Wanaparthy: మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా..!

తాను జీవించి లేకున్నా.. తన అవయవాలు మరొకరికి ఉపయోగపడాలని పరితపించాడు ఆ యువవైద్యుడు. విద్యార్థి దశలోనే అవయవదానానికి సమ్మతి తెలపడమే కాదు.. ఆ దిశగా చైతన్యపరిచేలా కవిత కూడా రాశారు.

Updated : 04 May 2023 07:32 IST

రోడ్డు ప్రమాదంలో జీవన్మృతుడిగా మారిన యువవైద్యుడు.. ఆరుగురికి అవయవదానం
కన్నీరు పెట్టిస్తున్న నిఖిల్‌ కవిత

అమరచింత, న్యూస్‌టుడే: తాను జీవించి లేకున్నా.. తన అవయవాలు మరొకరికి ఉపయోగపడాలని పరితపించాడు ఆ యువవైద్యుడు. విద్యార్థి దశలోనే అవయవదానానికి సమ్మతి తెలపడమే కాదు.. ఆ దిశగా చైతన్యపరిచేలా కవిత కూడా రాశారు. ఇటీవల ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవన్మృతుడిగా మారగా.. కుటుంబసభ్యులు అతడి కోరిక నెరవేర్చారు. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన చిన్ని నిఖిల్‌(24) బెంగళూరులో బీఏఎంఎస్‌ పూర్తి చేసి అక్కడే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ 29న బెంగళూరు నుంచి ఏపీలోని కావలికి కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిఖిల్‌ తలకు బలమైన గాయం కాగా చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మే 1న బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ఆయన తల్లిదండ్రులు చిన్ని రమేశ్‌, భారతికి తెలిపారు. కుమారుడి కోరిక మేరకు అవయవదానం చేసేందుకు వారు అంగీకరించారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌ ఏర్పాటు చేసి నిఖిల్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచారు.


నిఖిల్‌ రాసిన కవిత ఇదీ..

నా తనువు మట్టిలో కలిసినా..
అవయవదానంతో మరొకరిలో జీవిస్తా..
ఒక అమ్మకు బిడ్డగా మరణించినా..
మరో అమ్మ పిలుపులో బతికేఉంటా..
ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు..
ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె
కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు
ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు
కాలేయం పనిచేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం నాలోని ప్రతి అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి..
ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి
ఇదే మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమతి
ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను, చిరంజీవినై ఉంటాను
అవయవదానం చేద్దాం..
మరో శ్వాసలో శ్వాసగా ఉందాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని