ఇవిగో నా ఫోన్లు

దిల్లీ మద్యం విధాన రూపకల్పన సమయంలో.. తాను పది ఫోన్లను వినియోగించానని.. ఆరోపణల నేపథ్యంలో వాటిని మార్చడమో, ధ్వంసం చేయడమో జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేసిన అభియోగాలను భారాస ఎమ్మెల్సీ కవిత ఖండించారు.

Published : 22 Mar 2023 05:12 IST

ఈడీ విచారణకు వెళ్లే ముందు మొబైళ్లను చూపించిన ఎమ్మెల్సీ కవిత
తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌కు లేఖ
ఈనాడు - దిల్లీ

దిల్లీ మద్యం విధాన రూపకల్పన సమయంలో.. తాను పది ఫోన్లను వినియోగించానని.. ఆరోపణల నేపథ్యంలో వాటిని మార్చడమో, ధ్వంసం చేయడమో జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేసిన అభియోగాలను భారాస ఎమ్మెల్సీ కవిత ఖండించారు. తాను ఏ ఫోనూ ధ్వంసం చేయలేదని, దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా బురద చల్లడానికే అలాంటి లీకులు ఇచ్చిందని ఆమె ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి ఇదివరకు వాడిన ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌కు మంగళవారం రెండు పేజీల లేఖ రాశారు. ఉదయం 11 గంటలకు మూడోరోజు విచారణ కోసం ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు ఆమె ఈ ఫోన్లన్నింటినీ రెండు పాలిథిన్‌ కవర్లలో వెంట తీసుకువెళ్లారు. కార్యాలయం లోపలికి వెళ్లేముందు వాటిని బహిరంగంగా ప్రదర్శించారు. ‘మీ విచారణకు నేను అన్ని రకాలుగా సహకరిస్తున్నాను. మీ సంస్థ ప్రతీకారంతో దురుద్దేశ పూర్వకమైన చర్యలకు దిగుతున్నప్పటికీ మీరు అడిగినట్లుగా నేను ఇదివరకు వాడిన ఫోన్లన్నీ మీకు సమర్పిస్తున్నాను. వ్యక్తిగత గోప్యత హక్కు దృష్ట్యా ఒక మహిళ ఫోన్లను పరిశీలించవచ్చా.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నప్పటికీ ఎలాంటి శషభిషలకు తావులేకుండా నేను ఈ ఫోన్లు మీకు అందిస్తున్నాను. ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ కొందరు నిందితులపై గత ఏడాది నవంబరులో దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదులో నాకు వ్యతిరేకంగా కొన్ని అంశాలను జోడించేందుకు ప్రయత్నించడం ఈడీ దుర్బుద్ధిని స్పష్టం చేసింది. నాకు కనీసం సమన్లు జారీ చేయకుండానే, ఎలాంటి ప్రశ్నలూ అడగకముందే దర్యాప్తు సంస్థ ఎందుకు అలాంటి ఆరోపణలు చేసిందో అంతుచిక్కడం లేదు. ఈడీ నన్ను తొలిసారిగా విచారణకు పిలిచింది ఈ ఏడాది మార్చిలో మాత్రమే. కానీ గత ఏడాది నవంబరులోనే నాకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అనుచితం, దురుద్దేశం, పక్షపాతపూరితం. నాకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే నిరాధారమైన ఆరోపణలు చేయడం రాజకీయ గొడవకు దారితీసింది. నేను సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు.. రాజకీయ ప్రత్యర్థులు నాపై బురద చల్లడంతో పాటు, మా ప్రతిష్ఠను మసకబార్చి, ప్రజల దృష్టిలో నా గౌరవాన్ని తగ్గించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈడీ లాంటి ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థ ఇలాంటి చర్యల్లో నిగూఢ భాగస్వామిగా మారడం దురదృష్టకరం. న్యాయంగా దర్యాప్తు జరపాల్సిన పవిత్ర విధిని స్వార్థ రాజకీయ ప్రయోజనాల బలిపీఠానికి అర్పించడం అత్యంత దురదృష్టకరం. నాపై ప్రతికూల అభిప్రాయాలు, అనుమానాలు కల్పించడానికి దర్యాప్తు సంస్థ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి నేను నా ఫోన్లన్నింటినీ సమర్పిస్తున్నాను’ అని ఎమ్మెల్సీ కవిత తన    లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని