JEE Main Result 2023: ‘మనోళ్లకే జై’ఈఈ

జేఈఈ మెయిన్‌ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి విజయభేరి మోగించారు. 1, 2 ర్యాంకులతోపాటు 6, 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు.

Updated : 30 Apr 2023 12:38 IST

1, 2, 6, 10 ర్యాంకులు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే
వెంకట్‌ కౌండిన్యకు 1.. లోహిత్‌ ఆదిత్యకు రెండో ర్యాంకు

ఈనాడు- హైదరాబాద్‌, అమరావతి: జేఈఈ మెయిన్‌ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి విజయభేరి మోగించారు. 1, 2 ర్యాంకులతోపాటు 6, 7, 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అంటే తొలి పది ర్యాంకుల్లో ఐదింటిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులే దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా జనవరి, ఏప్రిల్‌లలో జరిగిన జేఈఈ మెయిన్‌ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని శనివారం తెల్లవారుజామున జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ర్యాంకుల్ని ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్‌కౌండిన్య 300కు 300 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఒకటో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. నెల్లూరుకు చెందిన పునుమల్లి లోహిత్‌ ఆదిత్యసాయి సైతం 300 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో చదివిన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన సాయిదుర్గారెడ్డి 6వ ర్యాంకు, ఇ.మోహన్‌ శ్రీధర్‌ (హైదరాబాద్‌)కు 7వ ర్యాంకు, హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తిచేసిన అమలాపురానికి చెందిన కల్లకూరి సాయినాథ్‌ శ్రీమంత్‌ 10వ ర్యాంకు సాధించారు. అలానే వావిలాల చిద్విలాస్‌రెడ్డి 15, బిక్కిన అభినవ్‌చౌదరి 16, అభినీత్‌ మాజేటి (హైదరాబాద్‌) 18వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన పొంగూరు భాను దివ్యాంగుల విభాగంలో 8వ ర్యాంకు సాధించాడు.

100 లోపు ర్యాంకుల్లో 30కిపైగా..

100లోపు ర్యాంకుల్లో 30కిపైగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సాధించినట్లు అంచనా వేస్తున్నారు. మెయిన్‌లో 100లోపు అఖిల భారత ర్యాంకు సాధించినవారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ వెయ్యిలోపు ర్యాంకులు సాధిస్తారని, వారిలో దాదాపు అందరూ ఐఐటీల్లో..  బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లోనే ప్రవేశాలు పొందుతారని శ్రీచైతన్య విద్యాసంస్థల ఐఐటీ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ తెలిపారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యిలోపు ర్యాంకుల్లో 30 మంది బాలికలు ఉన్నారని తెలిపారు.

16 మందికి 100 పర్సంటైల్‌

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ రెండు విడతల్లో మొత్తం 43 మంది 100 పర్సంటైల్‌ సాధించగా... వారిలో ఏపీ, తెలంగాణ నుంచి 16 మంది ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 11 మంది ఉండడం విశేషం. రెండు విడతల పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 11,13,325 మంది పరీక్షలు రాశారు. వారిలో అమ్మాయిలు 3,38,963 మంది ఉన్నారు.

100 పర్సంటైల్‌ సాధించిన తెలంగాణ విద్యార్థులు

వెంకట్‌ కౌండిన్య, అల్లం సుజయ్‌, చిద్విలాస్‌రెడ్డి, అభినవ్‌చౌదరి, అభినిత్‌ మాజేటి, గుత్తికొండ అభిరామ్‌, మాధవ్‌ భరద్వాజ్‌, జ్ఞానకౌషిక్‌రెడ్డి, రమేష్‌ సూర్యతేజ, సాయిదుర్గారెడ్డి, ఈవూరి మోహనశ్రీధరరెడ్డి

ఏపీ విద్యార్థులు: సాయినాథ్‌ శ్రీమంత్‌, లోహిత్‌ ఆదిత్యసాయి, సి.మిఖిల్‌, ధర్మతేజరెడ్డి, వెంకటయోగేష్‌

* అమ్మాయిల్లో తెలంగాణ నుంచి కె.ఆశ్రితరెడ్డి 99.9986 పర్సంటైల్‌ సాధించి టాపర్‌గా నిలిచారు. ఏపీ నుంచి ప్రణతిశ్రీజ, రామిరెడ్డి మేఘన, పైదల వింధ్య, సువ్వాడ మౌనిషానాయుడు, వాకా శ్రీవర్షితలు పర్సంటైల్‌లో రాష్ట్ర టాపర్లుగా నిలిచారు.


ఈ-పుస్తకాలే ప్రపంచం

-పొంగూరు భాను, 8 ర్యాంక్‌ (దివ్యాంగుల విభాగం)

పుట్టుకతోనే అంధత్వం ఉన్నా.. అమ్మానాన్నలు సాధారణ పిల్లాడిలానే పెంచారు. మాది హైదరాబాద్‌లోని బాచుపల్లి. పదో తరగతి వరకు అంధుల పాఠశాలలో చదివా. ఇంటర్‌లో చేరాక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. మా అమ్మ చైతన్య కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తుండడం నాకు కలిసొచ్చింది. పుస్తకాలు, మెటీరియల్‌ను ఈ-బుక్స్‌ రూపంలో సమకూర్చింది. కళాశాల పూర్తయ్యాక నాకు ఈ-పుస్తకాలే ప్రపంచంగా మారాయి. క్లిష్టంగా ఉన్న వాటిని అమ్మ, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నా. మెయిన్స్‌ రాశాక.. నాకన్నా ముందే అమ్మా, నాన్నలు ర్యాంక్‌ వస్తుందని చెప్పారు.


బాంబే ఐఐటీ లక్ష్యం..
- వెంకట్‌ కౌండిన్య, ప్రథమ ర్యాంక్‌

ఇంటర్‌లో చేరినప్పుడే ఐఐటీ బాంబేలో చదవాలని నిర్ణయించుకుని జేఈఈపై దృష్టిపెట్టా. ప్రశ్నపత్రం ఎలా వచ్చినా.. కచ్చితమైన సమాధానం రాయాలని నిర్ణయించుకున్నా. కొన్ని నెలల నుంచి ప్రతి సబ్జెక్టులో ముఖ్యాంశాలను రాసుకొని.. వాటిని పదే పదే చదువుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాశా. అమ్మానాన్నలు సింగరాజు శ్రీఫణి, రాజరాజేశ్వరి నేర్పిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైంది.


ఒత్తిడికి గురికావొద్దు
- లోహిత్‌ ఆదిత్యసాయి, రెండో ర్యాంక్‌

కళాశాలలో తరచూ పరీక్షలు నిర్వహించడంతోపాటు సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ.. అధ్యాపకులు అన్ని విధాలా సహకరించారు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు షార్ట్‌ నోట్స్‌ రాసుకోవడం ఎంతో ముఖ్యం. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చేయాలనుకుంటున్నా. నాన్న శ్రీనివాస్‌రావు సివిల్‌ ఇంజినీరు, అమ్మ వరలక్ష్మి గృహిణి.


సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అవుతా
- సాయిదుర్గారెడ్డి, ఆరో ర్యాంక్‌

మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయడంతో పాటు రివిజన్‌, వారాంతపు పరీక్షలతో సబ్జెక్ట్‌పై పట్టు సాధించా. అధ్యాపకులు ఎంతో సహకరించారు. ఐఐటీ బొంబేలో సీఎస్‌ఈ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా రాణించాలనేది నా లక్ష్యం. మాది పిడుగురాళ్ల సమీపంలోని కోనంకి గ్రామం. నాన్న నారపరెడ్డి రైతు. అమ్మ దుర్గమ్మ గృహిణి.


ఇంటర్‌ ప్రారంభంలోనే అవగాహన
- సాయినాథ్‌ శ్రీమంత్‌, పదో ర్యాంక్‌

ఇంటర్‌ మొదటి సంవత్సరంలోనే జేఈఈ మెయిన్‌, అడ్వాన్డ్స్‌ పరీక్షలపై అవగాహన పెంచుకున్నా.   సంబంధిత పుస్తకాలు, గత ప్రశ్నపత్రాలతో సాధన చేశా. మాది డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం దుడ్డివారిఅగ్రహారం. నాన్న చినసుబ్బారావు ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహిస్తుండగా.. తల్లి సత్యకుమారి గృహిణి.


2.50 లక్షల మంది పాస్‌

మెయిన్‌లో కటాఫ్‌ స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. వీరిలో జనరల్‌ కేటగిరీ నుంచి 98,612 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 25,057, ఓబీసీ 67,613, ఎస్సీ 37,536, ఎస్టీ 18,752, దివ్యాంగుల (జనరల్‌) నుంచి 2,685 మంది ఉన్నారు. అడ్వాన్స్‌డ్‌కు వీరు ఆదివారం ఉదయం 10 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జూన్‌ 4న పరీక్ష జరగనుంది.


పెరిగిన కటాఫ్‌ స్కోర్‌

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించేందుకు, అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు ఈసారి కటాఫ్‌ స్కోర్‌ పెరిగింది. అతి తక్కువగా జనరల్‌ కేటగిరీలో, ఎక్కువగా ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో కటాఫ్‌ పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రశ్నపత్రాలు కొంత సులభంగా ఉండడం, ప్రత్యక్ష తరగతులు జరగడంతో విద్యార్థుల మధ్య పోటీపెరిగి కటాఫ్‌ పెరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


తీరు మారని ఎన్‌టీఏ

జేఈఈ ఫలితాల వెల్లడి విషయంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఏటా ముప్పతిప్పలు పెడుతున్న ఎన్‌టీఏ తీరు ఈసారీ మారలేదు. ఈ నెల 24న పరీక్షల తుది కీని వెల్లడించిన ఆ సంస్థ గత 4 రోజులుగా స్కోర్‌ కార్డులు, ర్యాంకుల్ని ప్రకటించకుండా లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులను ఉత్కంఠకు గురిచేసింది. కనీసం ఎప్పుడు విడుదల చేస్తున్నది కూడా ప్రకటించని ఎన్‌టీఏ.. ఎట్టకేలకు శనివారం తెల్లవారుజామున ఫలితాలను విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని