జీవో 111 రద్దుతో పర్యావరణానికి తీరని నష్టం

జీవో 111 రద్దుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు.. పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసి కాంక్రీట్‌ జంగిల్‌గా పచ్చని భూములను మార్చే చర్యలను తప్పుపడుతున్నట్లు వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, పీపుల్స్‌ వరల్డ్‌ కమిషన్‌ ఆఫ్‌ డ్రాట్‌-ఫ్లడ్‌ ఛైర్మన్‌ రాజేంద్రసింగ్‌ పేర్కొన్నారు.

Published : 26 May 2023 03:38 IST

చెరువులను ‘కాళేశ్వరం’ నీటితో వందేళ్లు నింపుతామని చెప్పగలరా?
ప్రభుత్వం హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లను పరిరక్షించాలి
అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జీవో 111 రద్దుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు.. పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసి కాంక్రీట్‌ జంగిల్‌గా పచ్చని భూములను మార్చే చర్యలను తప్పుపడుతున్నట్లు వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, పీపుల్స్‌ వరల్డ్‌ కమిషన్‌ ఆఫ్‌ డ్రాట్‌-ఫ్లడ్‌ ఛైర్మన్‌ రాజేంద్రసింగ్‌ పేర్కొన్నారు. జీవో 111ను పూర్తి స్థాయిలో ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఇటీవల ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారని తెలిపారు. దీంతోపాటు హెచ్‌ఎండీఏ నిబంధనలే ఈ ప్రాంతంలో వర్తిస్తాయన్నారని పేర్కొన్నారు. నగరానికి కృష్ణా, గోదావరి నుంచి సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండగా విశాలమైన ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి అభివృద్ధిని ఆపడం సరైనది కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జంట జలాశయాలకు నీళ్లు వస్తాయని మంత్రి పేర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తాను విభేదిస్తున్నట్లు రాజేంద్రసింగ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

‘ఈ జీవో రద్దుతో 1.32 లక్షల ఎకరాలు, 84 గ్రామాలు, 7 మండలాలు కాంక్రీట్‌ జంగిళ్లుగా మారుతాయి. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ పరీవాహక ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. జీవో రద్దు అనేది బాధ్యతారహితమైన నిర్ణయం. స్థిరాస్తి వ్యాపారం విస్తరణతో ప్రభుత్వ రాబడిని పెంచుకునేందుకు తాత్కాలికంగా మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కర్ణాటకలో వస్తున్న వరదల వంటి పరిస్థితిని తెలంగాణ కూడా ఎదుర్కోక తప్పదు. జీవో రద్దు చేయడమంటే జంట జలాశయాల రక్షణ కవచాన్ని తొలగించడమే. సుప్రీంకోర్టు, ఎన్జీటీలు ఇచ్చిన పలు తీర్పులకు వ్యతిరేకం కూడా. కాళేశ్వరం ఎత్తిపోతలతో వచ్చే వందేళ్లు నీరివ్వగలమని ప్రభుత్వం భరోసా ఇవ్వగలదా. నదిలోని నీటిని ఎత్తిపోయడానికి పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయాలి. జంట జలాశయాలకు ప్రకృతి సిద్ధమైన వర్షపు నీటిప్రవాహం ఉండగా ప్రభుత్వం కృత్రిమ పద్ధతిలో ఈ చెరువులను నింపడం ఎందుకు. ప్రకృతిసిద్ధమైన వనరులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంపైనా ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48-ఎ సూచిస్తోంది. జంట జలాశయాల పరీవాహక ప్రాంతాలను రక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నాను. ఒకవేళ ప్రభుత్వం ఇలాగే ముందుకెళ్తే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వెనుకాడం. భూపరిరక్షణ చర్యల్లో భాగంగా ఈ చెరువుల పరీవాహక ప్రాంత రక్షణకు కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి తీసుకొస్తాం’ అని రాజేంద్రసింగ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని