నయన మనోహరం.. జగదభిరాముని కల్యాణం

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో జగదేకవీరుడు శ్రీరాముడు, జగన్మాత సీతమ్మల కల్యాణ వేడుక గురువారం ఆద్యంతం కనులపండువగా సాగింది.

Published : 31 Mar 2023 04:49 IST

శ్రీరామనామస్మరణతో  మార్మోగిన భద్రాచలం

ఈటీవీ - ఖమ్మం, న్యూస్‌టుడే - భద్రాచలం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో జగదేకవీరుడు శ్రీరాముడు, జగన్మాత సీతమ్మల కల్యాణ వేడుక గురువారం ఆద్యంతం కనులపండువగా సాగింది. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. మూడుముళ్ల బంధంతో సీతారాములు ఒక్కటైన మధురక్షణాలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. మిథిలా మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అర్చకులు తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి స్వర విజ్ఞానశాంతికి విష్వక్సేనులను ఆరాధించారు. పుణ్యహవాచనం నిర్వహించి కల్యాణ సామగ్రిని సంప్రోక్షణ చేశారు. దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ వారి నడుముకు బిగించి యోక్త్రధారణ జరిపించారు. సీతారాముల వారికి రక్షాసూత్రాలు కట్టి గృహస్థాశ్రమ సిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. వేదమంత్రాలు మార్మోగుతుండగా అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర- బెల్లాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. మాంగల్యధారణ అట్టహాసంగా సాగింది. ఎక్కడైనా రెండు సూత్రాలుంటాయి. ఇక్కడ మాత్రం పుట్టింటి వారి తరఫున ఒకటి, మెట్టింటి వారి తరఫున ఒకటి.. భక్తరామదాసు తరఫున మరో సూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగల్యధారణ నిర్వహించటం విశేషమని స్థానాచార్యులు స్థలసాయి, వేద పండితుడు మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు ప్రవచించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి

శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి తీసుకురావడం సంప్రదాయంగా వస్తున్నా సీఎం కేసీఆర్‌ ఈసారి రాలేకపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. తితిదే, శృంగేరీ పీఠం ప్రతినిధులు, భక్తరామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాస్‌ దంపతులు, త్రిదండి చినజీయర్‌ స్వామి కూడా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.

సీతమ్మ అవతరించింది శోభకృత్‌లోనే

కల్యాణమంటే ప్రతి ఒక్కరికీ భద్రాచలంలో నిర్వహించే వేడుకే గుర్తొస్తుందని త్రిదండి చినజీయర్‌ స్వామి ప్రవచించారు. శ్రీరాములు అవతరించిన శ్రీరామనవమి రోజే కల్యాణం నిర్వహించే సంప్రదాయాన్ని భక్తరామదాసు ప్రవేశపెట్టగా.. తూము లక్ష్మీనరసింహదాసు కొనసాగించారని పేర్కొన్నారు. ఇది శోభకృత్‌ నామ సంవత్సరమని.. సీతమ్మ వారు అవతరించింది ఈ ఏడాదేనని, ఇలాంటి సంవత్సరంలో వీక్షించే కల్యాణం ఎంతో గొప్పదని విశ్లేషించారు. శ్రీ భద్రాచల రామదాసు పీఠం తరఫున రూపొందించిన సంక్షేప రామాయణం సీడీని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి జీయర్‌స్వామి ఆవిష్కరించారు.
నీ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ   ప్రణాళికతో ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 70 కౌంటర్లలో 200 క్వింటాళ్ల తలంబ్రాలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 19 కౌంటర్లలో ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. 

ఈ వేడుకల్లో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ భీమపాక నగేశ్‌, జస్టిస్‌ శ్రీదేవి, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ తదితరులు హాజరయ్యారు.


నేడు పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించనున్న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ హాజరుకానున్నారు. ఆమె రైలులో కొత్తగూడెం వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలానికి చేరుకుంటారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని