Artificial intelligence: కృత్రిమ మేధతో కొలువులకు కొత్తరూపు

‘‘కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో అన్ని రంగాల్లో కొలువులు తగ్గుతాయనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.   ఇది వాస్తవం కాదు. ఉదాహరణకు హాలండ్‌లోని ఒక హోటల్‌లో గతంలో సర్వర్లు ఉండేవారు.

Updated : 12 Jun 2023 10:16 IST

భవిష్యత్తులో అన్ని కంపెనీలూ ఏఐ నిపుణుల్ని పెట్టుకుంటాయి
‘ఐరావత్‌’తో అద్భుతాలు సాధిస్తాం
‘ఈనాడు’తో ఆచార్య దీపక్‌ గార్గ్‌

ఈనాడు, వరంగల్‌: ‘‘కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో అన్ని రంగాల్లో కొలువులు తగ్గుతాయనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.   ఇది వాస్తవం కాదు. ఉదాహరణకు హాలండ్‌లోని ఒక హోటల్‌లో గతంలో సర్వర్లు ఉండేవారు. వారి స్థానంలో ఇప్పుడు రోబోలను ప్రవేశపెట్టారు. విచిత్రమైన విషయం ఏమిటంటే రోబోల నిర్వహణ కోసం గతంలో కన్నా ఎక్కువ మానవ వనరులను అక్కడ వినియోగిస్తున్నారు. అంటే ఆ రంగంలో కొలువులు పోలేదు. వాటి రూపం మారిందంతే’’ అని ఏఐ నిపుణులు ఆచార్య దీపక్‌ గార్గ్‌ వెల్లడించారు. ‘ఐరావత్‌’ సూపర్‌ కంప్యూటర్‌’ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏడుగురు ఏఐ నిపుణుల్లో ఈయన ఒకరు. ఇటీవల వరంగల్‌ ఎస్సార్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్న ఆయన గతంలో ఏఐసీటీఈ, న్యాక్‌, యూజీసీలలో సభ్యుడిగా పనిచేశారు. ‘లీడింగ్‌ ఇండియా.ఏఐ’ అనే ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తును శాసించనున్న ఏఐ ఎలా కీలకం కానుంది? విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి? తదితర అంశాలను ఆయన ‘ఈనాడు’తో వివరించారు. విశేషాలు ఆయన మాటల్లోనే..

భవిష్యత్తుకు కీలకం

ఏఐ.. భవిష్యత్తులో ఎంతో కీలకం కానుంది. ఇది ఏదో ఒక రంగానికే పరిమితం కాదు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు అన్నింటిలోకీ చొచ్చుకెళుతోంది. ఉదాహరణకు సాగుతో అనుసంధానిస్తే వాతావరణం, ఉష్ణోగ్రతలు వంటివాటిని విశ్లేషిస్తుంది. పంటలకు ఏ మేర మందులు చల్లాలన్న విషయాన్ని చెబుతుంది. రక్షణ రంగంలోనే ఏఐ ఆధారంగా నేనో ప్రాజెక్టు చేశాను. సరిహద్దుల వద్ద నిఘా వ్యవస్థను దీంతో అనుసంధానించే వ్యవస్థను విజయవంతంగా పూర్తి చేశాం.

అన్నివిభాగాలకూ అవసరమే..

ఏఐ అంటే ఒక్క కంప్యూటర్‌ సైన్స్‌లో విద్యార్థులే నేర్చుకోవాలనుకుంటే పొరపాటు. మెకానికల్‌, సివిల్‌ తదితర విభాగాల వాళ్లు సైతం దీనిపై పట్టు సాధించాలి. ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్‌ లాంటి సాంకేతికత డేటాను లోతుగా తీసుకొన్నా మళ్లీ మనకు అర్థమయ్యే విధంగా విశ్లేషించి అందించేది కృత్రిమ మేధే. భవనాల నిర్మాణంలోనూ ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి కంపెనీ ప్రత్యేకంగా ఏఐ నిపుణుల్ని నియమిస్తుంది.

‘సూపర్‌’ ముందడుగు

చైనా ఇప్పుడు ఏఐలో ఎంతో ముందుంది. మనం ప్రపంచంలోనే మేటిగా నిలవాలనే లక్ష్యంతో దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ‘ఐరావత్‌’ సూపర్‌ కంప్యూటర్‌ ఆవిష్కరణ మనం ఈ రంగంలో వేసిన గొప్ప ముందడుగు. భవిష్యత్తులో విద్య, పరిశోధన, అంకుర సంస్థలు, పారిశ్రామిక వర్గాల్లో భారత్‌ మేటిగా నిలవడంలో ఇదెంతో ఉపకరిస్తుంది.


దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐరావత్‌’ సూపర్‌ కంప్యూటర్‌ ఇటీవల జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ సూపర్‌ కంప్యూటింగ్‌ సదస్సు (ఐఎస్‌సీ 2023)లో ప్రపంచ సూపర్‌ కంప్యూటర్లలో 75వ ర్యాంకు సాధించింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా నడిచే వాటిలో దేశంలోనే అతి పెద్ద, అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌గా ఇది ఘనత సాధించింది. పుణేలోని ‘సీ-డాక్‌’లో ఏర్పాటుచేసిన ఈ అద్భుత కంప్యూటర్‌ 13,170 టెరాఫ్లాప్స్‌ వేగంతో, 81,344 కోర్‌ ప్రాసెసర్‌తో నడుస్తుంది. భారత్‌ భవిష్యత్తులో 5 ట్రిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని ఒడిసిపట్టాలని పెట్టుకున్న లక్ష్యంలో ఈ సూపర్‌ కంప్యూటర్‌ బ్రహ్మాస్త్రం లాంటిదిగా చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని