హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెంకు కొత్త మార్గం

రాజధాని నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది. ఈ మార్గం హైదరాబాద్‌లోని గౌరెల్లి (అవుటర్‌ రింగు రోడ్డు) నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా.

Updated : 24 Mar 2023 11:17 IST

భద్రాచలానికి 35 కి.మీ. తగ్గనున్న ప్రయాణ దూరం
230 కి.మీ. మేర విస్తరణ
ఇందులో 125 కి.మీ. కొత్త రహదారి

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది. ఈ మార్గం హైదరాబాద్‌లోని గౌరెల్లి (అవుటర్‌ రింగు రోడ్డు) నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ, వరంగల్‌ జిల్లా తొర్రూరు, నెహ్రూనగర్‌ (నర్సంపేట) మీదుగా కొత్తగూడెం వరకు 230 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్లాలంటే సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం మీదుగా వెళ్లాలి. గౌరెల్లి, వలిగొండ, నర్సంపేట మీదుగా వెళ్లే కొత్త మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి భద్రాచలానికి 35 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ మార్గంలో 42.5 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా నిర్మిస్తారు. మిగిలిన మార్గాన్ని ఎన్‌హెచ్‌ ప్రమాణాలతో రెండు వరుసలుగా విస్తరిస్తారు. సుమారు రూ.2,740 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు 40 కిలోమీటర్ల వరకు మార్గాన్ని గతంలోనే 4 వరుసలుగా విస్తరించారు.

సుమారు 230 కిలోమీటర్ల ఈ మార్గంలో 125 కిలోమీటర్లకుపైగా కొత్త రహదారి నిర్మిస్తారు. వరంగల్‌ జిల్లాలో తొర్రూరు - నెహ్రూనగర్‌ మార్గంలో 25 శాతం, నెహ్రూనగర్‌ నుంచి కొత్తగూడెం మార్గంలో 75 శాతం నూతన రహదారిని నిర్మించనున్నారు. మొత్తం మార్గాన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరెల్లి నుంచి వలిగొండ వరకు ఒక ప్యాకేజీగా విస్తరించేందుకు కేంద్రం రూ.690 కోట్లు కేటాయించింది. ఈ ప్యాకేజీకి గుత్తేదారును సైతం ఎంపిక చేశారు. వలిగొండ నుంచి తొర్రూరు మార్గానికి రూ.549 కోట్లు, తొర్రూరు నుంచి వరంగల్‌ జిల్లా నెహ్రూనగర్‌ వరకు రూ.675 కోట్లు, నెహ్రూనగర్‌ నుంచి కొత్తగూడెం వరకు రూ.826 కోట్ల వ్యయంతో రహదారిని విస్తరించనున్నారు. ఈ మూడు ప్యాకేజీలకు త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మార్గాన్ని రెండున్నర నుంచి మూడు సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మెరుగుపడనున్న అనుసంధానం

ఈ రహదారి మావోయిస్టు ప్రభావిత, వెనుకబడిన మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 126 కిమీ మేర వెళుతుందని కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాల్లో మెరుగైన రహదారి అనుసంధానం కారణంగా మావోయిస్టు కార్యకలాపాలను మెరుగ్గా నిరోధించడానికి వీలవుతుందని తెలిపింది. అలానే బొగ్గు గనులు, ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, పేపర్‌ మిల్లులు, ఆయిల్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాజధానితో అనుసంధానం పెరుగుతుందని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని