ఎకరానికి రూ.10 వేలు.. పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం

రాష్ట్రంలో ఇటీవలి వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు సహాయ పునరావాస చర్యల కింద సత్వరమే ఎకరాకు రూ. పదివేల ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. బాధితుల్లోని కౌలురైతులకు సైతం పరిహారం ఇస్తామని చెప్పారు.

Updated : 24 Mar 2023 07:11 IST

తక్షణమే రూ.228 కోట్లు విడుదల చేస్తాం
కౌలు రైతులకూ పరిహారం
కేంద్రంలో దుర్మార్గ ప్రభుత్వం
దాని సాయం కోరం... నివేదిక పంపం
వందశాతం మా నిధులే ఇస్తాం
రైతులకు కేసీఆర్‌ హామీ
క్షేత్ర స్థాయిలో పంట నష్టాల పరిశీలన

దేశంలో ఓ పద్ధతి, పాడు లేదు. ఇన్సూరెన్స్‌ సంస్థలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి. రైతులకు లాభం చేసే బీమాలు కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు కానీ లేవు. పాత ప్రభుత్వాలూ అంతే.. ఇప్పుడూ అంతే.. పరిస్థితి చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. వాళ్లకు చెప్పినా లాభం లేకుండా ఉంది. దేశానికి కొత్త వ్యవసాయ విధానం కావాలి.

సీఎం కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌: రాష్ట్రంలో ఇటీవలి వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు సహాయ పునరావాస చర్యల కింద సత్వరమే ఎకరాకు రూ. పదివేల ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. బాధితుల్లోని కౌలురైతులకు సైతం పరిహారం ఇస్తామని చెప్పారు. ఇందుకుగాను తక్షణమే రూ.228 కోట్లు విడుదల చేస్తామన్నారు. గురువారం ఆయన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని రావినూతల, గార్లపాడు గ్రామాలను, మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, పోచారం, వడ్డేకొత్తపల్లి, బొమ్మకల్‌, వరంగల్‌ జిల్లా అడవి రంగాపురం, కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలాల్లో పర్యటించారు. భారీగా దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయల పంట చేలు, మామిడి తోటల వద్దకు వెళ్లి నష్టాలను స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి గోడు విన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంటలు, ఫొటోల ప్రదర్శనను సైతం ఆయన తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రంలో దుర్మార్గ ప్రభుత్వం ఉంది. పంట నష్టాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వానపడ్డట్లుగా ఉంది. దాని నుంచి గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి సాయం అందడం లేదు. అందుకే కేంద్రానికి నివేదిక పంపాలని అనుకోవట్లేదు’ అని తెలిపారు. వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయని అధైర్యపడొద్దని, నిరాశకు గురి కావొద్దని, తమ ప్రభుత్వం అన్ని విధాలా రైతులను ఆదుకుంటుందని  భరోసా కల్పించారు.

అపార నష్టం

‘వడగళ్ల వానతో రాష్ట్రవ్యాప్తంగా 2,28,258 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలకు 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. దేశంలో ఇప్పుడు ఒక డ్రామా నడుస్తోంది. మేం రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కమిటీ ఎప్పుడొస్తుందో.. రిపోర్టు ఎప్పుడిస్తుందో ఆ దేవుడికే ఎరుక. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఆర్నెల్ల దాకా రూపాయి రాదు. ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉంది. వాళ్లకు రాజకీయాలు తప్ప ప్రజల్లేరు.. రైతులు లేరు. గతంలో పంపిన దానికే రూపాయి ఇవ్వలేదు కాబట్టి నిరసనగా ఇప్పుడు నివేదిక పంపాలని అనుకోవడం లేదు. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చిండు కాబట్టి మా రైతులను వంద శాతం మేమే కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మహద్భాగ్యం ఎంతో తెలుసా? మొక్కజొన్నకు ఎకరానికి రూ.3,333, వరికి రూ.5,400, మామిడి తోటలకు రూ.7200 ఇస్తామని కేంద్ర      పథకంలో ఉంది. ఇది ఏ మూలకూ సరిపోదు.


ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. కానీ మేం గర్వంగా చెబుతున్నాం.. ఇవాళ తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. ఇది మనకు చాలా గర్వకారణం. రైతులు ఏవిధంగానూ నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది.

సీఎం కేసీఆర్‌


దేశంలో ఎక్కడా లేనివిధంగా సాయం

దేశంలో ఎక్కడా రైతులకు ఇంత పరిహారం ప్రకటించలేదు. హైదరాబాద్‌ నుంచే ఈ ప్రకటన చేయొచ్చు. మీ కష్టాల్లో పాలుపంచుకునేందుకే బయలుదేరి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేశాం. నాతో పాటు మంత్రులు నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావు సైతం వ్యవసాయం చేస్తున్నారు. స్వయంగా మేమంతా రైతులం కాబట్టే కాడిని కింద పడనీయొద్దని.. దాన్ని మరింత వృద్ధి చేయాలని మీ వద్దకే వచ్చాం రాష్ట్రంలో అన్ని రకాల పంటలు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వ్యవసాయ వృద్ధిలో మంచి దశకు వచ్చాం. జీడీపీలోనూ మెరుగైన వృద్ధి సాధిస్తున్నాం. ఇప్పుడిప్పుడే రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. అంతలోనే గాలి దుమారం, వడగళ్లు  నష్టం మిగిల్చాయి. తెలంగాణ సర్కారు తప్పకుండా కౌలుదారులకు అండగా ఉంటుంది. స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీపీఐ, సీపీఎం నేతల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం.  

నిరాశపడొద్దు...

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్‌, ఉచిత నీళ్లు,  నీటితీరువా బకాయిల రద్దు చేసి రైతులను ఆదుకోవడంతో వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతోంది. ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు. ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. తెల్వక దీన్ని చాలామంది నష్టపరిహారం అని అంటారు. కానీ వీటిని సహాయ పునరావాస చర్యలు అని పిలవాలి. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలి. జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా.. రబ్బర్‌బంతి తిరిగొచ్చినట్లుగా.. భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలి. నాలుగైదేళ్ల నుంచి పంటలతో మంచి లాభాలు వచ్చాయని.. ఈ ఒక్కసారి పంట నష్టం జరిగింది.. అయినా తట్టుకుంటానని ఓ రైతు నాతో చెబితే నాకు కూడా సంతోషమనిపించింది’’ అని సీఎం తెలిపారు.  


మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,05,000తో ఉంది. జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్‌డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉంది. సగటున 16 శాతం వరకు ఉంది .

సీఎం కేసీఆర్‌


ఉదయం నుంచి సాయంత్రం వరకు..

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఎం పర్యటన సాగింది. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఖమ్మం జిల్లా బోనకల్లు చేరుకున్నారు. కొద్దిసేపు విహంగ వీక్షణం ద్వారా పంట నష్టాలను పరిశీలించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌, సీపీఎం, సీపీఐల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ప్రజాప్రతినిధులతో కలిసి వాహనాల్లో పంట పొలాల వద్దకు వెళ్లి నష్టాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.  ఏం పేరు? ఎంత పంట వేసినవు? పెట్టుబడి ఎంతైంది? నష్టం ఎంత జరిగింది? అని అడుగుతూ సీఎం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో భేటీ నిర్వహించారు. అక్కడి నుంచి ఆయన మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్లారు. తన వెంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తీసుకెళ్లారు. మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో కలిసి పంట నష్టాలను చూశారు. భోజనానంతరం ఆయన హెలికాప్టర్‌లో వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అడవిరంగాపురం వెళ్లారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కలిసి నష్టాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ చేరుకున్నారు. రామచంద్రాపూర్‌లో పంటనష్టాలను పరిశీలించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌... ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌... ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, దాసరి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

బోరుమన్న రైతులు

జిల్లాల పర్యటనకు వచ్చిన సీఎం ముందు రైతులు తమ కష్టాలను వెళ్లబోసుకున్నారు. ‘‘పది రోజుల్లో పంట చేతికొస్తుందనగా మాయదారి వానవచ్చి సర్వనాశనం చేసింది. ఒక్కసారిగా వచ్చిన వడగండ్లు మాకు కడగండ్లు మిగిల్చినయి. రూ. లక్షల వరకు నష్టం జరిగింది. కళ్ల ముందే పంటపోయింది’’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారు.  


సాయంపై వెలువడిన ఉత్తర్వులు

కాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఒకేదఫా ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం నుంచి ఈ నెలాఖరు వరకు గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి రైతుల వారీగా వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. కేంద్ర విపత్తు నివారణ యాజమాన్య ప్రాధికార సంస్థ నిబంధనలను అనుసరించి రాష్ట్ర విపత్తు ఉపశమన నిధుల నుంచి ఈ మొత్తాన్ని వెచ్చించాలని సూచించింది.

ఏప్రిల్‌ 15 నుంచి పంపిణీ

రైతులు, కౌలుదార్లకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎకరాకు రూ.పదివేల సాయాన్ని వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కాగా... దేశంలో తొలిసారిగా పరిహారం కింద అత్యధిక సాయం ఇస్తున్నందున దీనిపై విస్తృత ప్రచారం చేపట్టి, పంపిణీ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన పెద్దఎత్తున చేపట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి బాధితుల వారీగా చెక్కులను తయారు చేస్తారు. వచ్చే నెల 15 నుంచి 26 వరకు వాటిని గ్రామాల వారీగా పంపిణీ చేయనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, రైతుబంధు సమితుల ఛైర్మన్ల ద్వారా ఈ కార్యక్రమం సాగనుంది.


గుండె ధైర్యం చెదరొద్దు

రైతు సోమన్నకు సీఎం కేసీఆర్‌ భరోసా

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో మిర్చి పంట నష్టపోయిన రైతు జాటోతు సోమన్ననాయక్‌తో పాటు మామిడి, మొక్కజొన్న రైతులతో ముచ్చటించారు. సోమన్నతో సంభాషణ ఇలా సాగింది.

సీఎం: ఎన్ని ఎకరాల్లో  మిర్చి సాగు చేస్తున్నావు?

సోమన్న: సారూ.. రెండెకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాను. ఇప్పుడే పూత, కాత వచ్చింది. ఇంతలోనే వడగళ్ల వాన కొంపముంచిది.

సీఎం: ఇలాంటి సమయంలో ధీమాగా ఉండాలి. గుండె ధైర్యం చెదరొద్దు. మీ కష్టాలు తెలిసే ఇక్కడికి వచ్చాను. పరిహారం విషయంలో కేంద్రం పట్టించుకోవడం లేదు. మేమే ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం.

సోమన్న: సరే సారూ. భయపడను.. ధైర్యంగా ఉంటాను. మీరు వచ్చాకే కరెంట్‌ వస్తోంది. రైతుబంధు, బీమా అందుతున్నాయి. కాలువల ద్వారా సాగునీళ్లు అందుతున్నాయి. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నారు. అది మీ వల్లనే సాధ్యమవుతోంది.

సీఎం: పంటలు పోయాయని ఆలోచించకు.. మరో పంట సాగుకు ప్రయత్నించు.


బస్సులోనే సీఎం, మంత్రుల భోజనం!

సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్తే ఆయన భోజనం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. వడగళ్ల వానలతో నష్టపోయిన ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన అందుకు భిన్నంగా జరిగింది. మహబూబాబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా వద్ద పంటల పరిశీలన అనంతరం  సీఎం ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని బస్సులోనే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అందరూ కలిసి తిన్నారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్‌ ఎంపీ దయాకర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, సీఎస్‌ శాంతికుమారి, సీఎంవో అధికారి స్మితా సభర్వాల్‌, వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, నవీన్‌మిత్తల్‌, అందరూ కలిసి భోజనం చేశారు.. వీరికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వయంగా వడ్డించారు.  

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని