లోపాలున్నా.. లేనట్టు తనిఖీలతో కనికట్టు
ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందేందుకు అవసరమైన కనీస ప్రమాణాలు ఉన్నాయో?లేవో? పరిశీలించేందుకు జేఎన్‌టీయూహెచ్ నిర్వహిస్తున్న తనిఖీలు కొందరు ఆచార్యులకు కాసులు కురిపిస్తున్నాయి.
ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల పరిశీలన పేరిట కాసుల వేట
కనీస ప్రమాణాలు లేకున్నా ఉన్నట్లు నివేదికల సమర్పణ
మళ్లీ తనిఖీలు చేయించే ఆలోచనలో జేఎన్‌టీయూహెచ్
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందేందుకు అవసరమైన కనీస ప్రమాణాలు ఉన్నాయో?లేవో? పరిశీలించేందుకు జేఎన్‌టీయూహెచ్ నిర్వహిస్తున్న తనిఖీలు కొందరు ఆచార్యులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎన్నో లోపాలు ఉన్నా...కనీస ప్రమాణాలు లేకున్నా కొన్ని తనిఖీ బృందాలు ఆయా యాజమాన్యాల నుంచి లంచాలు తీసుకొని అన్నీ సవ్యంగా ఉన్నాయని జేఎన్‌టీయూహెచ్‌కు నివేదికలు సమర్పించినట్లు తెలిసింది. ఈ అక్రమాలు వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా రావడంతో ఆ కళాశాలలను మళ్లీ తనిఖీ చేయించాలని భావిస్తున్నారు.ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు తన పరిధిలోని కళాశాలలను నిజ నిర్ధారణ బృందాల ద్వారా జేఎన్‌టీయూహెచ్ తనిఖీ చేయిస్తుంది. తగినంత మంది బోధన సిబ్బంది, ల్యాబ్‌లు, వాటిలో పరికరాలు, ఇతర కనీస వసతులు ఉన్నాయో లేవో తనిఖీ చేయించేందుకు ఒక సీనియర్ ఆచార్యుడు ఛైర్మన్‌గా, మరొకరు లేదా ఇద్దరు సభ్యులుగా కమిటీలను నియమిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరానికి (2023-24) సంబంధించి గత ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 223 ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలలను తనిఖీ చేయించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీలు నివేదికలను వర్సిటీకి సమర్పించాయి. వాటిని ఉన్నతాధికారులు పరిశీలించారు. ఒక్కో రోజు 15-21 కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులను పిలిచి ఈనెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉపకులపతి ఆచార్య కట్టా నర్సింహారెడ్డి సమక్షంలో ఆయా లోపాలను వారి ముందు ఉంచి విచారణ జరిపారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల ప్రతినిధులపై వీసీ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. డబ్బులిచ్చి అన్నీ సవ్యంగా ఉన్నట్లు రాయించుకుందామంటే తెలియదని అనుకున్నారా? మళ్లీ తనిఖీలు చేయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంకా మరో 15-20 కళాశాలలు మామూళ్లు ముట్టజెప్పి ఒకటీ అర తప్ప ప్రధాన లోపాలు ఏమీ లేవని రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కళాశాలల్లోనూ మరోసారి తనిఖీలు చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఒక్కో కళాశాల నుంచి రూ.2.50 లక్షలు
ఏ కళాశాల వారు ఎంత మొత్తాన్ని ముట్టజెప్పారన్న సమాచారాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు సేకరించినట్లు తెలిసింది. వరంగల్‌లోని ఇంజినీరింగ్ కళాశాల రూ.2.50 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఆ కళాశాలకు వెళ్లిన కమిటీ ఛైర్మన్‌పై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని కళాశాలలు రూ.2 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటిల్లో మూడు గ్రామీణ జిల్లాల్లో ఉండగా...మిగతావి హైదరాబాద్ చుట్టుపక్కలవని సమాచారం. అందులో రెండు ప్రముఖ గ్రూపు విద్యాసంస్థలు కూడా ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా తగినంత బోధన సిబ్బంది లేకపోవడం, ప్రయోగశాలల్లో నాసిరకం, ప్రమాణాలు లేని పరికరాలు ఉండటం లాంటి ప్రధాన లోపాలను కప్పిపుచ్చేందుకు కమిటీలకు ఆ కళాశాలలు లంచాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఆ కళాశాలల తనిఖీకి వెళ్లిన కమిటీ ఛైర్మన్లను కూడా పిలిచి ఉన్నతాధికారి ఒకరు మందలించినట్లు సమాచారం. కళాశాలలు పెద్దమొత్తంలో ఇస్తాయనే ఉద్దేశంతో కొందరు బతిమాలి మరీ తనిఖీలకు వెళ్తుంటారన్న ప్రచారం వర్సిటీలో ఎప్పటి నుంచో ఉంది. ‘లోపాలు ఉన్నా...లేకున్నా ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇస్తాం. డబ్బులు తీసుకున్నా లేనిది ఉన్నట్లు రాయరు. కాకపోతే చిన్న లోపాలను పెద్దగా చూపుతారనే భయంతో ఇస్తాం’ అని ఒక కళాశాలలో డైరెక్టర్‌గా పనిచేసిన ఒకరు చెప్పారు.
ఆకస్మిక తనిఖీలు చేస్తాం
తనిఖీలకు వెళ్లిన కమిటీ సభ్యులను కొన్ని కళాశాలల యాజమాన్యాలు ప్రలోభపెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. అందుకే ఆ కళాశాలల ప్రతినిధులను హెచ్చరించాను. వారు మాత్రం అలాంటిది తాము చేయలేదని చెబుతున్నారు. చర్యలు తీసుకుందామంటే పక్కా ఆధారాలు మాత్రం లభించలేదు. అయితే ఆ కళాశాలలపై నిఘా ఉంచాం. ఇప్పుడు మరోసారి తనిఖీలకు సమయం దొరకకున్నా...విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తాం. అప్పుడు గుర్తించిన లోపాలను బట్టి చర్యలు తీసుకుంటాం.
ఆచార్య కట్టా నర్సింహారెడ్డి, ఉపకులపతి, జేఎన్‌టీయూహెచ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!