ఎయిమ్స్‌ తరహాలో టిమ్స్‌కూ స్వయం ప్రతిపత్తి

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆసుపత్రులను ప్రపంచస్థాయి వైద్య విజ్ఞాన సంస్థలుగా ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

Published : 06 Aug 2023 04:59 IST

10 వేల సూపర్‌ స్పెషాలిటీ పడకల ఏర్పాటు
‘టిమ్స్‌ బిల్లు’పై చర్చలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆసుపత్రులను ప్రపంచస్థాయి వైద్య విజ్ఞాన సంస్థలుగా ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. వీటితో ప్రజలకు అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు వైద్య విద్యార్థులకు శిక్షణ అందించాలనేది లక్ష్యమని వెల్లడించారు. టిమ్స్‌ ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి ఉంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే నిమ్స్‌కు ఈ హోదా కల్పించడం ద్వారా చాలా అభివృద్ధి సాధించిందని చెప్పారు. ‘టిమ్స్‌ యాక్ట్‌-2023’ బిల్లును శాసనసభలో శనివారం ప్రతిపాదిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘ఎయిమ్స్‌, పీజీఐ చండీగఢ్‌ తరహాలో టిమ్స్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి టిమ్స్‌ యాక్ట్‌ను చట్టసభల ఆమోదం కోసం ప్రవేశపెట్టాం. టిమ్స్‌ ఆసుపత్రులను హైదరాబాద్‌ నగరం నలుమూలలా నిర్మిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు హైదరాబాద్‌ నిమ్స్‌, వరంగల్‌ హెల్త్‌ సిటీతోపాటు టిమ్స్‌ ఆసుపత్రుల్లో 10 వేల సూపర్‌ స్పెషాలిటీ పడకలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో 16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు ఏర్పాటవుతాయి. సూపర్‌ స్పెషాలిటీల్లో నర్సింగ్‌, పారామెడికల్‌ విద్యతోపాటు గుండె, కిడ్నీ, లివర్‌, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌, ట్రామా, ఎండోక్రైనాలజీ, ఎలర్జీ, రుమటాలజీ తదితర 30 విభాగాలుంటాయి. 200 మంది ఫ్యాకల్టీ, 500 మంది వరకు రెసిడెంట్‌ వైద్యులు, 26 ఆపరేషన్‌ థియేటర్లు, గుండెకు సంబంధించి క్యాత్‌ల్యాబ్‌, కిడ్నీలకు డయాలసిస్‌, క్యాన్సర్‌కు రేడియేషన్‌, కీమోథెరపీతోపాటు సీటీస్కాన్‌, ఎంఆర్‌ఐ సేవలను అందుబాటులో ఉంచుతాం. వెయ్యి ఆక్సిజన్‌ పడకలు, 300 ఐసీయూ పడకలుంటాయి’’ అని మంత్రి వివరించారు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని