నేటి నుంచి బీఎస్‌-6.2 నిబంధన అమలు

వాహన కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో బీఎస్‌-6.2 ప్రమాణాలతో కూడిన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 01 Apr 2023 06:10 IST

బీఎస్‌-6 వాహనాల రిజిస్ట్రేషన్లూ యథాతథం

ఈనాడు, హైదరాబాద్‌: వాహన కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో బీఎస్‌-6.2 ప్రమాణాలతో కూడిన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తయారు చేసే వాహనాలు ఆ ప్రమాణాల మేరకు ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తయారీదారులకు స్పష్టంచేసింది. ఆ నిబంధనలను శనివారం నుంచి అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న బీఎస్‌-6 వాహనాలకు యథావిధిగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. 2000 సంవత్సరం నుంచి కాలుష్య నియంత్రణ ప్రమాణాలను కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ నిబంధనలను కఠినతరం చేస్తూ 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 ప్రమాణాలను అమల్లోకి తీసుకువచ్చారు. తాజాగా బీఎస్‌-6.2 ప్రమాణాలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. గతంలో బీఎస్‌ ప్రమాణాలను తొలుత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అమలు చేసేవారు. ఆ తరవాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేవారు. ఈసారి మాత్రం రాష్ట్రమంతా ఒకే విధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది.

ఆ వాహనాలకు ఇబ్బంది లేదు

నూతన ప్రమాణాలు అమలులోకి వచ్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా మార్కెట్‌లోకి విడుదల చేసిన వాహనాలను ఏప్రిల్‌ 1 తరువాత కూడా రిజిస్ట్రేషన్లు చేసేందుకు రవాణశాఖ సిద్ధమైంది. దీంతో బీఎస్‌-6 వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తారా? లేదా? అని కొంతకాలంగా సాగుతున్న తర్జనభర్జనలకు తెరపడినట్లయింది. మార్చి 31లోగా ఆయా కంపెనీలు తయారుచేసిన వాహనాలను కూడా రిజిస్ట్రేషన్‌ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు