Eamcet: ఈసారీ ‘స్లైడింగ్‌’ పెత్తనం కళాశాలలదేనా?

యాజమాన్య కోటా (బి కేటగిరి) కింద బీటెక్‌ సీట్లను బహిరంగ వేలం తరహాలో అమ్ముకుంటున్నా అడ్డుకోలేని విద్యాశాఖ..70 శాతం కన్వీనర్‌ సీట్ల మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకోకుండా కళాశాలల యాజమాన్యాల చేతుల్లో పెడుతోంది.

Updated : 27 May 2023 08:15 IST

కన్వీనర్‌ ద్వారా సీట్ల భర్తీకి అవకాశమున్నా పట్టించుకోని విద్యాశాఖ
బ్రాంచీలు మారి ఆర్థికంగా నష్టపోతున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: యాజమాన్య కోటా (బి కేటగిరి) కింద బీటెక్‌ సీట్లను బహిరంగ వేలం తరహాలో అమ్ముకుంటున్నా అడ్డుకోలేని విద్యాశాఖ..70 శాతం కన్వీనర్‌ సీట్ల మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకోకుండా కళాశాలల యాజమాన్యాల చేతుల్లో పెడుతోంది. మూడు విడతల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తర్వాత కళాశాలల్లోనే ఇతర కోర్సుల్లోకి మారే స్లైడింగ్‌ ప్రక్రియను కూడా కళాశాలలే చేస్తుండడంతో కోర్సు మారిన వేలాది మంది విద్యార్థులు బోధనా రుసుములకు అర్హత కోల్పోతున్నారు. మొత్తానికి కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీలో విద్యాశాఖ ఉదాసీనత కళాశాలలకు కాసుల వర్షం కురిపిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం (2023-24)లో బీటెక్‌ సీట్ల భర్తీకి ప్రవేశాల కాలపట్టిక ఖరారుకు శనివారం ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ భేటీ కానుంది. ఈసారైనా ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ద్వారా స్లైడింగ్‌ ప్రక్రియను చేపడతారా? కళాశాలల యాజమాన్యాలకే వదిలేస్తారా? అన్నది వేచిచూడాల్సి ఉంది. విద్యార్థి సంఘాలు మాత్రం కన్వీనర్‌ ద్వారా చేపడితే ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చెల్లించాల్సి వస్తుందని భావించే స్లైడింగ్‌ను సర్కార్‌ చేపట్టడం లేదని ఆరోపిస్తున్నాయి.

5వేల మందికి నష్టం..: రాష్ట్రంలోని దాదాపు 175 ప్రభుత్వ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మూడు విడతల కౌన్సెలింగ్‌లో 45వేల నుంచి 50వేల సీట్లే భర్తీ అవుతున్నాయి. ఆ తర్వాత విద్యార్థి తాను చేరిన బ్రాంచి నుంచి ఆ కళాశాలలోని మరో బ్రాంచిలోకి మారేందుకు స్లైడింగ్‌కు అవకాశం ఇస్తారు. ఆయా కళాశాలలు ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు ఖాళీలున్నాయో ప్రకటిస్తే విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. మెరిట్‌ ఆధారంగా సీట్లను కేటాయించాలి. అయితే డిమాండ్‌ ఉన్న బ్రాంచీల్లో ఖాళీ సీట్లన్నిటినీ చూపించడం లేదన్న ఆరోపణలు కొన్నేళ్లుగా వస్తున్నాయి. ఉదాహరణకు సీఎస్‌ఈలో 5 సీట్లు ఖాళీ ఉంటే నాలుగు మాత్రమే ఉన్నట్లు చూపి, వాటిని స్లైడింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరో సీటును తర్వాత జరిగే స్పాట్‌ కౌన్సెలింగ్‌లో అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా  ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మారితే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు కూడా అర్హత ఉండదు. అలా ఏటా దాదాపు 5 వేల మంది వరకు నష్టపోతున్నారని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని