అటవీశాఖ కార్యాలయంపై గ్రామస్థుల దాడి

ఆలయ ధ్వజస్తంభం కోసం తెచ్చిన కర్రను తీసుకుపోయారని ఆరోపిస్తూ.. గిరిజన గ్రామాల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని అటవీశాఖ రేంజి కార్యాలయంపై దాడి చేశారు.

Published : 01 Apr 2023 04:02 IST

ధ్వజస్తంభం కర్ర తీసుకెళ్లిపోయారని నిరసన
ఫర్నిచర్‌, కిటికీ అద్దాలు ధ్వంసం

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: ఆలయ ధ్వజస్తంభం కోసం తెచ్చిన కర్రను తీసుకుపోయారని ఆరోపిస్తూ.. గిరిజన గ్రామాల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని అటవీశాఖ రేంజి కార్యాలయంపై దాడి చేశారు. అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు సమీపాన గంగానమ్మ గుడి ధ్వజస్తంభం కోసం గుమ్మడవల్లి గ్రామస్థులు అడవి నుంచి నారవేప కర్రను తెచ్చి చెక్కించారు. బుధవారం రాత్రి అటవీశాఖ సిబ్బంది ఆ కర్రను ముక్కలుగా కోసి తమ కార్యాలయానికి తరలించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా గుమ్మడవల్లి, చుట్టుపక్కల గ్రామాల మహిళలు సహా వందలమంది గిరిజన, గిరిజనేతరులు శుక్రవారం ప్రదర్శనగా వెళ్లి అశ్వారావుపేటలోని అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. అడ్డువచ్చిన సిబ్బందిపై చేయిచేసుకున్నారు. పోలీసులు వారించినా ఆగలేదు. తలుపులు బద్దలుకొట్టుకొని లోపలకు వెళ్లి సామగ్రిని, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. రేంజర్‌ను, సిబ్బందిని సస్పెండ్‌ చేయాలంటూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులు రేంజర్‌ అబ్దుల్‌ రెహమాన్‌తో చర్చించారు. వారం రోజుల్లో కొత్త కర్ర ఇస్తామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. రేంజర్‌ నుంచి ముందే మౌఖిక అనుమతి తీసుకున్నా.. ఇలా కర్రను తీసుకుపోవడమేమిటని నిరసనకారులు ప్రశ్నించారు. సిబ్బందికి చెప్పకుండా చెట్లు నరికినందునే కర్రను తీసుకొచ్చామని రేంజర్‌ రెహమాన్‌ ‘న్యూస్‌టుడే’కు వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని