రాజ్‌భవన్‌.. రాష్ట్ర ప్రభుత్వం.. రాజీ

బడ్జెట్‌ ఆమోదానికి సంబంధించి గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదానికి హైకోర్టు వేదికగా తెరపడింది. గవర్నర్‌కు ఆదేశాలిచ్చే పరిధి ఈ కోర్టుకు లేదని బహిరంగంగా చెబుతూనే ఇరుపక్షాలు చర్చించుకుని ముగింపు పలకాలని హైకోర్టు సూచించింది.

Updated : 31 Jan 2023 06:57 IST

బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతి
అసెంబ్లీకి రావాలంటూ ఆమెకు ఆహ్వానం పంపుతాం
అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం
మంత్రి వివరణతో పెండింగ్‌ బిల్లుల పరిష్కారానికి ఆమోదం
హైకోర్టులో పిటిషన్‌ నేపథ్యంలో ఇరుపక్షాల అంగీకారం
పిటిషన్‌పై విచారణ మూసివేత

ఈనాడు, హైదరాబాద్‌: బడ్జెట్‌ ఆమోదానికి సంబంధించి గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదానికి హైకోర్టు వేదికగా తెరపడింది. గవర్నర్‌కు ఆదేశాలిచ్చే పరిధి ఈ కోర్టుకు లేదని బహిరంగంగా చెబుతూనే ఇరుపక్షాలు చర్చించుకుని ముగింపు పలకాలని హైకోర్టు సూచించింది. 2023-24 బడ్జెట్‌కు గవర్నర్‌ నుంచి ఆమోదం లభించని నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ధర్మాసనం సూచనల మేరకు రాజ్యాంగ సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాదుల చర్చల్లో మధ్యేమార్గంగా ఇరుపక్షాలు సంధికి అంగీకరించాయి. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు, గవర్నర్‌తరఫున సీనియర్‌ న్యాయవాది అశోక్‌ ఆనంద్‌కుమార్‌లు భోజన విరామ సమయంలో చర్చించారు. వీటి ప్రకారం ఫిబ్రవరి 3న బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికిగాను సంబంధిత మంత్రి గవర్నరును ఆహ్వానించాల్సి ఉంది. ఆ మేరకు గవర్నర్‌ ఆమోదం తెలియజేయాలి. మంత్రిమండలి సిద్ధం చేసిన ప్రసంగ ప్రతిని గవర్నర్‌ అసెంబ్లీలో చదవాలి. పెండింగ్‌లో ఉన్న ఇతర బిల్లులకు ఆమోదం చెప్పాలి. అభ్యంతరాలపై సంబంధిత మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇవ్వాలి.

ఫిబ్రవరి 3న 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతి మంజూరు చేయకపోవడంతో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి అనుమతించాలంటూ సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు అడ్వొకేట్‌ జనరల్‌ అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం అనుమతించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి పిటిషన్‌ దాఖలు చేశారు. ధర్మాసనం అనుమతించడంతో సాధారణ పరిపాలన శాఖ తరఫు న్యాయవాది సీహెచ్‌.కళ్యాణ్‌రావు పిటిషన్‌ దాఖలు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారు?

ఈ పిటిషన్‌పై తామెలా విచారణ చేపట్టగలమని ధర్మాసనం ప్రశ్నించింది. గవర్నర్‌ విధుల్లోకి తాము ఎలా జోక్యం చేసుకోవాలంది. ఈ వివాదంలోకి న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ తన పరిధిని అతిక్రమించి మరో వ్యవస్థలోకి ఎలా చొచ్చుకుపోతుందంది. ఈ కోర్టు గవర్నర్‌కు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయగలదని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ న్యాయసమీక్షకు అవకాశం ఉందని, ఇదే విషయాన్ని షంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టత ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అందరికీ శిరోధార్యమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 200 ప్రకారం ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ప్రభుత్వ బాధ్యత అని, దాన్ని గడువులోగా సమర్పించాల్సి ఉందన్నారు. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. మంత్రిమండలి సలహా మేరకు ఆమోదించాల్సిందేనని, అంతేగానీ వ్యక్తిగత సంతృప్తి అవసరంలేదన్నారు. రాజ్యాంగ నిబంధనలను సంతృప్తిపరచాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి 3న బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ ఆమోదం తెలియజేయాల్సి ఉందని, బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, చర్చలు, సవరణలు అన్నీ మార్చి 31లోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. జనవరి 21న బడ్జెట్‌ అంచనాలను గవర్నర్‌ కార్యాలయానికి పంపామని, 26న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గవర్నర్‌ను కలిశారన్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడంతో జనవరి 27న ఆర్థిక మంత్రి గవర్నర్‌కు లేఖ రాయగా దీనికి ప్రతిగా గవర్నర్‌ సచివాలయం నుంచి ప్రభుత్వానికి లేఖ అందిందన్నారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా? లేదా? ఉంటే డ్రాఫ్ట్‌ ప్రసంగాన్ని పంపాలని కోరారన్నారు. గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. షంషేర్‌సింగ్‌ కేసులో అధికరణ 174కు సుప్రీంకోర్టు భాష్యం చెప్పిందని, దీని ప్రకారం షెడ్యూలు ప్రకారం గవర్నర్‌ సభలను నిర్వహించాల్సి ఉందన్నారు. మంత్రిమండలి సలహా మేరకు సభ నిర్వహణను గవర్నర్‌ ఆమోదించాల్సి ఉందన్నారు. కేవలం క్షమాభిక్ష లాంటి కొన్ని సందర్భాల్లో ఉన్న విచక్షణాధికారం మినహా మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ ఆమోదం చెప్పాల్సి ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ తమిళనాడులో గవర్నర్‌ వాకౌట్‌ చేసినట్లు చూశామనగా న్యాయవాది స్పందిస్తూ రిపబ్లిక్‌ వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు. ఏ వ్యవస్థ అయినా పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని, ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదని, రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉందన్నారు. గవర్నర్‌ మంత్రి మండలి విజ్ఞప్తి మేరకు విధులు నిర్వహించాల్సి ఉందని రాజ్యాంగ మౌలిక సూత్రాల్లోనే చెప్పారన్నారు. ఒక పార్టీ సలహా మేరకు విధులు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తుందని, 130 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది ప్రభుత్వం అందించే పథకాల మీద ఆధారపడి ఉన్నారన్నారు. గవర్నర్‌ రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని, ఈమేరకు కోర్టు సలహా ఇవ్వాలని కోరారు.


కనీస గౌరవం ఇవ్వడం లేదు: గవర్నర్‌ తరఫు న్యాయవాది

ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి కనీస గౌరవం ఇవ్వడంలేదని గవర్నర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అశోక్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించామని, దీనిపై వివరణ కోరితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయబద్ధంగా గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా లేదా అని అడిగితే సమాధానం లేదన్నారు. దీనిపై ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది జోక్యం చేసుకుంటూ గవర్నర్‌ అని కాకపోయినా కనీసం మహిళగా పరిగణించి అయినా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, దీన్ని ఖండిస్తున్నానని తెలిపారు. అయితే వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో ప్రభుత్వానికి సంబంధంలేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ప్రభుత్వానికి సూచన కూడా చేస్తానని చెప్పారు. 


ఇలా సయోధ్య..

వాదనలను విన్న ధర్మాసనం ఇలాంటి వివాదాల్లో కోర్టుకు పరిమిత అధికారాలుంటాయని వ్యాఖ్యానించింది. మాకు అధికార పరిధిలేని ప్రాంతాల్లో జోక్యం చేసుకున్నందుకు మీరే కోర్టును నిందించవచ్చంది. ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదమని, మీరే సొంతంగా చర్చించుకుని రావాలంది. భోజన విరామ సమయంలో ఒక గంట గడువు ఉందని, ఈ సమయంలో చర్చించుకుని ఫలవంతమైన చర్చతో రావాలని సూచించింది. మధ్యాహ్నం విచారణ సందర్భంగా చర్చల వివరాలను ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అసెంబ్లీకి రావాలంటూ సంబంధిత మంత్రి గవర్నర్‌కు ఆహ్వానం పలకడంతోపాటు, ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతిని అందజేస్తారన్నారు. దీన్ని సమావేశాల్లో చదవడానికి గవర్నర్‌ ఆమోదించారని తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో పెండింగ్‌ బిల్లులకు ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. పెండింగ్‌ బిల్లులపై ఏవైనా సందేహాలుంటే సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వివరణ తీసుకుని బిల్లులను క్లియర్‌ చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరినందున ఈ కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని, పిటిషన్‌పై విచారణను మూసివేయాలని కోరారు. ఇరుపక్షాల మధ్య కుదిరిన సంధిని నమోదు చేసిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని