Telangana Tourism: పర్యాటకానికి కొత్త జోష్‌!

రాష్ట్రంలో పర్యాటకానికి సరికొత్త జోష్‌ వస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, అద్భుతంగా నిర్మాణమైన సచివాలయ సౌధం ఇప్పటికే రాజధానికి అదనపు ఆకర్షణలుగా మారాయి.

Updated : 04 May 2023 08:58 IST

రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్‌ హోటళ్లు
మన్యంకొండ గుడికి వెళ్లేందుకు రోప్‌వే
ఐటీ ఉద్యోగుల్ని ఆకర్షించేలా రంగనాయకసాగర్‌
రూ.వందల కోట్ల వ్యయంతో నూతన ప్రాజెక్టులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పర్యాటకానికి సరికొత్త జోష్‌ వస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, అద్భుతంగా నిర్మాణమైన సచివాలయ సౌధం ఇప్పటికే రాజధానికి అదనపు ఆకర్షణలుగా మారాయి. తాజాగా బుధవారం నెక్లెస్‌రోడ్‌లో నీరాకేఫ్‌  ప్రారంభమైంది. సమీపంలోనే అమరువీరుల స్మారకకేంద్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక కొత్త ప్రాజెక్టులకు పర్యాటక శాఖ రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్ని విహారం, వినోదాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దే కార్యాచరణ కార్యరూపంలోకి వస్తోంది. సందర్శకుల వసతికి కొత్తగా అయిదు బడ్జెట్‌ హోటళ్లను పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించనుంది. ఒక్కో హోటల్‌లో సగటున 20 గదులు ఉంటాయి. నిర్మాణం తుది దశలో ఉన్న ఓ బడ్జెట్‌ హోటల్‌, రిసార్టు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లో శిల్పారామాలు ఏర్పాటుకానున్నాయి.

విదేశీ పర్యాటకులు లక్ష్యంగా!

సిద్దిపేటకు 10 కిమీ దూరంలో రూ.110 కోట్ల వ్యయంతో రంగనాయకసాగర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాశయం. ప్రధానంగా ఐటీ ఉద్యోగుల్ని, అదేవిధంగా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యం. ‘ఒకేసారి రెండు వేల మందికి సరిపడా కాన్ఫరెన్స్‌ హాలు, జల వినోదం కోసం వాటర్‌ రిసార్టులు, వాటర్‌ ఫ్రంట్‌ ఫుడ్‌కోర్టు, జలాశయం అందాల్ని చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, పిల్లలకు పార్కులు వంటి అనేక ఆకర్షణలు ఇక్కడ రాబోతున్నాయి’ అని టూరిజం కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి.

సిద్దిపేటలో శిల్పారామం

సిద్దిపేటలో కోమటిచెరువు ఇప్పటికే పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తోంది. ఆ పక్కనే రూ.25 కోట్లతో శిల్పారామం, రూ.12.5 కోట్ల వ్యయంతో డైనోసార్‌ థీం పార్క్‌ నిర్మించనున్నారు. పాలకుర్తి సోమశ్వర ఆలయానికి వచ్చే భక్తుల వసతికి బడ్జెట్‌ హోటల్‌ నిర్మాణపనులు త్వరలో ప్రారంభం అవుతాయి.

అభయారణ్యంలో అద్దాల ఇల్లు

కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో రూ.10.77 కోట్లతో ఎకోటూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేశారు. 9 కాటేజీలు (జీ ప్లస్‌ 1), అద్దాల ఇల్లు (జీ ప్లస్‌ 2), ఫుడ్‌కోర్టు, నీళ్లపై నడుచుకుంటూ వెళ్లేందుకు జెట్టీ ఇక్కడ ప్రత్యేకతలు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. మహబూబ్‌నగర్‌ శిల్పారామం, కొత్తగూడెంలో బడ్జెట్‌ హోటల్‌ కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయి.

650 మీటర్ల రోప్‌పే.. రాష్ట్రంలోనే మొదటిసారి

మహబూబ్‌నగర్‌కు సమీపంలోని మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండపైకి ఘాట్‌ రోడ్డు ఉండగా, ఇప్పుడు కిందినుంచి పైకి 650 మీటర్ల దూరం రోప్‌వే నిర్మించనున్నారు. ఈ తరహా ఏర్పాటు రాష్ట్రంలోనే మొట్టమొదటిదిగా అధికారులు చెబుతున్నారు. రూ.50 కోట్ల వ్యయంతో రోప్‌వే, అన్నదాన సత్రం నిర్మించనున్నారు. మహబూబ్‌నగర్‌లో పెద్దచెరువు సుందరీకరణ,  నెక్లెస్‌రోడ్డు నిర్మాణానికి రూ.14.50 కోట్లు ఖర్చుచేయనున్నారు.


తాజాగా ప్రారంభమైనవి

* 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం
* రాష్ట్ర సచివాలయ భవనం
* హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో నీరా కేఫ్‌

ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి

* బొగత, మల్లూర్‌ స్ప్రింగ్‌ వాటర్‌ఫాల్స్‌ దగ్గర వసతి
* కిన్నెరసానిలో ఎకో టూరిజం రిసార్టు
* మహబూబ్‌నగర్‌లో శిల్పారామం
* కొత్తగూడెంలో బడ్జెట్‌ హోటల్‌


బడ్జెట్‌లో ఇక అధిక నిధులు

సింగపూర్‌, మలేసియాలకు మించిన పర్యాటక ఆకర్షణ ప్రాంతాలు ఇక్కడే అనేకం ఉన్నాయి. ఇక్కడి జలపాతాలు, రిజర్వాయర్లు సహా ప్రకృతి పర్యాటక ప్రదేశాల్ని అభివృద్ధి చేసి తెలంగాణను పెద్ద టూరిస్ట్‌ స్పాట్‌గా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనల్ని ముందుకు తీసుకెళుతున్నాం. రానున్న బడ్జెట్లలో పర్యాటకానికి నిధులు భారీగా పెరుగుతాయి. మానేరు రివర్‌ ఫ్రంట్‌, కొండపోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌ జలశయాలకు పర్యాటక అభివృద్ధిలో ప్రాధాన్యం ఉంది. మహబూబ్‌నగర్‌లో 26వేల ఎకరాల్లో నైట్‌ సఫారీ ఏర్పాటుచేయబోతున్నాం. హిమాయత్‌సాగర్‌, గండిపేటలనూ పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికలున్నాయి.

శ్రీనివాస్‌గౌడ్‌, పర్యాటక శాఖ మంత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని