ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులకూ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో సంబంధమున్న ప్రవాస భారతీయులపై సిట్‌ దృష్టి సారించింది. విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి గ్రూప్‌-1 పరీక్ష రాసిన వారి గురించి ఆరా తీస్తోంది.

Published : 24 Mar 2023 05:38 IST

121 మంది వాంగ్మూలాలు కీలకమని భావిస్తున్న సిట్‌
లీకేజీ కేసులో 12 మంది నిందితులకు జ్యుడిషియల్‌ రిమాండు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో సంబంధమున్న ప్రవాస భారతీయులపై సిట్‌ దృష్టి సారించింది. విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి గ్రూప్‌-1 పరీక్ష రాసిన వారి గురించి ఆరా తీస్తోంది. గ్రూప్‌-1 పరీక్షలో 100కుపైగా మార్కులు వచ్చిన 121 మందిలో పలువురిని ఇప్పటికే సిట్‌ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి పరీక్ష రాసినవారినీ గుర్తించింది. వారు కేవలం పరీక్ష రాసేందుకు వచ్చివెళ్లినట్లు తేలింది. కీలక నిందితుడు రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు న్యూజిలాండ్‌ నుంచి వచ్చి పరీక్ష రాసినట్లు నిర్ధారణ అయింది. మరికొందరూ ఈ జాబితాలో ఉన్నట్లు తెలియడంతో వారికి నోటీసులు ఇచ్చి పిలిపించడంలో సిట్‌ నిమగ్నమైంది. ఈసారి గ్రూప్‌-1 పరీక్ష ప్రశ్నపత్రం కఠినతరంగా ఉండటంతో సివిల్స్‌కు సన్నద్ధమైన అభ్యర్థులూ 100 మార్కులు సాధించడం గగనమైంది. ఈ కేసులో అరెస్టయిన షమీమ్‌కు 126 మార్కులు, రమేశ్‌కు 120 మార్కులు వచ్చినట్లు తేలడం సిట్‌ అధికారుల్ని విస్తుపోయేలా చేస్తోంది. ఈ క్రమంలోనే 100కుపైగా మార్కులు సాధించినవారి జాబితాను పరిశీలించగా.. ప్రవాసుల  పేర్లు బహిర్గతం కావడంతో వారిపై సిట్‌ దృష్టి సారించింది.

షమీమ్‌కు వాట్సప్‌లో ప్రశ్నప్రతం

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి షమీమ్‌కు రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌-1 ప్రశ్నపత్రం ఇచ్చినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. కర్నూల్‌ జిల్లా బనగాలపల్లెకు చెందిన ఆమె మహబూబ్‌నగర్‌కు వచ్చి స్థిరపడినట్లు గుర్తించారు. అక్కడే ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసింది. ఆమె తొలుత కొన్నేళ్లు భర్తతోపాటు దుబాయ్‌లో ఉండివచ్చింది. గతంలో ఓసారి గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగిగా ఎంపికైన షమీమ్‌ ప్రస్తుతం కమిషన్లోని గ్రూప్‌-4 సెక్షన్లో పనిచేస్తోంది. ఈమెను సిట్‌ పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని ప్రశ్నాపత్రం లీకేజీ గురించి ప్రశ్నించగా.. తనకు రాజశేఖర్‌రెడ్డి వాట్సప్‌లో పంపించాడని, తర్వాత దాన్ని డిలీట్‌ చేశానని చెప్పింది. ఇందుకోసం డబ్బులేమీ ఇవ్వలేదని చెప్పినట్లు సమాచారం. కేసులో ఆమె పాత్రపై నిర్ధారణకు రావడంతో అరెస్ట్‌ చేశారు. మరోవైపు, గురువారం రాత్రి ఆమె ఇంట్లో సిట్‌ బృందం సోదాలు నిర్వహించింది.

ఫోరెన్సిక్‌ నివేదిక వస్తే మరింత సమాచారం..

కేసులో నిందితులు రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు ప్రశ్నపత్రాల్ని దొంగిలించిన అంశంపై సిట్‌ కీలక అధారాల్ని సేకరించింది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో పనిచేసే శంకరలక్ష్మి డైరీ నుంచే పాస్‌వర్డ్‌ను తస్కరించినట్లు నిర్ధారణకు వచ్చారు. దాని ఆధారంగా తన కంప్యూటర్‌ నుంచే ప్రవీణ్‌కుమార్‌ ఫోల్డర్లను తెరిచాడని.. ప్రశ్నపత్రాల ప్రతుల్ని అక్కడే జిరాక్స్‌ తీసినట్లు గుర్తించారు. అలా సేకరించిన హార్డ్‌కాపీలను పలువురికి ఇచ్చినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆయా కంప్యూటర్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా కీలక సమాచారం లభ్యమవుతుందని సిట్‌ అధికారులుభావిస్తున్నారు.


‘వంద మార్కుల’ వారిలో దొంగలెందరు?

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల్లో 20 మంది గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రాసినట్లు తేలగా.. వారిలో 8 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు వెల్లడైంది. వారిలో ఇద్దరికి 100కుపైగా మార్కులు రాగా... ప్రశ్నాపత్రాల లీకేజీతో ప్రమేయమున్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో 100 మార్కులకు పైగా సాధించిన 121 మందిలో ఇంకా ఎందరు దొంగలున్నారో తేల్చడం ఇప్పుడు సిట్‌ ముందున్న అంశంగా మారింది. ఈ క్రమంలో విదేశాల్లోని ప్రవాస భారతీయులను రప్పించి విచారించడంతోపాటు మిగిలినవారి పాత్రనూ నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది. మొత్తం 121 మందిని విచారించిన తర్వాతే దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. వీరిలో పలువురికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సిట్‌కు లభ్యమయ్యాయి. రాబోయే ఒకట్రెండు రోజుల్లోనే మరికొందరి అరెస్ట్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది.


జ్యుడిషియల్‌ రిమాండ్‌కు నిందితులు

కేసులో తొలుత అరెస్ట్‌ చేసిన 9 మంది నిందితుల కస్టడీ గురువారం ముగిసింది. వీరిని న్యాయస్థానంలో తిరిగి హాజరుపరిచారు. వీరికి ఈ నెల 28 వరకు జ్యుడిషియల్‌ రిమాండు విధించింది. గురువారం అరెస్ట్‌ చేసిన షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌లనూన్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం ఏప్రిల్‌ 4 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. వీరందరిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు