సంక్షిప్త వార్తలు(8)
రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు శీతల వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
రాష్ట్రంలో మరికొన్ని రోజులు చలి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు శీతల వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని చాలా చోట్ల 11.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా రాచూరులో కనిష్ఠంగా 10.6 డిగ్రీల సెల్సియస్, తాళ్లపల్లిలో 10.6, ఎలిమినేడులో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్బీనగర్‌లో 14.7 డిగ్రీలు ఉంది. గురువారం మధ్యాహ్నం భద్రాద్రి జిల్లా యానంభైలులో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.9 డిగ్రీలుగా నమోదయింది.
రాష్ట్రంలో పర్యాటకానికి పెద్దపీట: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఆధ్యాత్మిక, వైద్య, వన్యప్రాణి పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక, బుద్ధవనం ప్రాజెక్టు అధికారులను ఆయన సన్మానించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, బౌద్ధానికి పూర్వవైభవం తీసుకువచ్చేలా బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ప్రతి జిల్లాలో మెడికల్ బోర్డు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో అవసరమైన వారికి కీలక వైద్యపరీక్షల నిమిత్తం జిల్లాల్లోనే ప్రత్యేక మెడికల్ బోర్డులను ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌తో సంప్రదించి ప్రతి జిల్లాలోనూ రెండు మూడు రోజులపాటు మెడికల్‌బోర్డులు అందుబాటులో ఉంచాలని వైద్య విద్య డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌లను గురువారం ఆదేశించారు.
ప్రసార మాధ్యమాల్లో లింగ చైతన్యంపై సదస్సు
ఫిబ్రవరి 3న.. వేదిక టి-హబ్
ఈనాడు, హైదరాబాద్: ప్రసార మాధ్యమాల్లో లింగ చైతన్యంపై ఇంటర్నేషనల్ అడ్వర్‌టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) భారత విభాగం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3న టి-హబ్‌లో జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా యునిసెఫ్ వ్యవహరించనుంది. 30 సెకన్ల వ్యాపార ప్రకటన నుంచి 3 గంటల నిడివి గల సినిమాల్లోనూ ‘మహిళలను చిత్రీకరిస్తున్న తీరు’ ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశం. ఈ విషయంలో సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు వివరిస్తారు. ఐఏఏ చొరవతో నిర్వహిస్తున్న ‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’ అనే కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన సదస్సును నిర్వహించనున్నారు.
రూ.38,070 కోట్లతో విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేశాం: సీఎండీ ప్రభాకర్‌రావు
ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా, పంపిణీల నెట్‌వర్క్‌ను రూ.38,070 కోట్ల వ్యయంతో బలోపేతం చేశామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. అంతరాయంలేని విద్యుత్తు సరఫరా కోసం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 400 కేవీ రింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్తు సౌధలో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోతలు లేకుండా అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.
నిర్ణీత వ్యవధిలో పోస్టుల భర్తీ చేసేలా పనిచేయాలి
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను నిర్ణీత కాలవ్యవధిలో భర్తీచేసేందుకు కమిషన్ సిబ్బంది ఓ లక్ష్యంతో పనిచేయాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి సూచించారు. తక్కువ సంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికీ కష్టపడి పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. గురువారం ఆయన కమిషన్ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
నేటి నుంచి హోమియోపతి
ఎండీ యాజమాన్య కోటా సీట్ల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు హోమియో వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో హోమియో ఎండీ సీట్లను భర్తీ చేయడానికి కాళోజీ వర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి వచ్చే నెల 3న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
డయాఫ్రం వాల్ గ్యాప్-1లో పరీక్షలు ప్రారంభం
పోలవరం, దేవీపట్నం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గురువారం డయాఫ్రం వాల్ గ్యాప్-1లో నాణ్యత పరీక్షలు ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అంగళూరు సమీపంలో డయాఫ్రం వాల్‌ను జాతీయ జల విద్యుత్తు బోర్డు డైరెక్టర్ ఎస్‌ఎల్ కపిల్, నిపుణుల బృందంతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందంసహా కపిల్.. నిపుణులకు పలు సూచనలు చేశారు. హరియాణా నుంచి తీసుకొచ్చిన పరికరాలతో గ్యాప్-1లో పరీక్షలకు శ్రీకారం చుట్టారు.
విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోంగార్డుల వినతి
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరైనందుకు ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి తీసుకోవాలని మాజీ హోంగార్డులు గురువారం విన్నవించారు. వినతిపత్రాన్ని హోంమంత్రి మహమూద్‌అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావులకు అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
TikTok- China: కంపెనీల నుంచి విదేశాల డేటా అడగదట..!
-
General News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
India News
Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలం..!’
-
General News
Hyderabad: ఎల్బీనగర్‌లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్