైనా తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.

వాటాల్లో వివాదం

ఎన్నికై మూడేళ్లయినా ఆశించిన మేర ఆర్థికంగా ప్రయోజనం కలగలేదని పలు చోట్ల కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కొంతమందికి లబ్ధి చేకూరినా మిగిలిన చోట్ల ఈ పరిస్థితి ఉంది. పనులు జరుగుతున్నా, పట్టణ ప్రగతి నిధులు అందుబాటులోకి వస్తున్నా ఆర్థిక ప్రయోజనాలు కొందరికి మాత్రమే ఉంటున్నాయని వారు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో పలు డిమాండ్లను ఛైర్‌పర్సన్ల ముందుంచుతున్నారు. ప్రధానంగా అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్లో వాటాల అంశంపై   దృష్టిసారిస్తున్నారు. కాంట్రాక్టర్లనుంచి వచ్చే కమీషన్ల మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే పలుచోట్ల ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. పూర్వపు వరంగల్‌ జిల్లాలోని ఒక పట్టణ స్థానిక సంస్థలో పాలకవర్గం కాంట్రాక్టర్లు ఇస్తున్న కమీషన్‌ మొత్తాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచుకుంది. వాస్తవంగా వాటా మొత్తాన్ని 11 శాతానికి పెంచాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేయగా కాంట్రాక్టర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. బిల్లుల విడుదలలో జాప్యం, ఇతర సమస్యల నేపథ్యంలో అంత ఇచ్చుకోలేమని.. అవసరమనుకుంటే పనులను మానుకుంటామని కాంట్రాక్టర్లు తేల్చిచెప్పడంతో 9 శాతానికి అంగీకరించినట్లు తెలిసింది.


బుజ్జగింపులకు శ్రీకారం

తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించే చర్యలకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. పురపాలికల్లో ఏం జరుగుతోందనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. తమకు తెలియకుండా కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వేరుకుంపట్లు పెట్టకూడదని, ఆవేదన ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. అసంతృప్తులతో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఎలాంటి ఆవేశపూరిత చర్యలకు వెళ్లకూడదని.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని సర్దిచెబుతున్నారు. ఎమ్మెల్యేలనే కొందరు కౌన్సిలర్లు కలసి ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని