తెలంగాణ నిఘంటువులో ‘కరవు’ లేదు

ప్రస్తుతం తెలంగాణ నిఘంటువులో కరవు అనే పదమే లేదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో ఈ యాసంగిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ 16 లక్షల ఎకరాలకు పరిమితమైందని.

Published : 24 Mar 2023 05:27 IST

అభివృద్ధి, సంక్షేమంలో దరిదాపుల్లో లేని ఇతర రాష్ట్రాలు
రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: ప్రస్తుతం తెలంగాణ నిఘంటువులో కరవు అనే పదమే లేదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో ఈ యాసంగిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ 16 లక్షల ఎకరాలకు పరిమితమైందని.. అభివృద్ధికి ఇదే మచ్చుతునక అని వ్యాఖ్యానించారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ విభాగం ప్రకటించిన సతత్‌ వికాస్‌ పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ మేరకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో మండల స్థాయిలో ఉత్తమంగా నిలిచిన పంచాయతీలకు పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ దరిదాపుల్లో ఇతర రాష్ట్రాలు లేవన్నారు. దిల్లీలో పురస్కారాలు ఇస్తూ గల్లీలో విమర్శలు చేయడం భాజపా నేతలకే చెల్లిందన్నారు. మాట్లాడితే తొడ కొట్టి, మీసం మెలేసే నాయకులు వద్దని, పనిచేసే కేసీఆర్‌ లాంటి గొప్పనేత కావాలన్నారు.

సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన కింద దేశంలో తొలి పది స్థానాల్లో ఏడు తెలంగాణవే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓ శాఖకు సంబంధించి మూడు పురస్కారాలు అందించేందుకు సిద్ధమవుతోందని వెల్లడించారు. అందులోనూ తెలంగాణ ఉందని, భాజపా పాలిత రాష్ట్రాలు లేవన్నారు. తెలంగాణకు పురస్కారం ఇవ్వరేమో అనే అభిప్రాయాన్ని ఆ శాఖ అధికారి తనకు చెప్పారన్నారు. ఇవ్వకపోతే ఆ వివరాలు వెల్లడిస్తానన్నారు.  కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని