అర్హులకు ఇళ్లు ఇవ్వాలంటూ నిరసన

ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో నివసించేందుకు ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.

Published : 31 Jan 2023 04:31 IST

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో నివసించేందుకు ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్థానికులకు మద్దతుగా మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి ఈ నిరసనలో పాల్గొన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేశాలపల్లి శివారు పెద్దకుంటపల్లి గిరిజన తండా సమీపంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు అయిదేళ్లుగా నిరుపయోగంగా ఉంటున్నాయి. వాటిలో నివాసం ఉండేందుకు వెళ్తుండగా సుభాష్‌కాలనీ సమీపంలో స్థానికులకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రోడ్డుపై కూర్చుని కొద్ది సేపు నిరసన చేపట్టారు. కొంత మంది యువకులు, మహిళలను భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు స్థానిక స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌ ఆవరణలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడిసెల ఫొటోలు పట్టుకొని వారు నిరసన తెలిపారు. వచ్చే నెల 10వ తేదీ వరకు సమయం ఇవ్వాలని భూపాలపల్లి తహసీల్దారు మహ్మద్‌ ఎగ్బాల్‌ కోరగా.. మురళి జోక్యం చేసుకొని ఇంకా ఎన్ని రోజుల సమయం కావాలి.. అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే అర్హులకు ఇళ్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. సాయంత్రం స్థానిక తహసీల్దారు చేరుకుని జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రాతో ఫోన్‌లో మాట్లాడించడంతో దీక్షను విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని