EPFO - Higher pension: అధిక పింఛను దరఖాస్తుల ఆమోదం ఎలా?

ఈపీఎఫ్‌వో ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌) కింద చందాదారులు అధిక పింఛను కోసం ఆన్‌లైన్లో నమోదు చేసిన ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తులు కనిపించడం లేదు. ప్రక్రియ మొదలై.. దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దరఖాస్తు చేసినవారి వివరాలు యాజమాన్యాల పోర్టల్‌ లాగిన్‌లోకి రావడం లేదు.

Updated : 26 Mar 2023 07:33 IST

యాజమాన్యాల లాగిన్‌లో కనిపించని అర్జీలు
పీఎఫ్‌ కేంద్ర కార్యాలయం వద్దే నిలిచిన ఉమ్మడి ఆప్షన్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌వో ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌) కింద చందాదారులు అధిక పింఛను కోసం ఆన్‌లైన్లో నమోదు చేసిన ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తులు కనిపించడం లేదు. ప్రక్రియ మొదలై.. దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దరఖాస్తు చేసినవారి వివరాలు యాజమాన్యాల పోర్టల్‌ లాగిన్‌లోకి రావడం లేదు. దరఖాస్తులు స్వీకరిస్తున్న ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం.. ఆ దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయి? యజమాని వద్దకు ఎందుకు రావడం లేదు? తదితర సమాచారం ఇవ్వడంలేదు. అధిక పింఛనుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు యజమానులు ఎప్పటిలోగా ఆమోదించి ప్రాంతీయ కార్యాలయాలకు పంపించాలి? ఏయే వివరాలు, ఆధారాలు జతచేయాలన్న వివరాలపై స్పష్టత లేదు. దీంతో దరఖాస్తుల ఆమోదంలో తీవ్రజాప్యం జరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధిక పింఛను పొందేందుకు, ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన తరువాత ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్‌ దరఖాస్తుకు వివిధ ఆంక్షలు పెట్టింది. తీర్పు వచ్చిన మూడు నెలల వరకు కూడా అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కార్మిక సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం, సుప్రీం కోర్టు తీర్పును నాలుగు నెలల్లో అమలు చేయాల్సి ఉండటంతో ఎట్టకేలకు ఫిబ్రవరి 26న ఆన్‌లైన్‌ దరఖాస్తును అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హులైన ఉద్యోగులు, పింఛనుదారులు మే 3వ తేదీలోగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు చేసిన వెంటనే లేదా ఒకరోజు తరువాత ఇవన్నీ యాజమాన్యాల లాగిన్‌లోకి రావాల్సి ఉన్నప్పటికీ కేంద్ర కార్యాలయం వాటిని అక్కడే నిలిపి వేస్తోంది. ప్రస్తుతం 2014 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పింఛనుదారుల దరఖాస్తులు యాజమాన్యాల లాగిన్‌లోకి వస్తున్నాయి. కానీ 2014 సెప్టెంబరు ఒకటి తరువాత సర్వీసులో కొనసాగిన వారి దరఖాస్తులు మాత్రం రావడం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అధిక పింఛనుకు 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. తొలుత వచ్చిన వాటిని తొలుత పరిష్కారం చేస్తామని చెప్పిన ఈపీఎఫ్‌వో ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రాంతీయ కార్యాలయాల్లోనూ స్పష్టమైన సమాచారం ఇవ్వట్లేదు. ఆయా సంస్థల యాజమాన్యాలు ఆమోదించిన దరఖాస్తులను ప్రాంతీయ కార్యాలయాల అధికారులు పరిశీలించి... దరఖాస్తుదారులు అర్హులా? కాదా? అని నిర్ణయిస్తారు. కానీ అసలు దరఖాస్తులు యాజమాన్యాలకు పంపకుండా.. కేంద్ర కార్యాలయం వద్దే నిలిపివేయడంతో చందాదారుల్లో ఆందోళన నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని