Bank Deposits: బ్యాంకుల్లో వరదలా డిపాజిట్లు

రాష్ట్ర ప్రజలు బ్యాంకుల్లో డబ్బుల వరద పారిస్తుంటే.. బ్యాంకులు అంతకుమించి రుణాలు అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022-23) ముగింపు నాటికి అన్ని బ్యాంకుల్లో కలిపి ఉన్న డిపాజిట్లు రూ.6.83 లక్షల కోట్లకు చేరాయి.

Updated : 20 May 2023 08:42 IST

అన్నింట్లో కలిపి రూ.6.83 లక్షల కోట్లు
గతేడాదికన్నా రూ.50,481 కోట్లు పెరుగుదల
ప్రజలకు బ్యాంకులిచ్చిన రుణాలు రూ.8.13 లక్షల కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలు బ్యాంకుల్లో డబ్బుల వరద పారిస్తుంటే.. బ్యాంకులు అంతకుమించి రుణాలు అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022-23) ముగింపు నాటికి అన్ని బ్యాంకుల్లో కలిపి ఉన్న డిపాజిట్లు రూ.6.83 లక్షల కోట్లకు చేరాయి. ఇది అంతకుముందు ఏడాది(2021-22) కంటే రూ.50,481 కోట్లు అదనం. ఇదే కాలవ్యవధిలో బ్యాంకుల రుణాల పంపిణీ రూ.81,564 కోట్లు అదనంగా పెరిగి రూ.8.13 లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. డిపాజిట్ల మొత్తంతో పోలిస్తే ఇచ్చిన రుణాల నిష్పత్తి 119.16 శాతానికి చేరింది. గతేడాది ప్రాధాన్య రంగాలకు అత్యధికంగా రూ.2.01 లక్షల కోట్లకు పైగా అప్పులిచ్చినట్లు వివరించింది.

గతేడాది బ్యాంకుల పనితీరులో కొన్ని ముఖ్యాంశాలు

* రైతులకు పూర్తిస్థాయిలో పంట సాగు రుణాలు ఇవ్వలేకపోయాయి. లక్ష్యంలో 87శాతమే చేరుకొని రూ.59,060 కోట్లు పంపిణీ చేశాయి.

* వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనుల పెట్టుబడుల కోసం రూ.44,644 కోట్లు ఇచ్చారు. ఇది లక్ష్యంకన్నా 26శాతం అదనం.

* విద్యా రుణాలు రూ.679 కోట్లు పంపిణీ చేశారు. ఇది 25శాతం అదనం.

* గృహ రుణాల పద్దు కింద లక్ష్యం కంటే 44శాతం అదనంగా రూ.4,559 కోట్లు అందజేశారు.

* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.86,598 కోట్లు ఇచ్చారు. లక్ష్యం కంటే 74శాతం ఎక్కువ.

* ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రూ.8,135 కోట్లు పంపిణీ చేశారు. లక్ష్యంకన్నా 9శాతం తక్కువ. గతేడాది తగ్గిన సొమ్మును ఈ ఏడాది అదనంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది.

* రాష్ట్రంలో ఇంకా 241 గ్రామాలకు బ్యాంకు సదుపాయం లేదని, వాటిని ఈ ఏడాది బ్యాంకింగ్‌ సేవల పరిధిలోకి తేవాలని నిర్ణయించారు.

* ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద మొత్తం 1.11 కోట్ల బ్యాంకు ఖాతాలుంటే వీటిలో 90.63 లక్షల ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం పూర్తయింది. వీటిలో 83.06 లక్షల ఖాతాలకు రూపేకార్డు ఇచ్చారు.

* ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద రూ.9,266 కోట్ల రుణాలిచ్చారు.

* పీఎం స్వనిధి పథకం మొదటి దశ కింద 3.52 లక్షల మంది వీధి వ్యాపారులకు, రెండో దశలో 1.24 లక్షల మందికి రుణాలిచ్చారు.

* వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద రూ.995 కోట్ల అప్పులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని