Higher pension: ‘సుప్రీం’ సూచించినా కదలికేది!

ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్‌-95) కింద అధిక పింఛనుకు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించిన వేతనంపై 1.16% అదనంగా చెల్లించాలన్న నిబంధనపై ఈపీఎఫ్‌వో ఎలాంటి ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోలేదు.

Updated : 12 Mar 2023 06:08 IST

ఉద్యోగి వేతనం నుంచి 1.16% అదనపు చెల్లింపు తగదన్న న్యాయస్థానం
ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని ప్రతిపాదన
ఇప్పటివరకు నిర్ణయం వెల్లడించని ఈపీఎఫ్‌వో
అధిక పింఛను చందాదారుల్లో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్‌-95) కింద అధిక పింఛనుకు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించిన వేతనంపై 1.16% అదనంగా చెల్లించాలన్న నిబంధనపై ఈపీఎఫ్‌వో ఎలాంటి ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగుల వేతనం నుంచి  అదనంగా తీసుకోవడం సామాజిక భద్రత నిబంధనలకు విరుద్ధమని, పింఛను నిధికి అదనపు చెల్లింపుల నిర్ణయాన్ని ఆరు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు నవంబరులో తెలిపింది. ఆలోగా చట్టసవరణ/ ఇతర మార్గాల ద్వారా ఆ మేరకు నిధులను సమీకరించే ప్రయత్నాలను పరిశీలించాలని సూచించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులో ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయినప్పటికీ ఈపీఎఫ్‌వో దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడం గమనార్హం.

ఎందుకీ 1.16 శాతం...?

పింఛను నిధి పథకానికి ఈపీఎఫ్‌వో 2014 సెప్టెంబరు 1న సవరణలు చేసింది. అంతకు ముందు అధిక వేతనంపై అధిక పింఛను కోసం యజమానితో కలిసి పేరా 11(3)కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులంతా.. సవరణ తర్వాత పేరా 11(4) కింద ఆరునెలల్లోగా మరోసారి ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. ఆప్షన్‌ ఇవ్వకుంటే ఉద్యోగి అధిక పింఛను ఆప్షన్‌ను వదులుకున్నట్లుగా భావిస్తామని తెలిపింది. అప్పటివరకు పింఛను నిధి(ఈపీఎస్‌)లో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకు లోబడి 8.33% ప్రకారం రూ.1250కి మించి ఎంత ఎక్కువగా యజమాని వాటాగా జమ అయిందో ఆ మొత్తాన్ని తిరిగి ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాకు వడ్డీతో సహా మళ్లిస్తామంది. సాధారణంగా రూ.15 వేల వేతన పరిమితి వరకు ఉద్యోగుల వాటా కింద కేంద్ర ప్రభుత్వం 1.16% మొత్తాన్ని జమచేస్తోంది. 11(4) కింద ఆరునెలల్లోగా అధిక పింఛను కోసం ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించి అదనపు వేతనంపై 1.16% చొప్పున తనవంతు వాటాగా ఇవ్వాలని ఈపీఎఫ్‌వో షరతు పెట్టింది. ఇది సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఆదాయ మార్గాలపై కసరత్తు

అధిక పింఛను అర్హత కలిగిన ఉద్యోగుల నుంచి 1.16% వసూలు చేయకూడదని చెప్పిన సుప్రీంకోర్టు ఆ మేరకు అదనపు ఆదాయమార్గాలపై కసరత్తు చేయాలని తెలిపింది. దాంతో యజమాని నుంచి ఈ మొత్తం వసూలు చేసేలా 8.33% వాటా పెంచడమా? చట్ట సవరణతో యజమాని వాటా 10 లేదా 12 శాతం పూర్తిగా ఈపీఎస్‌కు మళ్లించడమా అనే విషయాలను ఈపీఎఫ్‌వో ప్రాథమికంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీటిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పింఛను లెక్కింపు విధానంలో మార్పులు జరిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కనీస పింఛను రూ.2వేలు లేదా రూ.3వేలు చేసేందుకు నియమించిన ఈపీఎఫ్‌ పింఛను నిపుణుల కమిటీ పలు సంస్కరణలు సూచించింది. కనీస వేతన పరిమితి పెంచడంతోపాటు పింఛను పొందేందుకు ప్రస్తుతమున్న కనీస సర్వీసు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని తెలిపింది. ఈపీఎస్‌ నుంచి ముందస్తు ఉపసంహరణలు పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించింది.

ఏదీ సందేహాల నివృత్తి?

అధిక పింఛను కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తును ఇప్పటికే ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే... ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. పేరా 26(6) కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌ ఆధారం దొరకనప్పుడు ఏమి చేయాలి? తర్వాత ఇచ్చేందుకు అవకాశముందా? మూతపడిన సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయం ఏమిటనే సందేహాలతో పలువురు చందాదారులు ఈపీఎఫ్‌వో కార్యాలయాల్లో సంప్రదిస్తున్నా అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. కేంద్ర కార్యాలయం నుంచి ఏమైనా వివరాలు వస్తే వెల్లడిస్తాం. అప్పటివరకు ఏమీ చెప్పలేమని చెబుతుండటంతో చందాదారులు గందరగోళానికి గురవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని