అచ్చెరువొందేలా హైదరాబాద్‌ ప్రగతి

‘‘చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌ నగరానికి వచ్చిన వారు పశ్చిమ ప్రాంతాన్ని చూసి ..విదేశాల్లో ఉన్నామనే భావన కలుగుతోందని చెబుతున్నారు.

Published : 29 Mar 2023 04:38 IST

చెరువుల అభివృద్ధిలో బిల్డర్లకు భాగస్వామ్యం
మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌ నగరానికి వచ్చిన వారు పశ్చిమ ప్రాంతాన్ని చూసి ..విదేశాల్లో ఉన్నామనే భావన కలుగుతోందని చెబుతున్నారు. కానీ హైదరాబాద్‌ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలైంది. మున్ముందు అసలు సినిమా ఉంది. అనేక భారీ ప్రాజెక్టులు చేపడతాం. కొవిడ్‌ సమయంలో లక్ష కోట్ల రెవెన్యూ నష్టపోవడంతో వెనకబడిన ప్రణాళికలను అమలుచేస్తాం’’ అని రాష్ట్ర రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్‌లో మెట్రోను విస్తరించాల్సి ఉంది. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. పనులకు త్వరలో టెండర్లు పిలిచి పనులు మొదలు పెడుతాం. 500 ఎలక్ట్రికల్‌ బస్సులు ప్రారంభించడంతోపాటు మిగతా బస్సులను ఎలక్ట్రికల్‌గా మార్చే ఆలోచన ఉంది. 55 కి.మీ.మూసీ ఎక్స్‌ప్రెస్‌ వే ఈస్ట్‌ నుంచి వెస్ట్‌ కారిడార్‌ నిర్మాణాన్ని రూ.10 వేల కోట్లతో నిర్మించే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో మాదిరి ఇక్కడ టోల్‌ వసూలు చేసి.. మూసీ సుందరీకరణ చేపట్టే అంశంపై కసరత్తు నడుస్తోంది. రూ.2400 కోట్లతో మరిన్ని లింక్‌ రోడ్లు చేపట్టబోతున్నాం. ఇప్పటికే హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీ ఉంది. ఫార్మాసిటీ నిర్మిస్తున్నాం. రాచకొండలో మరో ఫిల్మ్‌సిటీ నిర్మాణం, స్పోర్ట్స్‌ సిటీ, అకడమిక్‌ సిటీ వంటి భారీ ప్రణాళికలు ఉన్నాయి’ అని కేటీఆర్‌ వివరించారు.

బిల్డర్లకు ఒప్పంద పత్రాల అందజేత

జీహెచ్‌ఎంసీ పరిధిలో 25, బయట మరో 25 చెరువులను ఒక్కోదానిని రూ.కోటి నుంచి రూ.15 కోట్లతో అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన బిల్డర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. వారికి ఒప్పంద పత్రాలను అందజేశారు. ప్రపంచస్థాయిలో అన్ని వసతులతో చెరువులను అభివృద్ధి చేయాలని సూచించారు. అక్టోబరు, నవంబరులో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. అప్పటిలోగా పూర్తి చేస్తే తమకు మేలు జరుగుతుందని అన్నారు. చెరువులను బిల్డర్లకు రాసివ్వడం లేదని.. అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. బిల్డర్లకు అప్పగించడానికి ముందే న్యాయపరమైన సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పార్క్‌ల డిజైన్లకు సంబంధించి నిర్మాణదారులను భాగస్వామ్యం చేయాలన్నారు. కాగా చెరువులను తమకు అప్పగించడానికి ముందే హద్దులను మార్కింగ్‌ చేసి ఇస్తే సమస్యలు ఉండవని.. మురుగు చెరువుల్లో కలవకుండా చూడాలని బిల్డర్లు మంత్రి కేటీఆర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి,  ఎమ్మెల్యేలు గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని