RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు బస్సు స్టేషన్లో మురళి ఈనెల 18న ఉదయం 11 గంటలకు జామకాయల పార్సిల్‌ (కన్‌సైన్‌మెంట్‌ నంబరు 6164826) బుక్‌ చేశారు.

Updated : 22 Mar 2023 11:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు బస్సు స్టేషన్లో మురళి ఈనెల 18న ఉదయం 11 గంటలకు జామకాయల పార్సిల్‌ (కన్‌సైన్‌మెంట్‌ నంబరు 6164826) బుక్‌ చేశారు. ఉప్పల్‌ సర్కిల్‌లోని టీఎస్‌ఆర్టీసీ పార్సిల్‌ బుకింగ్‌ సెంటర్లో వాటిని తీసుకోడానికి అనిల్‌ వెళ్లారు. 51 కేజీలు పంపించామని చెప్పడంతో తక్కువగా ఉన్నాయని గమనించి తూకం వేయమన్నారు. తూకం వేస్తే 27 కేజీల బరువు చూపెడుతున్నాయి. అదేంటి 51 కేజీలు పంపితే.. 27 కేజీలుండడం ఏంటి అని నిలదీశారు. తమకేం తెలియదని పార్సిల్‌ తీసుకెళ్లండి అనే సమాధానం వచ్చింది. ఇల్లెందు బస్సు స్టేషన్‌లోని కార్గో సిబ్బందిని అడిగితే తాము సరిగానే తూచి అందుకు తగ్గ డబ్బులు తీసుకుని పంపించాం... తీసుకున్నచోటే అడగండి అనే సమాధానం వచ్చింది. కార్గో సర్వీసులకు సంబంధించి కాల్‌సెంటర్‌కు ఫోను చేస్తే..విచారించాల్సి ఉందని సమాధానం చెప్పారు. ఆర్టీసీ కార్గో బిజినెస్‌ హెడ్‌ సంతోష్‌ మాట్లాడుతూ...దీనిపై తమకు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నాం... వినియోగదారుడికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 18న జామ కాయలు పార్సిల్‌ బుక్‌ చేస్తే మరుసటి రోజు అంటే మార్చి 19 ఉదయానికి రావాలి. కానీ 20న వచ్చింది. ఒక్కరోజు ఆలస్యం అవ్వడంతో వచ్చిన కాయల్లో కొన్ని పాడయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని